EVV Cinema: పాతికేళ్ళ పకపకల 'ఇ.వి.వి.సినిమా'

ABN , Publish Date - Feb 18 , 2025 | 01:20 PM

తన గురువు జంధ్యాల (Jandhayla) చూపిన బాటలోనే పయనిస్తూ, ఎలాంటి కథకైనా హాస్యం అద్ది విజయాలను చవిచూశారు ఇ.వి.వి. సత్యనారాయణ. నిర్మాతగా తన మొదటి సినిమా 'చాలా బాగుంది'లోనూ అదే పంథాను అనుసరించారు.

సరిగా పాతికేళ్ళ క్రితం అంటే 2000 ఫిబ్రవరి 18న 'ఇ.వి.వి. సినిమా' బ్యానర్ పై రూపొందిన తొలి చిత్రం 'చాలా బాగుంది' (ChalaBagundi) విడుదలయింది. అప్పటికే తన హాస్య చిత్రాలతో తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్న ఇ.వి.వి. సత్యనారాయణ (EVV Satyanarayana) తొలిసారి నిర్మాతగా మారి 'ఇ.వి.వి. సినిమా' బ్యానర్ నెలకొల్పి తొలి ప్రయత్నంగా 'చాలా బాగుంది' నిర్మించి, దర్శకత్వం వహించారు. తన గురువు జంధ్యాల (Jandhayla) చూపిన బాటలోనే పయనిస్తూ, ఎలాంటి కథకైనా హాస్యం అద్ది విజయాలను చవిచూశారు ఇ.వి.వి. సత్యనారాయణ. నిర్మాతగా తన మొదటి సినిమా 'చాలా బాగుంది'లోనూ అదే పంథాను అనుసరించారు. 'చాలా బాగుంది' కథలో బరువుంది, దరువుంది, నవ్వులున్నాయి, పువ్వులున్నాయి - నవరసాలనూ మిళితం చేసి ఆ చిత్రం రూపొందించారు ఇ.వి.వి. ఈ సినిమాలో శ్రీకాంత్ (Srikanth), వడ్డే నవీన్ (Vadde Naveen)హీరోలుగా నటించగా, మాళవిక (Malavika), ఆషా శైనీ (Asha Saini) హీరోయిన్స్. ఈ సినిమాలో మాళవిక తండ్రిగా నటించిన ప్రముఖ రచయిత ఎల్.బి.శ్రీరామ్ (L B SriRam) మంచి మార్కులు సంపాదించారు. ఆ తరువాత రచనకు దూరంగా జరిగి, నటనలోనే సాగారు ఎల్బీ శ్రీరామ్.


EVV'.jpg

తొలి చిత్రంతోనే విజయం సాధించిన 'ఇ.వి.వి. సినిమా' బ్యానర్, తరువాత "మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, తొట్టి గ్యాంగ్, ఆరుగురు పతివ్రతలు, నువ్వంటే నాకిష్టం, కితకితలు, అత్తిలి సత్తిబాబు, ఫిట్టింగ్ మాస్టర్, కత్తి కాంతారావు" వంటి చిత్రాలను నిర్మించింది. ఈ చిత్రాలన్నీ ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలోనే రూపొందాయి. ఈ చిత్రాలలో సింహభాగం ఇ.వి.వి. తనయుడు అల్లరి నరేశ్ (Allari Naresh) హీరోగా నటించడం విశేషం! వీటిలో'నువ్వంటే నాకిష్టం' సినిమాలో ఇ.వి.వి. సత్యనారాయణ ఇద్దరు తనయులు ఆర్యన్ రాజేశ్(Aryan Rajesh), అల్లరి నరేశ్ హీరోలుగా నటించడం మరో విశేషం! ఇ.వి.వి మరణానంతరం ఆయన తనయులు 'ఇ.వి.వి. సినిమా' పతాకంపై మళ్ళీ సినిమాలు తీసే ప్రయత్నం చేశారు. తన అన్న ఆర్యన్ రాజేశ్ నిర్మాతగా, తాను హీరోగా 'బందిపోటు' అనే చిత్రంలో నటించారు నరేశ్. ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో మళ్ళీ నిర్మాణం మాట ఎత్తలేదు ఇ.వి.వి. తనయులు. రాబోయే రోజుల్లో మళ్ళీ 'ఇ.వి.వి. సినిమా' బ్యానర్ పై చిత్రాలు వస్తాయేమో చూడాలి.

Updated Date - Feb 18 , 2025 | 01:20 PM