NTR: డి.వి.యస్. ప్రొడక్షన్స్ ... మంగమ్మ శపథంకు 60 ఏళ్ళు

ABN , Publish Date - Mar 05 , 2025 | 07:02 PM

కథ, కథనం, సంగీతం, సాహిత్యం, కుటుంబవిలువలు వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ డి.వి.యస్. ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాలను నిర్మించి ఆకట్టుకుంది. ఈ సంస్థకు శ్రీకారం చుట్టిన చిత్రం నటరత్న యన్టీఆర్ హీరోగా రూపొందిన 'మంగమ్మశపథం'.

తెలుగు చిత్రసీమకు వెలుగు తెచ్చిన చిత్రాలను నిర్మించిన సంస్థల్లో డి.వి.యస్. ప్రొడక్షన్స్ స్థానం ప్రత్యేకమైనది. ఒకప్పుడు డి.వి.యస్. ప్రొడక్షన్స్ సంస్థ నుండి ఓ చిత్రం వస్తోందంటే చాలు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. కథ, కథనం, సంగీతం, సాహిత్యం, కుటుంబవిలువలు వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ డి.వి.యస్. ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాలను నిర్మించి ఆకట్టుకుంది. ఈ సంస్థకు శ్రీకారం చుట్టిన చిత్రం నటరత్న యన్టీఆర్ (NTR) హీరోగా రూపొందిన 'మంగమ్మశపథం'. ఈ సినిమా ఘనవిజయంతో నిర్మాత డి.వి.యస్.రాజు (DVS Raju) తన అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మిస్తూ తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించారు.

యన్టీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు ప్రముఖ నిర్మాత డి.వి.యస్.రాజు. యన్టీఆర్ సొంత సంస్థ 'యన్.ఏ.టి.' (NAT)బ్యానర్ లోనే భాగస్వామిగా ఉన్నారు రాజు. తరువాత ఏయన్నార్ హీరోగా ప్రగతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పై 'మా బాబు' అనే చిత్రం నిర్మించారు. ఆ సినిమా పెద్దగా అలరించలేదు. యన్టీఆర్ తోనే తరువాతి చిత్రం నిర్మించాలని ఆశించారు. అప్పుడు యన్టీఆర్ సూచన మేరకే డి.వి.యస్. ప్రొడక్షన్స్ సంస్థ ను నెలకొల్పారు. తొలి ప్రయత్నంగా బి.విఠలాచార్య (B.Vittala Acharya) దర్శకత్వంలో 'మంగమ్మశపథం' నిర్మించారు. ఈ సినిమా 1965 మార్చి 6వ తేదీన విడుదలై విజయఢంకా మోగించింది.


తెలుగు నేలపైనే కాదు యావత్ దక్షిణాదిన 'మంగమ్మశపథం' కథ జనాల మదిలో నాట్యం చేసింది. ఆ కథతోనే 1943లో తమిళనాట 'మంగమ్మశపథం' అనే సినిమా రూపొందింది. ఇందులో అందాలతారగా జేజేలు అందుకున్న వైజయంతి మాల తల్లి వసుంధర మంగమ్మగా నటించారు. ఆ పాత్రనే తెలుగులో జమున ధరించి అలరించారు. తనను లోబరచుకోవడానికి రాజు చేసిన ప్రతిజ్ఞకు మంగమ్మ శపథం చేసి ఎలా నెరవేర్చుకుంది అన్నదే కథ.. ఈ కథను విఠలాచార్య తెరకెక్కించిన తీరు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. సముద్రాల జూనియర్ ఈ చిత్రానికి రచన చేశారు. టి.వి.రాజు సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు కొసరాజు, సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు. యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో మరో నాయికగా ఎల్.విజయలక్ష్మి నటించారు. ఇతర పాత్రల్లో రేలంగి, గిరిజ, రమణారెడ్డి, రాజనాల, అల్లు రామలింగయ్య అభినయించారు. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో రాజశ్రీ నర్తించడం కనువిందు చేసింది.

డి.వి.యస్. ప్రొడక్షన్స్ తొలి చిత్రంగా తెరకెక్కిన 'మంగమ్మశపథం' ఘనవిజయం సాధించింది. తరువాత యన్టీఆర్ తో డి.వి.యస్.రాజు 'పిడుగు రాముడు, తిక్క శంకరయ్య, గండికోట రహస్యం, చిన్ననాటి స్నేహితులు, ధనమా దైవమా' వంటి చిత్రాలు నిర్మించారు. ఈ చిత్రాలన్నిటికీ టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. వీటిలో ఓ సినిమా మినహా అన్నీ కమర్షియల్ సక్సెస్ చూసినవే. యన్టీఆర్ ఇమేజ్ తో రిపీట్ రన్స్ లో ఈ అన్ని సినిమాలు వసూళ్ళు చూశాయి. తరువాతి రోజుల్లో శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతోనూ డి.వి.యస్. ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాలు నిర్మించింది. ఈ సంస్థ నుండి "జీవనజ్యోతి, దేవుడులాంటి మనిషి, జీవితనౌక, కాలాంతకులు, ప్రెసిడెంట్ పేరమ్మ, అల్లుడు పట్టిన భరతం, ముఝే ఇన్సాఫ్ చాహియే, చాణక్య శపథం, భానుమతిగారి మొగుడు, దోషి-నిర్దోషి, ఛాంపియన్, రాజధాని" వంటి చిత్రాలు వెలుగు చూశాయి. వీటిలో అనేకం జనాన్ని ఆకట్టుకున్నాయి. డి.వి.యస్. ప్రొడక్షన్స్ సంస్థకు శ్రీకారం చుట్టిన 'మంగమ్మశపథం' తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించడం విశేషం!

Also Read: SSMB29: రాజమౌళి - మహేశ్ మూవీ ఏది నిజం... ఏది అబద్దం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 05 , 2025 | 07:02 PM