Chiranjeevi: మూడు పదుల 'అల్లుడా మజాకా'
ABN , Publish Date - Feb 25 , 2025 | 02:14 PM
చిరంజీవి, ఇవీవీ సత్యనారాయణ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క చిత్రం 'అల్లుడా మజాకా'. మూడు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా పలు వివాదాలకు తెరతీసింది.
వివాదాలు తలెత్తినప్పుడు వాటిని విజయసోపానంగా మార్చుకున్న కొన్ని సినిమాలున్నాయి. అలాంటి వాటిలో మెగాస్టార్ చిరంజీవి హీరో (Chiranjeevi) గా రూపొందిన 'అల్లుడా మజాకా'నూ చేర్చవచ్చు. ఇ.వి.వి. సత్యనారాయణ (EVV Satyanarayana) దర్శకత్వంలో కె.దేవీవరప్రసాద్ నిర్మించిన 'అల్లుడా మజాకా' చిత్రం 1995 ఫిబ్రవరి 25న విడుదలయింది. అప్పట్లో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సీన్స్ వల్లనే 'అల్లుడా మజాకా'పై వివాదం రేకెత్తింది. అత్త, మరదళ్ళు వారితో హీరో చేసే రొమాన్స్ చూసి ఛీ కొట్టిన కొందరు సదరు సన్నివేశాలను తొలగించాలనీ డిమాండ్ చేశారు. సెన్సార్ బోర్డ్ జోక్యంతో తరువాత అన్నీ సద్దుమణిగాయి. ఈ సినిమాపై రివ్యూ రాసిన సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరిపైనా చిరంజీవి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ రివ్యూలో ఏ పొరపాటూ లేదని తరువాత సినీజనమే అంగీకరించారు. అలా అందరిలోనూ ఆసక్తి రేపిన 'అల్లుడా మజాకా' చిత్రం మంచి విజయం సాధించింది. ఆ యేడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది.
కథ విషయానికి వస్తే - తనకు అన్యాయం చేసిన వసుంధర, పెద్దయ్యలపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే కథ. ఇందులో వసుంధర కూతుళ్ళను హీరో సీతారాముడు ఆటపట్టించిన తీరు వినోదం పంచుతుంది. ఈ తరహా కథలు కొత్తవేమీ కావు. పోసాని (Posani) కృష్ణమురళి రాసిన ఈ కథను ఇ.వి.వి. సత్యనారాయణ నడిపిన తీరు ఆకట్టుకుంది. అంతకు ముందు చిరంజీవి నటించిన 'అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు' కథ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అందులో అత్తకు ఒకే కూతురు, ఇందులో ఇద్దరు కూతుళ్ళు ఉండడం తేడా! ఆ తరువాత వచ్చిన నాగార్జున చిత్రం 'అల్లరి అల్లుడు'లో ఓ అత్త, ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. అందువల్ల 'అల్లుడా మజాకా' వచ్చిన రోజుల్లో ఆ సినిమానూ పోల్చారు. ఇలా జనం నోళ్ళలో నానుతూనే సినిమా సక్సెస్ రూటులో సాగిపోయింది.
చిరంజీవి సీతారాముడిగా నటించిన ఈ చిత్రంలో వసుంధరగా లక్ష్మి, ఆమె కూతురు పప్పిగా రమ్యకృష్ణ (Ramayakrishna) , బాబీగా రంభ (Rambha) నటించారు. ఈ చిత్రానికి కోటి (Koti) సంగీతం సమకూర్చగా, వేటూరి, భువనచంద్ర పాటలు రాశారు. "మావూరి దేవుడు.. ", "అత్తో అత్తమ్మ కూతురో...", "చిన్నపాపకేమో చీరకాస్త..." అంటూసాగే పాటలు అలరించాయి. ఈ చిత్రం 20కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా, వివాదాలు తలెత్తిన నేపథ్యంలో కాబోలు చిరంజీవి, ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో మళ్ళీ నటించలేదు.