Chiru- NBK: బాలకృష్ణ సినిమాకు చిరంజీవి ప్రచారం
ABN , Publish Date - Mar 18 , 2025 | 06:47 PM
బాక్సాఫీస్ బరిలో నువ్వా నేనా అంటూ నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న బాలకృష్ణ, చిరంజీవి రియల్ లైఫ్ లో మంచి మిత్రులు. అందుకు నిదర్శనంగా చిరంజీవి ఇంట్లో ఫంక్షన్స్ లో బాలయ్య చేసిన సందడి, బాలయ్య అభినందన సభలో చిరంజీవి మురిపించిన వైనం అందరికీ తెలిసిందే
బాక్సాఫీస్ బరిలో నువ్వా నేనా అంటూ నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న బాలకృష్ణ(NBK), చిరంజీవి (Chiranjeevi)రియల్ లైఫ్ లో మంచి మిత్రులు. అందుకు నిదర్శనంగా చిరంజీవి ఇంట్లో ఫంక్షన్స్ లో బాలయ్య చేసిన సందడి, బాలయ్య అభినందన సభలో చిరంజీవి మురిపించిన వైనం అందరికీ తెలిసిందే! కానీ, బాక్సాఫీస్ వార్ లో మాత్రం ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ సాగుతుంటారు. వారి ఫ్యాన్స్ కూడా పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటూనే ఉంటారు. ఇక 34 ఏళ్ళ క్రితం చిరు, బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ మరింత రంజుగా ఉండేది. అలాంటి సమయంలో బాలయ్య సినిమాకు చిరంజీవి ప్రచారం చేయడం విశేషంగానే మారింది. ఆ సినిమా ఏదంటే 'ఆదిత్య 369'. ఈ చిత్రం 1991 జూలై 18న విడుదలయింది. భారతదేశంలో తొలి సోషియో హిస్టారికల్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ గా 'ఆదిత్య 369' నిలచింది. ఇప్పటి దాకా ఆ జానర్ లో మరో మూవీ వెలుగు చూడలేదనుకోండి. అది మరో విశేషం!
సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) దర్శకత్వంలో మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో 'ఆదిత్య 369' రూపొందింది. ఈ సినిమాకు బాలు సమీపబంధువు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత. టైటిల్ కార్డ్స్ లో ఆయన సతీమణి ఎస్.అనితా కృష్ణ అన్న పేరు కనిపిస్తుంది. నిజానికి శివలెంక కృష్ణప్రసాద్ అసలు నిర్మాత. ఈ నాటికీ ఆయనను 'ఆదిత్య 369' నిర్మాతగానే జనం గుర్తిస్తూ ఉంటారు. అందుకు కృష్ణప్రసాద్ గర్వంగా ఫీలవుతూ ఉంటారు. బాలకృష్ణ అంగీకరిస్తేనే ఈ సినిమా - లేదంటే లేదు అన్న రీతిన సాగింది. ఎందుకంటే ఇందులో కథానాయకుడు కృష్ణకుమార్ పాత్రను ఎవరైనా పోషించగలరు. కానీ టైమ్ మిషన్ ఎక్కి భూతకాలంలో విజయనగర సామ్రాజ్యంలోకి వెళతారు హీరో, హీరోయిన్. అక్కడ వారికి శ్రీకృష్ణదేవరాయలు భువనవిజయం కనిపిస్తుంది. అందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు యన్టీఆర్ నటవారసుడైన బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరని అందరూ భావించారు. బాలు అడగ్గానే బాలయ్య కూడా మరోమాట లేకుండా సినిమాను అంగీకరించారు. ఎక్కడా రాజీపడకుండా భారీగా నిర్మించారు కృష్ణ ప్రసాద్. ఈ సినిమా విడుదలై విజయవిహారం చేస్తున్న సమయంలో పిల్లలను మరింతగా ఆకర్షించడానికి అన్నట్టు చిరంజీవి చేత ప్రకటన చేయిస్తే బాగుంటుందని భావించారు నిర్మాతలు. అసలు 'ఆదిత్య 369' వంటి వైవిధ్యమైన చిత్రం రూపొందడమే విశేషం! అందునా భారతదేశంలో అలాంటి సినిమాను అందించింది తెలుగువారు. అందువల్ల ఎందరో ప్రముఖులు సింగీతంను, శివలెంకను అభినందిస్తూ ఉన్నారు. చిరంజీవి కూడా అదే తీరున అభినందించారు. అంతేకాదు, ఈ సినిమాను చూసి ఆనందించండి అంటూ పిలుపునిచ్చారు. అలా బాలయ్య సినిమా 'ఆదిత్య 369' కోసం చిరంజీవి ప్రచారం చేశారు. ఓ మంచి సినిమా కోసం చిరంజీవి చేసిన ప్రచారాన్ని ఈ హీరోల అభిమానులు ఎవరికి వారు గొప్పగా చెప్పుకున్నారు. కొన్నిచోట్ల గొడవలూ అయ్యాయి. స్టార్ హీరోస్ ఫ్యాన్స్ మధ్య ఇలాంటివి మామూలే కదా!
34 ఏళ్ళ క్రితం వెలుగు చూసిన 'ఆదిత్య 369' ఆధునిక సాంకేతిక హంగులు పులుముకొని ఏప్రిల్ 11న రానుంది. మరి ఈ సారి 'ఆదిత్య 369'ను జనం ఏ తీరున ఆదరిస్తారో చూడాలి.