NTR: యన్టీఆర్, బాలకృష్ణను హీరోలుగా చేసిన డైరెక్టర్ బి.ఏ.సుబ్బారావు

ABN , Publish Date - Mar 14 , 2025 | 06:39 PM

నందమూరి తారక రామారావుకు హీరోగా 'పల్లెటూరి పిల్ల'తో తొలి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత బీఏ సుబ్బారావు. ఆయనే రామ్ రహీమ్ తో బాలకృష్ణను హీరోను చేశారు.

ఆ నాటి దర్శక నిర్మాత బి.ఏ. సుబ్బారావు (B A Subba Rao) పేరు ఈ తరం వారికి అంతగా తెలియక పోవచ్చు. అయితే మహానటుడు నటరత్న యన్టీఆర్ ను తొలిసారి హీరోగా చూడాలని తపించిన దర్శకునిగా బి. ఏ.సుబ్బారావు చరిత్రలో నిలిచారు. 'మనదేశం' సినిమా కోసం యన్టీఆర్ మేకప్ టెస్ట్ స్టిల్స్ చూసిన బి.ఏ. సుబ్బారావు తన 'పల్లెటూరి పిల్ల' సినిమాలో హీరో అతనే అని నిర్ణయించేసుకున్నారు. 'మనదేశం' దర్శకుడు ఎల్.వి. ప్రసాద్, బి.ఏ. సుబ్బారావును ''అంత దూకుడు అవసరం లేదు. ముందు యన్టీఆర్ నటించిన సినిమా విడుదల కానీ, అప్పుడు ఆయన ఇక్కడ ఉంటారో లేదో తేలుతుంది. అప్పుడే నీ సినిమాలో హీరోగా ఛాన్సిద్దువు కానీ'' అని చెప్పారట. అయినా బి.ఏ.సుబ్బారావు ' లేదు లేదు... ఎవరు అవునన్నా కాదన్నా... యన్టీఆరే నా సినిమాలో హీరో' అన్నారు. అలాగే 'పల్లెటూరి పిల్ల'లో యన్టీఆర్ ను హీరోయిన్ అంజలీదేవికి జోడీగా ఎంచుకున్నారు సుబ్బారావు. అయితే ఆ సినిమా కంటే ముందుగా యన్టీఆర్ హీరోగా విజయా సంస్థ తొలి చిత్రం 'షావుకారు' ముందు విడుదలయింది. అలా యన్టీఆర్ ను హీరోగా పరిచయం చేసిన ఘనత కూడా ఎల్వీ ప్రసాద్ దక్కించుకున్నారు. 'పల్లెటూరు పిల్ల'లో మరో హీరోగా ఏయన్నార్ నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఏది ఏమైనా యన్టీఆర్ లో హీరో ఉన్నాడని ముందుగా గుర్తించింది బి.ఏ.సుబ్బారావే. అందువల్లే అదే పనిగా 'కథానాయకుని కథ'లో బి.ఏ.సుబ్బారావే అందులో హీరోని నటునిగా పరిచయం చేసే పాత్రలో నటింప చేశారు యన్టీఆర్.


యన్టీఆర్ హీరోగా బి.ఏ.సుబ్బారావు తెరకెక్కించిన "రాజు-పేద, భీష్మ, రాణీ రత్న ప్రభ, మర్మయోగి, భలే తమ్ముడు, రైతుబిడ్డ, సతీ సావిత్రి, మావారి మంచితనం" వంటి చిత్రాలు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాయి. వీటిలో అధిక భాగం విజయం సాధించాయి. సుబ్బారావుకు మొదటి నుంచీ ప్రయోగాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అందువల్లే అప్పటికే హీరోగా రాణిస్తున్న ఏయన్నార్ కు కీలక పాత్రను ఇచ్చి 'పల్లెటూరి పిల్ల'లో యన్టీఆర్ కు కథానాయకుని పాత్రను ఇచ్చారు. తరువాత అందాల నటుడైన యన్టీఆర్ తో అందవికారమైన పాత్రను 'రాజు-పేద'లో పోషింప చేశారు. అలాగే 39 ఏళ్ళ వయసులోనే ముదుసలి భీష్ముని పాత్రలో రామారావును నటింప చేసిన క్రెడిట్ కూడా సుబ్బారావుకే దక్కుతుంది. ఇలా ప్రయోగాలు చేసిన సుబ్బారావు ఏయన్నార్ ను విష్ణుమూర్తిగా నటింప చేసి 'చెంచులక్ష్మి'తో ఆకట్టుకున్నారు. ప్రయోగాలు చేసే బి.ఏ. సుబ్బారావంటే యన్టీఆర్ కు ఎంతో అభిమానం. అందువల్లే తన నటవారసులు హరికృష్ణ, బాలకృష్ణను తన దర్శకత్వంలోనే పరిచయం చేసినా, బి.ఏ.సుబ్బారావు డైరెక్షన్ లోనూ నటింప చేయాలని ఆశించారు యన్టీఆర్. అలా రూపొందిన చిత్రమే హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రూపొందిన 'రామ్-రహీమ్'. ఈ చిత్రాన్ని యన్టీఆర్ తో ఒకప్పుడు నాయికగా నటించిన లక్ష్మీరాజ్యం నిర్మించడం విశేషం! 'రామ్ - రహీమ్' మంచి ఆదరణ పొందింది.


యన్టీఆర్ ను హీరోగా చేసిన బి.ఏ.సుబ్బారావు తన 'భీష్మ' చిత్రంతో వాణిశ్రీని, ధూళిపాలను పరిచయం చేశారు. అలాగే యస్వీ రంగారావుకు గుర్తింపు ఉండే పాత్రలో 'పల్లెటూరి పిల్ల'లో నటింప చేశారు. యన్టీఆర్ 'భలే తమ్ముడు', జగ్గయ్య 'శభాష్ పాపన్న' చిత్రాల్లో కేమియో రోల్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు బి.ఏ.సుబ్బారావు. యన్టీఆర్ కు బి.ఏ.సుబ్బారావుపై ఉన్న అభిమానంతోనే తరువాతి రోజుల్లో తాను హీరోగా నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ కల్పించారు యన్టీఆర్. సుబ్బారావు దర్శకత్వంలో చివరగా రూపొందిన చిత్రం 'మావారి మంచితనం'. ఇందులోనూ యన్టీఆర్ హీరో కావడం విశేషం. అలా తన తొలి, చివరి చిత్రాలలో యన్టీఆర్ తోనే సాగిన బి.ఏ.సుబ్బారావు దర్శకనిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Also Read: Officer on Duty Review: కుంచకో బోబన్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే...  

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2025 | 06:39 PM