Telugu Cinema: అక్కినేని, అల్లు స్పెషల్ బాండింగ్...
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:58 AM
ప్రముఖ హాస్యనటుడు, స్వర్గీయ అల్లు రామలింగయ్య ఆన్ స్క్రీన్ మీదనే కాదు... ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతో సరదాగా ఉంటారు. ఇక అక్కినేని, అల్లు అనుబంధమైతే... మరింత ప్రత్యేకమైంది.
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR), హాస్యనట చక్రవర్తి అల్లు రామలింగయ్య (Allu Ramalingayya) బోలెడు చిత్రాల్లో నటించేసి ప్రేక్షకులకు వినోదం పంచారు. బాపు (Bapu) దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం 'బుద్ధిమంతుడు' (Buddhimantudu). ఇందులో మాధవయ్య, గోపాలం అన్నదమ్ములుగా ఏయన్నార్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో ప్రెసిడెంట్ శేషాద్రిగా నాగభూషణం నటిస్తే ఆయన దగ్గర గుమస్తా రామలింగం పాత్రలో అల్లు రామలింగయ్య అలరించారు. ఈ సినిమాలో ఏయన్నార్, అల్లు రామలింగయ్య కాంబోలో కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటిలో ఏయన్నార్ ద్విపాత్రాభినయంతో తనదైన బాణీ పలికిస్తే, అల్లు రామలింగయ్య కితకితలు పెట్టారు. 1969లో ఏయన్నార్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 20న విడుదలైంది 'బుద్ధిమంతుడు' చిత్రం. ఈ సినిమా కోసమే ఏయన్నార్, అల్లు రామలింగయ్య కలసి డబ్బింగ్ చెబుతున్నప్పటి ఫోటో ఇది.
ఏయన్నార్ తన గురువు దుక్కిపాటి మధుసూదనరావుతో కలసి 'అన్నపూర్ణ పిక్చర్స్' సంస్థ నెలకొల్పారు. దానికి ఏయన్నార్ చైర్మన్ గా వ్యవహరిస్తే, దుక్కిపాటి మేనేజింగ్ డైరెక్టర్. అన్నపూర్ణవారి తొలి చిత్రం 'దొంగరాముడు' (Donga Ramudu) మొదలు ఆ సంస్థ నిర్మించిన పలు సినిమాల్లో అల్లు రామలింగయ్య తనదైన హాస్యంతో అలరించారు. ఇక అల్లు రామలింగయ్య సొంత నిర్మాణసంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన 'మెకానిక్ అల్లుడు' (Mechanic Alludu)లో ఏయన్నార్ హీరో చిరంజీవి మామ పాత్రలో అభినయించారు. అలా అక్కినేని, అల్లు మధ్య చిత్రానుబంధం ఉంది.
Also Read: Mohanlal: ఏప్రిల్ 25న తెలుగులోనూ తుడరుమ్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి