Superstar Krishna: 'కళా'కృష్ణ బంధం!
ABN , Publish Date - Apr 05 , 2025 | 06:21 PM
సూపర్ స్టార్ కృష్ణ, కళాతపస్వి కె. విశ్వనాథ్ మధ్య అనుబంధం ఎప్పుడు? ఎలా? మొదలైందో తెలుసా!?
అరవై ఏళ్ళకు పై మాటే! ఆదుర్తి సుబ్బారావు (Adurthi Subba Rao) దర్శకత్వంలో 'తేనె మనసులు' (Tenemanasulu) రూపొందుతున్న సమయమది. ఆ సినిమాతోనే కృష్ణ (Krishna), రామ్మోహన్ (Rammohan) హీరోలుగా పరిచయం అయ్యారు. సంధ్యారాణి, సుకన్య నాయికలుగా తెరపై తొలిసారి తళుక్కుమన్నారు. ఆ చిత్రానికి కళాతపస్విగా పేరొందిన కె.విశ్వనాథ్ (K.Viswanath) కూడా కథాచర్చల్లో పాల్గొన్నారు. ఆదుర్తి అంతకు ముందు తెరకెక్కించిన 'చదువుకున్న అమ్మాయిలు, మూగమనసులు' వంటి చిత్రాలకు విశ్వనాథ్ అసోసియేట్ గా పనిచేశారు. అందువల్ల కొత్తవారితో ఆదుర్తి రూపొందిస్తోన్న 'తేనెమనసులు' షూటింగ్ సమయంలోనూ విశ్వనాథ్ పాల్గొంటూ ఉండేవారు. అలా మెరీనా బీచ్ లో ఓ రోజు 'తేనె మనసులు'లోని తమ ఫోటో ఆల్బమ్ ను తిలకిస్తున్న కృష్ణ, సుకన్య వెనకాల నుంచుని విశ్వనాథ్ సైతం వారి ఫోటోలనూ చూస్తున్న దృశ్యమిది.
తరువాతి రోజుల్లో కె.విశ్వనాథ్ తన రెండో చిత్రం 'ప్రైవేట్ మాష్టారు' లో ఆదుర్తి పరిచయం చేసిన కృష్ణ, రామ్మోహన్ కు ప్రధాన పాత్రలు ఇచ్చారు. విశేషమేంటంటే 'ప్రైవేటు మాష్టారు'లో కథానాయకుడు రామ్మోహన్ కాగా, ప్రతినాయకుని పాత్రలో కృష్ణ కనిపించారు. కృష్ణ కెరీర్ లో అలా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించడం అదే మొదటిసారి. ఆ పై 'ఉండమ్మా బొట్టు పెడతా'లో కృష్ణను జమున జోడీగా నటింప చేశారు విశ్వనాథ్. ఆ చిత్రంలో కృష్ణ ఎంతో సాధుజీవి పాత్రలో కనిపించారు. తరువాత కృష్ణ హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన 'నేరము-శిక్ష' కూడా జనాన్ని ఆకట్టుకుంది. ఇందులో డబ్బు మత్తులో నేరం చేసిన హీరో పశ్చాత్తాపంతో శిక్ష అనుభవించడానికి సిద్ధమయ్యేదే కథ. అలా కృష్ణతో కళాతపస్వి చిత్ర బంధానికి 'తేనెమనసులు' బీజం వేసింది. ఇటీవలే (31-3-2025) 'తేనెమనసులు' చిత్రం అరవై ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం!
Also Read: ARI: అనసూయ భరద్వాజ్ 'భగ భగ..' లిరికల్ సాంగ్
Also Read: Test Movie: టెస్ట్ మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి