NTR - ANR: ఒకరి వెనుకే మరొకరు...
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:37 PM
తెలుగు సినిమా రంగంలోకి అక్కినేని తర్వాత ఎన్టీ ఆర్ అడుగుపెట్టారు. కానీ అక్కినేని కంటే ముందే... ఎన్టీఆర్ వందో చిత్రాన్ని పూర్తి చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం...
తెలుగు చిత్రసీమలో నటరత్న యన్టీఆర్ (NTR), నటసమ్రాట్ ఏయన్నార్ (ANR) కలసి సాగిన తీరున ఏ ఇద్దరు టాప్ స్టార్స్ నడయాడలేదు. ఎందుకంటే వారిద్దరూ కలసి దాదాపు 15 చిత్రాలలో పనిచేశారు. ఆ తీరున సాగిన టాప్ స్టార్స్ తెలుగునాటనే కాదు యావద్భారతంలోనూ లేరని చెప్పొచ్చు. ఇక ఏయన్నార్ అయితే ప్రపంచంలోనే లేరని, ఇద్దరు టాప్ స్టార్స్ కలసి అన్ని చిత్రాలలో నటించడం వరల్డ్ రికార్డ్ అనేవారు. అలాంటి యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరి నటజీవితాల అనుబంధం కూడా గమనించదగ్గదే. యన్టీఆర్ రాకముందు ఏయన్నార్ ఓ పౌరాణికంలో నటించారు. పలు జానపదాలతో సాగారు. ఓ చారిత్రకంలోనూ అభినయించారు. రామారావు సాంఘిక చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చారు. తరువాత పౌరాణిక, జానపద, చారిత్రకాల్లో తనకు తిరుగులేదని చాటుకున్నారు. యన్టీఆర్ రాకతో ఏయన్నార్ సాంఘికాలకు టర్న్ అయ్యారు. చిత్రమేంటంటే యన్టీఆర్ హీరోగా రూపొందిన 'సంసారం' చిత్రంలో ఏయన్నార్ మరో హీరోగా నటించారు. అదే ఏయన్నార్ తొలి సాంఘిక చిత్రం. ఇక యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన మొదటి సినిమా 'పల్లెటూరి పిల్ల'. అదే యన్టీఆర్ కు తొలి జానపదం కావడం విశేషం! ఇలాంటి అనుబంధంతో పాటు వారిద్దరూ కలసి నటించిన 'గుండమ్మ కథ' (Gundamma Katha)కు ఓ ప్రత్యేకత ఉంది.
కన్నడలో విజయం సాధించిన 'మనె తుంబెద హెన్ను' (Mane Tumbeda Hennu) అనే సినిమా ఆధారంగానే తెలుగులో 'గుండమ్మ కథ' రూపొందించారు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి.నాగిరెడ్డి, చక్రపాణి 'గుండమ్మకథ'ను నిర్మించారు. ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి పర్యవేక్షణలో డి.వి.నరసరాజు తెలుగు సినిమాకు సంబంధించిన పలు మార్పులూ చేర్పులూ చేశారు. తెలుగులో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించగా, తమిళ వర్షన్ 'మనిదన్ మారవిల్లై' (Manithan Maravillai) కి చక్రపాణి డైరెక్టర్ గా వ్యవహరించారు. తెలుగులో యన్టీఆర్ పోషించిన పాత్రను తమిళంలో జెమినీ గణేశన్ ధరించారు. గుండమ్మగా నటించిన సూర్యకాంతం పాత్రను తమిళంలో సుబ్బమ్మగా సుందరీబాయ్ పోషించారు. ఇక ప్రధాన పాత్రల్లో ఇక్కడ నటించిన ఏయన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, జమున వంటివారు తమిళంలోనూ నటించారు.
అసలైన విశేషమేంటంటే - 'గుండమ్మ కథ'లో నటించిన ఇద్దరు స్టార్స్ కు ఈ సినిమా ఓ స్పెషల్ గా నిలచింది. ఎలాగంటే 'గుండమ్మ కథ' యన్టీఆర్ కు 100వ చిత్రం, కాగా ఏయన్నార్ కు 99వ చిత్రం. 'గుండమ్మ కథ' సినిమా తెలుగునాట 1962 జూన్ 7న విడుదలయింది. ఇక తమిళ 'మనిదన్ మారవిల్లై' సినిమా ఏయన్నార్ కు 100వ చిత్రం. తమిళ వర్షన్ 1962 జూన్ 8న రిలీజయింది. అంటే ఒక్క రోజు తేడాతో ఏయన్నార్ 99వ చిత్రం, 100వ సినిమా విడుదలయ్యాయన్న మాట! విచిత్రమేంటంటే కమలాకర తెరకెక్కించిన తెలుగు చిత్రం 'గుండమ్మ కథ' ఘనవిజయం సాధించి, 1962 బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఇదే కథతో తమిళంలో రూపొందిన 'మనిదన్ మారవిల్లై' పరాజయాన్ని చవిచూసింది. తెలుగు గుండమ్మ కథనే యథాతథంగా తమిళంలోనూ తెరకెక్కించినా ఎందువల్ల ఆ సినిమా పరాజయం పాలయింది అన్న అంశంపై నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి కొన్నాళ్ళ పాటు యోచిస్తూనే ఉన్నారట! తెలుగులో 'గుండమ్మ కథ' ఘనవిజయానికి గుండమ్మగా నటించిన సూర్యకాంతం, అంజి పాత్రలో కనిపించిన యన్టీఆర్ ప్రధాన కారణమని తరువాత జనం తేల్చేశారు. వీరిద్దరూ తమిళ వర్షన్ లో లేరు. అందువల్లే 'మనిదన్ మారవిల్లై' విజయాన్ని చవిచూడలేదని పలువురు అన్నారు. వారితోనే నాగిరెడ్డి, చక్రపాణి కూడా ఏకీభవించారు. యన్టీఆర్ 100వ చిత్రంగా వెలుగు చూసిన 'గుండమ్మ కథ' అప్పట్లో 24 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. తరువాత రజతోత్సవమూ జరుపుకుంది.
Also Read: Akhanda -2: హక్కుల కోసం ఓటీటీల ఆరాటం
Also Read: Sankranthi Movies: వంద రోజులు ఎక్కడంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి