Sudigaali Sudhir: వివాదంలో సుడిగాలి సుధీర్

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:34 PM

సుడిగాలి సుధీర్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నాడు. సరదాగా చేసిన ఓ స్కిట్ వివాదానికి దారితీసింది. దీంతో హిందువులు సుధీర్ పై మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు

సుడిగాలి సుధీర్ (Sudigaali Sudhir) అంటే తెలియని వారు ఉండరు. బుల్లి తెరపై 'జబర్దస్త్' ప్రోగ్రామ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తన యాంకరింగ్, స్పాంటెనిటీ, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సుధీర్ కనిపిస్తే చాలు... టీఆర్సీ రేటింగ్స్ ఆటోమెటిక్ గా పెరిగిపోతుంటుంది. మరీ ముఖ్యంగా యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam)తో నడిచిన లవ్ ట్రాక్ జనాలను తెగ అట్రాక్ట్ చేసింది. ఈ జోడి పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశపడే రేంజ్ లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఉండేది. కట్ చేస్తే. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుడిగాలి సుధీర్. అయితే హీరోగా సుధీర్ చేసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో చేసేది లేక మళ్లీ కొంతకాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా.... ఓ వైపు హీరో గా సినిమాలు చేస్తునే ఉన్నాడు. అలానే... మరో వైపు స్పెషల్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. సరదాగా నవ్వులు పంచే సుధీర్ అందరివాడిగా వివాదలకు దూరంగా ఉంటాడు. అలాంటి సుధీర్ కాంట్రవర్సీ లో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది.


రీసెంట్ గా ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ కోసం చేసిన షోలో సుధీర్ చేసిన స్పూఫ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. 'బావగారు బాగున్నారా' సినిమాలోని ఓ సీన్ ను రీ-క్రియేట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ షోకి గెస్ట్ గా వచ్చిన రంభతో చేసిన స్పూఫ్ వివాదంగా మారింది. హిందువులు దేవాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి కొమ్ములు మధ్య నుంచి ఎదురుగా ఉన్న మూల విరాట్‍ ను దర్శనం చేసుకోవడమనేది ఒక ఆచారం . అలా షో లో నందీశ్వరుని పై నుంచి రంభ ను చూసి 'ఈశ్వరుడు కనిపించాలి కానీ అమ్మోరు కనిపిస్తుంది ఏంటి?' అంటూ చెప్పిన డైలాగ్స్ వైరల్ గా మారాయి. దేవుడిపై ఇలాంటి పరాచకాలు ఏంటి? అని హిందువులు మండి పడుతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయొద్దంటూ మరికొందరు చురకలు అంటిస్తున్నారు. సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా సినిమా స్పూఫ్ అంటూ అతడిని వెనకేసుకొస్తున్నారు. మరి తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న హిందువులకు సుడిగాలి సుధీర్ క్షమాపణలు చెబుతాడో లేదో చూడాలి.

Updated Date - Apr 09 , 2025 | 06:34 PM