Udit Narayan: సింగర్ ఉదిత్ నారాయణ్ నివాసంలో భారీ అగ్నిప్రమాదం.. షాక్‌లో సింగర్

ABN , Publish Date - Jan 07 , 2025 | 09:46 PM

తను నివాసం ఉంటున్న బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో సింగర్ ఉదిత్ నారాయణ్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన నివాసంలోని గృహోపకరణాలన్నీ అగ్నికి ఆహుతి అయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ప్రాథమిక విచారణలో ఈ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం ఏమని తెలిసిందంటే..

Singer Udit Narayan

ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు పురస్కార గ్రహీత ఉదిత్ నారాయణ్ నివాసంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయన నివాసంలోని గృహోపకరణాలన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు కానీ.. ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఈ ప్రమాదం కారణంగా ఉదిత్ నారాయణ్ తీవ్ర షాక్‌కు గురైనట్లుగా తెలుస్తోంది. ముంబైలోని అందేరిలో శాస్త్రి నగర్‌‌లోని స్కైపాన్‌ బిల్డింగ్స్‌లో ఉదిత్ నారాయణ్ నివసిస్తున్నారు.


ఆయన నివాసం ఉంటున్న బిల్డింగ్‌లో సోమవారం రాత్రి 11వ ఫ్లోర్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం. దీంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులతోపాటు స్కైపాన్ బిల్డింగ్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి, అలాగే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఇక ఈ అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో గాయకుడు ఉదిత్ నారాయణ్.. స్కైపాన్ బిల్డింగ్‌లోని 9వ ఫ్లోర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read-Ajith Kumar: రేసింగ్ సర్క్యూట్‌లో అజిత్ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు


మరోవైపు ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. అలాగే బాలీవుడ్‌లో మరో గాయకుడు షాన్ నివసిస్తున్న బిల్డింగ్‌లో సైతం ఇదే తరహాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరు గాయపడలేదని బాలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తోంది.


అయితే దేశ రాజధాని ముంబైలో నిత్యం ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంపై బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. గాయకుడు ఉదిత్ నారాయణ్ నివాసంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదిత్ నారాయణ్.. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో సైతం పలు గీతాలు ఆలపించారు. ఆయన పాడిన పాటలన్నీ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి.. ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.

Also Read- Renu Desai: అలా ఎలా తీశారో.. ఆ సినిమా చూస్తూ ఏడ్చేశా..

Also Read- Naga Vamsi: తప్పుగా మాట్లాడలేదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2025 | 09:46 PM