Manchu Family Dispute: మంచు మనోజ్‌పై తిరుపతిలోనూ పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Jan 15 , 2025 | 09:52 PM
పోలీసులు ఎంతగా వారించినా వినకుండా శ్రీవిద్యానికేతన్ స్కూల్ లోపలికి వెళ్లిన మంచు మనోజ్‌పై కోర్టు ధిక్కారణ కేసు ఫైల్ చేయాలని కోరుతూ పోలీసులను సంప్రదించారు సదరు స్కూల్ యాజమాన్యం. మంచు మనోజ్ తన మేనత్త మేడసాని విజయమ్మ ఇంటికి రావద్దని చెప్పినా వెళ్లాడని, అలాగే స్కూల్ దగ్గర రూల్స్ అతిక్రమించాడని ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా వారు మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
సినీ నటుడు మంచు మనోజ్‌పై కోర్టు ధిక్కారణ కింద పోలీసు కేసు నమోదు చేయాలంటూ తిరుపతి శ్రీవిద్యానికేతన్ యాజమాన్యం పోలీసులను సంప్రదించారు. ఈ మేరకు వారు మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో.. మంచు మనోజ్ సంక్రాంతి పండుగ సందర్బంగా నారావారి పల్లెలోని తన మేనత్త మేడసాని విజయమ్మ ఇంటికి వెళ్లేందుకు యత్నించాడు. తండ్రి మాట వినకపోవడంతో పాటు అన్న మంచు విష్ణుతో గొడవలు కారణంగా తన ఇంటికి రావద్దని మేనత్త ఖరాఖండీగా చెప్పినా.. వినకుండా దురుద్దేశంతో మనోజ్ తన మేనత్త విజయమ్మ ఉంటున్న నారావారి పల్లెకు వచ్చాడని పేర్కొన్నారు.
నారావారి పల్లెలో మంత్రి నారా లోకేష్‌ని కలిసి, ఒక్క నిమిషం మాట్లాడి వెళ్లిపోయిన మనోజ్.. నారా రోహిత్‌తో కలిసి సినిమా తీస్తున్న కారణంగా ఆయనతో మాట్లాడి వచ్చేశాడని తెలిపారు. అయితే తిరిగి వస్తూ.. డా. మోహన్ బాబు స్కూల్ గేట్ వద్ద 200 మందితో స్కూల్ లోపలికి రావాలని ప్రయత్నించాడని చెప్పుకొచ్చారు.
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
కానీ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు విద్యా సంస్థలలోని వెళ్లకూడదని ఎంతో వారించినా.. వారి మాట విన్నట్టే విని.. కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లి మోహన్ బాబు విద్యాసంస్థలలోని డైరీ ఫారంలోని గేటుని ఎగిరి దూకి లోపలికి వెళ్లాడని, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందని, వెంటనే మనోజ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి, కోర్టుకు అప్పీలు చేస్తున్నట్లుగా శ్రీవిద్యానికేతన్ యాజమాన్యం ఈ ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
దీంతో మంచు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందనేలా సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. శ్రీవిద్యానికేతన్ గేట్ ముందు మంచు మనోజ్ చేసిన హడావుడి అంతా వీడియోల రూపంలో వైరల్ అవుతోంది. దీంతో మంచు ఫ్యామిలీలో ఆరని మంటలు అంటూ మీడియా, సోషల్ మీడియాలో ఒకటే కామెంట్స్. చూస్తుంటే ఈ ఎపిసోడ్ ఇప్పుడప్పుడే ముగిసే ఎపిసోడ్ కాదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.