Pawan Kalyan: బాలకృష్ణకు పద్మభూషణ్.. పవన్ కళ్యాణ్ స్పందనిదే!
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:01 PM
పద్మ పురస్కారాలు పొందిన అందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల తరపున ఎన్నికైన వారందరీకి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్యకు పద్మ భూషణ్ రావడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..
పద్మ పురస్కారాలు పొందిన అందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా బాలకృష్ణకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఈ అవార్డులపై స్పందిస్తూ..
‘‘అయిదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణగారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆయన - హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డా.డి.నాగేశ్వర్ రెడ్డిగారు పద్మ విభూషణ్‌కు ఎంపికైనందుకు అభినందనలు.
Also Read- Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..
ప్రజా ఉద్యమాల్లో మంద కృష్ణ మాదిగగారికి ప్రత్యేక స్థానం ఉంది. ఎం.ఆర్.పి.ఎస్. ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారు. మంద కృష్ణ మాదిగ గారు పద్మశ్రీకు ఎంపికైనందుకు అభినందనలు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని, కవి మాడుగుల నాగఫణి శర్మగారు, సాహిత్యం-విద్య విభాగంలో ఎంపికైన కె.ఎల్.కృష్ణ గారు, వి.రాఘవేంద్రాచార్య పంచముఖిగారికి అభినందనలు.
Also Read- Padma Bhushan Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్
మట్టిలో మాణిక్యాలాంటి వారికి పద్మ పురస్కారాలు అందిస్తోంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది 30మంది ఈ విధంగా ఎంపికైనవారు ఉండటం సంతోషాన్ని కలిగించింది. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుగారికి మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారి కళా సేవకు తగిన గుర్తింపు దక్కింది..’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.