Padma Bhushan Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్
ABN , Publish Date - Jan 25 , 2025 | 09:13 PM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో నందమూరి నటసింహం బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ భూషణ్’ (Padma Bhushan) వరించింది. సినిమా పరిశ్రమకు అలాగే ఆయన చేస్తున్న రాజకీయ, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఆయనని ‘పద్మ భూషణ్’ అవార్డుకు నామినేట్ చేయగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్ 2025లో ఆయనకు చోటు దక్కింది. దీంతో బాలయ్య పద్మ భూషణుడిగా మారారు.
Also Read- Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?
బాలయ్య విషయానికి వస్తే.. లెజెండ్ నందమూరి తారక రామారావు (NT Ramarao) నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నట వారసుడిగా జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో నటించి టాలీవుడ్ చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పటల్ చైర్మన్‌గా బాలయ్య సేవలు నిత్యం కొనియాడబడుతుంటాయి. అతి తక్కువ ధరకే క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తూ ఓ హీరోగా, ప్రజా ప్రతినిధిగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు బాలయ్య.
ఈ నేపథ్యంలో బాలయ్య సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చేస్తోన్న సేవలను గుర్తిస్తూ 2025 సంవత్సరానికిగానూ బాలయ్యను ఏపీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. వాస్తవానికి ఆయనకి ఈ అవార్డు ఎప్పుడో రావాల్సి ఉండగా.. చాలా ఆలస్యమైందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈసారి రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ప్రకటించిన పద్మ అవార్డులలో బాలయ్య పేరు ఉండటంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.