Music Director : రథన్ దృష్టిలో అతను తండ్రి... ఇతను తల్లి
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:41 PM
సంగీత దర్శకుడు రధన్ కు మంచి పేరుంది. అయితే అదే స్థాయిలో అతనిపై విమర్శలూ వస్తుంటాయి. అలాంటి విమర్శలకు రధన్ తాజాగా చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రధన్ (Radhan ) మరోసారి హెడ్‌లైన్స్‌లోకి ఎక్కాడు. అయితే ఈసారి వివాదంతో కాదు.. తన గురించి వినిపిస్తున్న విమర్శలపై వివరణ ఇస్తూ వార్తల్లోకి వచ్చాడు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ప్రమోషన్స్ లో పాల్గొన్న రధన్.. ఇన్నాళ్లుగా డైరెక్టుగా, ఇన్‌డైరెక్టుగా తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తెలుగులో 'అందాల రాక్షసి', 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'అర్జున్ రెడ్డి', 'హుషారు', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి చిత్రాలతో అభిమానులను అలరించాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఇందులో కొన్ని చిత్రాలకు కేవలం రథన్ బాణీలను మాత్రమే సమకూర్చాడు. విజయాలు వరించినా... అనేక వివాదాలు ఇతన్నీ వెంటాడుతున్నాయి. రధన్ గురించి ఎక్కువ మంది చేసే కంప్లెయింట్ పని ఆలస్యంగా చేస్తాడని! అతనితో వర్క్ చేసిన చాలామంది డైరెక్టర్స్ ఇదే విషయాన్ని ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. 'అర్జున్ రెడ్డి' (Arjun Reddy) సమయంలో రధన్ బాగా ఆలస్యం చేస్తాడని, అతనితో పని చేయించుకోవాలంటే వెంటపడాల్సి వస్తుందని, అందుకే రీ-రికార్డింగ్ వేరొకరితో చేయించుకున్నామని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga ) కామెంట్స్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత సిద్ధార్థ్ రాయ్ (Siddharth Roy ) సినిమా రిలీజ్ సమయంలో కూడా దర్శకుడు యశస్వి (Yashasvi) రధన్ పనితీరుపై విమర్శలు చేశాడు. షూటింగ్ త్వరగా పూర్తయినప్పటికీ, సంగీతం కారణంగా రిలీజ్ ఆలస్యమైందని, రధన్ చాలా టార్చర్ చేస్తాడని గోడు వెళ్ళబోసుకున్నాడు. అయితే వీటిపై తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు రధన్.
సందీప్ తనకు తండ్రిలాంటి వ్యక్తి అని, తనకు అవకాశం ఇచ్చిన వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అది ఆయన స్వాగ్ అని చెప్పుకొచ్చాడు. 'అర్జున్ రెడ్డి'లో మొదటి పాట ఇచ్చినప్పుడు సందీప్ నచ్చలేదని అనలేదని, అన్ని పాటలు చేయించుకున్న తర్వాత బయటకు వచ్చి అలా మాట్లాడటం బాధ కలిగించినప్పటికీ, దాన్ని తాను మనసులో పెట్టుకోలేదని చెప్పాడు. ఇక 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ (Anudeep) తల్లిలా తనను సున్నితంగా హ్యాండిల్ చేశాడని ప్రశంసించాడు.
తన కెరీర్‌లో ఇప్పటివరకు మంచి సంగీతం అందించాననే సంతృప్తి ఉందని, వివాదాలకు ఇకపై ఆస్కారం ఇవ్వకూడదనే అనుకుంటున్నానని రధన్ చెప్పాడు. అయితే అతనితో పనిచేసిన కొందరు దర్శకులు ఇప్పటికీ అతని పేరు వింటే మండి పడుతున్నారు. అభిమానులు కూడా అతని టాలెంట్‌ను మెచ్చుకుంటూనే, వివాదాల వల్ల అతని కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేని వాపోతున్నారు. వివాదాలే రధన్ కెరీర్‌ను దెబ్బతీస్తున్నాయని లేకపోతే అతను టాప్ పొజిషన్ లో ఉండేవాడని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.
Also Read: Jack Movie Review: జాక్ మూవీ రివ్వూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి