Kho Kho World Cup: ఖోఖో తొలి ప్రపంచకప్‌లో భారత్ విజయభేరి.. భళా అంటోన్న సెలబ్రిటీలు
ABN , Publish Date - Jan 20 , 2025 | 07:15 PM
Kho Kho World Cup: తొలి ఖోఖో ప్రపంచకప్ భారత్‌ను సాధించింది. మహిళ, పురుష విభాగాలు రెండింటిలోనూ మనవాళ్లు గొప్ప ప్రదర్శన చేసి విజేతలుగా నిలిచారు. విజేతలుగా నిలిచి భారతదేశం గర్వించే క్షణాలు అందించిన వారిపై సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్లు కూడా ఈ ప్రాచీన క్రీడకు పునరుజ్జీవనం పోశారంటూ కొనియాడుతున్నారు.
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్ పోటీలలో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ విజయభేరి మోగించి, సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ని అటు మహిళల, ఇటు పురుషుల విభాగంలో కప్‌ని సొంతం చేసుకోవడం మాములు విషయం కాదంటూ.. పలువురు ప్రముఖులు రెండు జట్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎస్. ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు.. రెండు టీమ్‌లను అభినందిస్తూ.. టీమ్ సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత ప్రాచీన క్రీడ అయిన ఖోఖో మొట్టమొదటి ప్రపంచకప్‌ని భారత్ సొంతం చేసుకోవడం గర్వించాల్సిన విషయమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం.
ఇక ఈ గెలుపుపై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి స్పందిస్తూ.. ‘‘భారతదేశానికి చెందిన ప్రాచీన క్రీడ ఖోఖోకి సంబంధించి తొలి ప్రపంచకప్ జరిగింది. ఈ క్రీడా సంబరాలను ప్రపంచం అంతా నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ తొలి ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో మహిళ, పురుషుల జట్లు టైటిల్స్ గెలిచి భారతదేశం గర్వించేలా చేసినందుకు.. ఇరు జట్లకు అభినందనలు. జైహింద్’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం
దర్శకధీరుడు రాజమౌళితో తదుపరి సినిమా చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘‘భారత మహిళా మరియు పురుషుల జట్లు తొలి #KhoKhoWorldCupను గెలవడమే కాకుండా భారతదేశపు పురాతన ఈ క్రీడకు మళ్లీ ప్రాణం పోశారు. దేశం మొత్తం గర్వపడే క్షణమిది’’ అని క్లాప్స్ ఈమోజీలతో తన ఆనందాన్ని తెలియజేశారు. ఇంకా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఇరు జట్లకు అభినందనలు తెలిపారు. కాగా, టీమ్ ఇండియాకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.