Thug Life: ఎ.ఐ. రీసెర్చ్ సెంటర్ లో కమల్ హాసన్
ABN , Publish Date - Apr 12 , 2025 | 02:32 PM
ఎ.ఐ. తో సినిమా రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు.
ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ (Kamal Haasan) సిలికాన్‌లోని ఎ. ఐ. ఆధారిత రీసెర్చ్ సెంటర్ పర్‌ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా సీఈఓ అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) ను కలిశారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని గురించి ఆయన వివరిస్తూ, ''సినిమా నుండి సిలికాన్ వరకు ప్రతీ ఒక్కటీ నిత్యం అభివృద్ది చెందుతూనే ఉంటాయి. ఎంత కనిపెట్టినా, ఏం చేసినా కూడా ఇంకా ఏదో చేయాలని, కనిపెట్టాలనే ఆ కుతూహలం, ఆ దాహం మనలో ఉంటూనే ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో నాలో ఇంకా కొత్త ఆలోచనలకు ప్రేరణ లభించినట్టు అనిపిస్తుంది. అరవింద్ శ్రీనివాస్, అతని బృందం కలిసి భవిష్యత్తును నిర్మించడంలో మన భారతీయ చాతుర్యం ప్రకాశిస్తుంది'' అని అన్నారు.
కమల్ హాసన్ కు అరవింద్ శ్రీనివాస్ బదులిస్తూ, ''పర్ప్లెక్సిటీ కార్యాలయంలో మిమ్మల్ని కలవడం, మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చిత్రనిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను నేర్చుకోవాలనే మీ ఆలోచనలు, సినిమా పట్ల మీకున్న ప్యాషన్ స్ఫూర్తిదాయకం. 'థగ్ లైఫ్'తో పాటుగా మీరు పనిచేస్తున్న భవిష్యత్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు'' అని అన్నారు.
అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ, యూసీ బర్కిలీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పొందారు. శ్రీనివాస్ 2022లో పర్‌ప్లెక్సిటీ ఏఐని మిత్రులతో కలిసి స్థాపించే ముందు ఓపెన్ ఏఐ, డీప్‌మైండ్, గూగుల్ వంటి ప్రముఖ ఎ.ఐ. సంస్థల్లో పనిచేశారు. పర్‌ప్లెక్సిటీ అనేది ఏఐ స్టార్టప్. ఈ కంపెనీకి జెఫ్ బెజోస్, యాన్ లెకున్ వంటి ప్రముఖ వ్యక్తులు మద్దతు ఇస్తున్నారు.
కమల్ హాసన్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించి, నిర్మిస్తున్న 'థగ్ లైఫ్' (Thug Life) జూన్ 5న విడుదల కాబోతోంది. మణిరత్నం (Maniratnam), ఆర్. మహేంద్రన్, శివ అనంత్ సైతం ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ గా నటిస్తున్నాడు. అలానే సిలంబరసన్ (Silambarasan), త్రిష కృష్ణన్ (Trisha Krishnan), అశోక్ సెల్వన్ (Ashok Selvan), ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi), జోజు జార్జ్, అభిరామి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) ఈ సినిమాకు సంగీతం అందిచారు.
Also Read: Actor: రావు గోపాలరావు డైరెక్షన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి