Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి షాకిచ్చిన కోర్టు.. విషయం ఏమిటంటే..
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:16 PM
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. దగ్గుబాటి ఫ్యామిలీ వ్యవహరించిన తీరుపై నాంపల్లి కోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఫిల్మ్ నగర్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను కోర్టు జారీ చేసింది. దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలెట్టారు. అసలు విషయం ఏమిటంటే..
దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి 17వ నెంబర్ కోర్టు బిగ్ షాకిచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. పూర్తి విచారణ జరపాలని ఫిల్మ్ నగర్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలెట్టారు. అసలు విషయం ఏమిటంటే.. గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడైన నంద కుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబరులో జిహెచ్ ఎంసీ సిబ్బంది.. బౌన్సర్లతో కలిసి దగ్గుబాటి ఫ్యామిలీ హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు.
ఆ తర్వాత సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా.. 2024 జనవరిలో హోటల్‌ను దగ్గుబాటి ఫ్యామిలీ పూర్తిగా కూల్చి వేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లగా.. శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నప్పటికీ పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్‌లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ విషయంలో దౌర్జన్యం వ్యవహరించడం ఏంటని దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
Also Read-Daaku Maharaaj: అయ్యబాబోయ్.. ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ టాక్ ఇలా ఉందేంటి?
కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చి వేసిన ఆరోపణలపై నిర్మాత సురేశ్ బాబు, హీరో దగ్గుబాటి వెంకటేశ్, హీరో రానా దగ్గుబాటి, హీరో అభిరామ్‌పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బి సెక్షన్లపై ఎఫ్‌ఐఆర్ నమోదుతో విచారణ చేపట్టారు.