Ajith Kumar: రేసింగ్ సర్క్యూట్‌లో అజిత్ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:14 PM
దుబాయ్ లో 24 గంటల రేసింగ్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కారులో ట్రాక్‌పై ప్రాక్టీస్ చేస్తుండగా.. హీరో అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన కారు నుజ్జునుజ్జయింది. వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రేసింగ్, రైడింగ్ అంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్‌లో 24 గంటల రేసింగ్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కారులో ట్రాక్‌పై ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన కారు అదుపుతప్పి సైడ్ వాల్‌ను బలంగా ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే కారు మాత్రం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని ఆయన రేసింగ్ టీం సోషల్ మీడియాలో తెలియజేసింది.
Also Read- Renu Desai: అలా ఎలా తీశారో.. ఆ సినిమా చూస్తూ ఏడ్చేశా..
‘ట్రాక్‌పై ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ కుమార్ కారు మాసివ్ క్రాష్ అయింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఒక్క గీత కూడా పడలేదు. ఎటువంటి గాయాలు లేకుండా సేఫ్‌గా ఆయన బయటకు నడుచుకుంటూ వచ్చారు. రేసింగ్ అంటే అంతే మరి’ అని అజిత్ కుమార్ రేసింగ్ సోషల్ మీడియా అకౌంట్ పేర్కొంది. ఈ ప్రమాదం గురించి తెలిసి మొదట అభిమానులు కంగారు పడినా.. ఆయనకేం కాలేదని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు ఈ రేసింగ్ నిమిత్తం దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైన అజిత్‌కు భార్య శాలిని, కుమారుడు అద్విక్ సెండాఫ్ ఇచ్చిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘Dubai 24 Hours Race’లో పాల్గొనేందుకు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు.
అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అందులో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మరొకటి షూటింగ్ స్టేజ్‌లో ఉంది. అజిత్ నటిస్తున్న ‘విడాముయర్చి’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల ప్రాసెస్‌లో ఉంది. వాస్తవానికి ఈ పొంగల్‌కు రిలీజ్ అని ప్రకటించారు కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. మరో సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.