Oscar 2025: అందరి చూపు... 'ఎమిలియా పెరేజ్' వైపే

ABN , Publish Date - Feb 27 , 2025 | 05:35 PM

ప్రతి సంవత్సరం అకాడమీ అవార్డ్స్ (Academy Awards) లో ఏదో ఒక సినిమా అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది. అత్యధిక నామినేషన్స్ పొందడం వల్ల కానీ, ఆస్కార్ అవార్డుల కంటే ముందు సాగే వేరే అవార్డులు సాధించడం వల్ల కానీ ప్రతియేటా కొన్ని సినిమాలు ఆస్కార్ బరిలో ఆసక్తిని కలిగిస్తుంటాయి.

ప్రతి సంవత్సరం అకాడమీ అవార్డ్స్ (Academy Awards) లో ఏదో ఒక సినిమా అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది. అత్యధిక నామినేషన్స్ పొందడం వల్ల కానీ, ఆస్కార్ అవార్డుల కంటే ముందు సాగే వేరే అవార్డులు సాధించడం వల్ల కానీ ప్రతియేటా కొన్ని సినిమాలు ఆస్కార్ బరిలో ఆసక్తిని కలిగిస్తుంటాయి. 97వ ఆస్కార్ అవార్డుల్లో ఫ్రెంచి సినిమా 'ఎమిలియా పెరెజ్' ఈ సారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం ఏంటంటే ఈ సారి ఎక్కువ నామినేషన్స్ పొందిన సినిమాగా 'ఎమిలియా పెరెజ్' (Emilia Perez) నిలచింది. ఈ చిత్రం 13 నామినేషన్స్ పొందింది. అందునా ఓ నాన్-ఇంగ్లిష్ మూవీ (Non-English Movie) అన్ని నామినేషన్స్ సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి.  ఇంతకు ముందు 2000లో యాంగ్ లీ రూపొందించిన చైనీస్ మార్షియల్ ఆర్ట్స్ మూవీ  'క్రౌచింగ్ టైగర్ - హిడెన్ డ్రాగన్' (Crouching Tiger - Hidden Dragon), 2018లో తెరకెక్కిన స్పానిష్ సినిమా 'రోమా' (Roma) చిత్రాలు పదేసి ఆస్కార్ నామినేషన్స్ సొంతం చేసుకున్నాయి. వాటి రికార్డును ఇప్పుడు 'ఎమిలియా పెరేజ్' బద్దలు కొట్టింది. అందువల్ల అందరి చూపు 'ఎమిలియా పెరేజ్' వైపు సాగుతోంది.



 2018లో 10 ఆస్కార్ నామినేషన్స్ సంపాదించిన స్పానిష్ మూవీ 'రోమా' మూడు ఆస్కార్లు సొంతం చేసుకుంది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిమ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫి అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. దీనికంటే ముందు 2000 సంవత్సరంలో పది ఆస్కార్ నామినేషన్స్ పొందిన చైనీస్ మార్షియల్ ఆర్ట్స్ పిక్చర్ 'క్రౌచింగ్ టైగర్ - హిడెన్ డ్రాగన్' నాలుగు ఆస్కార్లను అందుకుంది. అందులో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిమ్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డులను 'క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్' సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలను తలదన్నేలా 13 ఆస్కార్ నామినేషన్స్ పొందిన 'ఎమిలియా పెరేజ్' ఎన్ని అవార్డులు పోగేస్తుందో చూడాలన్నదే అందరి ఆశ!

Updated Date - Feb 27 , 2025 | 05:35 PM