Oscar 2025: 'ఎమిలియా పెరేజ్' ఆ రెండూ కొట్టేస్తుందా..
ABN , Publish Date - Feb 28 , 2025 | 02:02 PM
మరో కొద్ది రోజుల్లో 97వ ఆస్కార్ అవార్డుల వేడుక సాగనుంది. ఈ నేపథ్యంలో సినీఫ్యాన్స్ అందరూ ఫ్రెంచి సినిమా 'ఎమిలియా పెరేజ్' (Emilia Perez) పేరే తలచుకుంటున్నారు.
మరో కొద్ది రోజుల్లో 97వ ఆస్కార్ అవార్డుల వేడుక సాగనుంది. ఈ నేపథ్యంలో సినీఫ్యాన్స్ అందరూ ఫ్రెంచి సినిమా 'ఎమిలియా పెరేజ్' (Emilia Perez) పేరే తలచుకుంటున్నారు. ఎందుకంటే ఓ నాన్ ఇంగ్లిష్ మూవీ (Non-English Movie)గా 'ఎమిలియా పెరేజ్' ఏకంగా 13 ఆస్కార్ నామినేషన్స్ సంపాదించడంతో చర్చ ఊపందుకుంది.
ఈ సినిమా అకాడమీ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్ రెండు విభాగాల్లోనూ నామినేషన్స్ సంపాదించడం విశేషం! అలాగే బెస్ట్ మ్యూజిక్ - ఒరిజినల్ సాంగ్ విభాగంలో రెండు నామినేషన్స్ సొంతం చేసుకుంది. ఇలా మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీఫ్యాన్స్ ను 'ఎమిలియా పెరేజ్' తనవైపు ఆకర్షిస్తోంది.
ఇంతకూ 'ఎమిలియా పెరేజ్' ఏ యే విభాగాల్లో నామినేషన్స్ సాధించిందంటే - బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్, బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్, రెండు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సౌండ్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, బెస్ట్ ఫిలిమ్ ఎడిటింగ్- ఇలా మొత్తం 13 నామినేషన్స్ సంపాదించింది.
గతంలో పది నామినేషన్స్ సంపాదించిన నాన్ ఇంగ్లిష్ మూవీస్ లో 'క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్' (2000), 'రోమా' (2018) వంటివి ఉన్నాయి. ఆ సినిమాలు కూడా బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ రెండు విభాగాల్లోనూ నామినేషన్స్ సంపాదించినా 'బెస్ట్ పిక్చర్' అవార్డును సొంతం చేసుకోలేకపోయాయి. కేవలం 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్'తోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. వాటితో పాటు 'బెస్ట్ ఫిలిమ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్' రెండు విభాగాల్లోనూ నామినేషన్స్ సంపాదించిన ఆంగ్లేతర చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో 1969 నాటి ఫ్రెంచి సినిమా 'జెడ్', 1999 ఇటాలియన్ ఫిలిమ్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' కూడా ఉన్నాయి. వాటితో పాటు ఫ్రెంచి మూవీ 'ఆమోర్' (2012), కొరియన్ సినిమా 'ప్యారసైట్' (2019), జపనీస్ చిత్రం 'డ్రైవ్ మై కార్' (2021), జర్మన్ సినిమా 'ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్' (2022), జర్మన్ అండ్ పాలిష్ మూవీ 'జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్' (2023) వంటివి ఉత్తమ చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం నామినేషన్స్ ను పొందాయి. అయితే వీటిలో ఒకే ఒక్క 'ప్యారసైట్' మాత్రంమే బెస్ట్ పిక్చర్ అవార్డ్ తో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్ అవార్డునూ దక్కించుకుంది.
అందువల్ల 13 నామినేషన్స్ సంపాదించిన నాన్-ఇంగ్లిష్ మూవీగా నిలచిన 'ఎమిలియా పెరేజ్' ఏమైనా చరిత్ర సృష్టిస్తుందా అని సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి దాకా ఎక్కువ ఆస్కార్ అవార్డులు అందుకున్న ఆంగ్లేతర చిత్రంగా చైనీస్ మార్షియల్ ఆర్ట్స్ పిక్చర్ 'క్రౌచింగ్ టైగర్ - హిడెన్ డ్రాగన్' నిలచింది. ఈ సినిమా నాలుగు ఆస్కార్లను సొంతం చేసుకుంది. దీనికన్నా మిన్నగా 'ఎమిలియా పెరేజ్' అవార్డులు దక్కించుకుంటుందా అన్నదే అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న అంశం. అలాగే కొరియన్ మూవీ 'ప్యారసైట్' లాగా బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్ రెండు విభాగాల్లోనూ విజేతగా నిలుస్తుందేమో చూడాలనీ ఆస్కార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. 'ఎమిలియా పెరేజ్' చిత్రం ఇప్పటికే 'బ్రిటిష్ అకాడమీ ఫిలిమ్ అవార్డ్స్'లోనూ 11 నామినేషన్స్ సంపాదించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అక్కడ కొన్నిఅవార్డులనే పోగేసుకున్న 'ఎమిలియా పెరేజ్' ఆస్కార్ బరిలో సరికొత్త చరిత్ర ఏమైనా సృష్టిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి మార్చి 3వ తేదీ ఉదయం ఫ్యాన్స్ ఆశలను ఈ సినిమా ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి.