Oscars stunt design category: రాజమౌళి హర్షం
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:44 PM
ఆస్కార్ అవార్డ్స్ లో కొత్త కేటగిరికి చోటు దక్కింది. స్టంట్ డిజైన్ అనే కేటగిరిని ప్రవేశ పెట్టారు. దీనికి సంబంధించిన పోస్టర్ లో 'ట్రిపుల్ ఆర్' ఫోటోను పెట్టడం విశేషం.
ధనాధన్... ఫటాఫట్... అంటూ సాగే స్టంట్స్ ఉంటేనే కలెక్షన్ల వర్షం కురుస్తుందని సినీజనం నమ్మకం. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ మేకర్స్ స్టంట్స్ తోనే సాగుతుంటారు. అలాంటి పోరాటాలకు ఆస్కార్ అవార్డ్స్ లో ఇప్పటి దాకా చోటు లేకపోవడం విచారకరం! నూరవ ఆస్కార్ వేడుకల్లో స్టంట్స్ కు కూడా ఓ కేటగిరీ కేటాయించడం ఇప్పుడు ఆనందకరంగా మారింది.
సినిమాలు పలుకులు నేర్వక ముందు కూడా పోరాట సన్నివేశాలతో సాగాయి... స్టంట్ సీన్స్ లో డూప్ లేకుండా నటించి భళా అనిపించారెందరో యాక్షన్ స్టార్స్... అలాంటి వారిని యాక్షన్ ఎపిసోడ్స్ లో నటింప చేస్తూ ప్రేక్షకులను గగుర్పాటుకు గురిచేసే స్టంట్స్ తెరకెక్కించిన వారెందరో ఉన్నారు... 1939లోనే జాన్ ఫోర్డ్ తన 'స్టేజ్ కోచ్'లో తీసిన హార్స్ ఛేజ్ ను చూసి అప్పటి ఆడియెన్స్ థ్రిల్ అయ్యారు... స్టంట్స్ కు గనుక ఆస్కార్ (Oscar) అంటూ ఇస్తే 'స్టేజ్ కోచ్'లో యాక్షన్ సీన్స్ కు ఇవ్వాలని కితాబునిచ్చారు ప్రేక్షకులు... అయితే 97 ఏళ్ళయినా ఆస్కార్స్ లో స్టంట్స్ కేటగిరీ లేకపోవడం గమనార్హం... అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఇన్నాళ్ళకు అకాడమీ ఇకపై స్టంట్స్ కు కూడా అవార్డులు ఇస్తామని ప్రకటించింది... 2028లో జరిగే 100వ ఆస్కార్ అవార్డుల్లో తొలిసారి స్టంట్ డిజైన్ ను జోడించనున్నారు... 2027లో విడుదలై 2028లో జరిగే ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో తొలిసారి స్టంట్ డిజైన్ కేటగిరీలో అవార్డు వెలగనుంది... ఆస్కార్స్ లో స్టంట్ డిజైన్ విభాగం ప్రవేశ పెట్టగానే యాక్షన్ మూవీస్ తీసే వారందరూ ఆనందిస్తున్నారు... అలాంటి వారిలో మన ఆసియా యాక్షన్ స్టార్ జాకీ చాన్ కూడా ఉన్నారు.
యాక్షన్ ఎపిసోడ్స్ ను తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు మన తెలుగు దర్శకుడు రాజమౌళి... ఆయన కూడా ఆస్కార్స్ లో స్టంట్ డిజైన్ ను చేర్చగానే హర్షం వ్యక్తం చేశారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో రాజమౌళి (Rajamouli) 'ట్రిపుల్ ఆర్' (RRR) మూవీలోని "నాటు నాటు..." సాంగ్ ఆస్కార్ అవార్డునూ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా భారీవ్యయంతో రాజమౌళి ఓ జంగిల్ అడ్వెంచర్ తెరకెక్కిస్తున్నారు... స్టంట్ డిజైన్ వంటి కీలక విభాగాన్ని 100వ ఆస్కార్ అవార్డుల్లో చొప్పించడం అభినందనీయమని ఆయన అన్నారు... అలాగే వందేళ్ళ కల సాకారమవుతోందని ఆయన పేర్కొనడం విశేషం!
ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల సినిమాల్లో యాక్షన్ కొరియోగ్రఫి వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగుతూ ఉంటుంది... హాలీవుడ్ మూవీస్ లో వెస్ట్రన్ టచ్ తో స్టంట్ డిజైన్ రూపొందుతుంది... జపాన్, చైనా దేశాల్లో తమ యుద్ధవిద్యల ఆధారంగా ఈ నాటికీ స్టంట్ డిజైన్ తో సినిమాలు తెరకెక్కుతుంటాయి... ఇక భిన్నత్వంలో ఏకత్వం చూపించే మన దేశంలోనూ పలు ప్రాంతాలకు చెందిన పురాతన పోరాట కళల ఆధారంగా యాక్షన్ సీన్స్ రూపొందుతూ ఉంటాయి... మన తెలుగు సినిమాల విషయానికి వస్తే ఈ నాటికీ కర్రసాములు, కత్తి యుద్ధాలు ఏదో ఒక చిత్రంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి... ఇలా విభిన్న సంస్కృతుల ఆధారంగా రూపొందే పోరాట సన్నివేశాలు యాక్షన్ లవర్స్ ను అలరిస్తున్నాయి... ఇన్నాళ్ళకు ఆస్కార్ అవార్డుల్లో స్టంట్ డిజైన్ చోటు సంపాదించడం నిస్సందేహంగా అభినందనీయమే!... మరి స్టంట్ డిజైన్ కు వేదిక కానున్న 100వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఏ సినిమా స్టంట్ డిజైన్ లో ఉత్తమంగా నిలుస్తుందో చూడాలి.
Also Read: Pawan Kalyan: పోస్ట్ ప్రొడక్షన్ లో హరి హర వీరమల్లు
Also Read: Akkada Ammayi Ikkada Abbayi: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి