James Cameron: ఎ.ఐ. గురించి టాప్ ఫిల్మ్ మేకర్ ఏమన్నారంటే...
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:41 PM
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ ఎ.ఐ. పై తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఒకప్పడు దాని వల్ల నష్టమని చెప్పిన ఆయన ఇప్పుడు జై కొడుతున్నారు.
విఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరాన్ (James Cameron) రూపొందించిన 'అవతార్ -3' డిసెంబర్ లో జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జేమ్స్ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కు జై కొట్టడం విశేషంగా మారింది. ఒకప్పుడు ఏఐ జనానికి నష్టం వాటిల్ల చేస్తుందని లెక్చర్ దంచిన జేమ్స్ కేమరాన్ ఇప్పుడు ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తో సాగడానికే సై అంటున్నారు. తాను రూపొందించిన 'టెర్మినేటర్' (Terminator) సిరీస్ లో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి నష్టం వాటిల్లనుందనే చాటారు జేమ్స్. అలాగే రెండేళ్ళ క్రితం అంటే 2023లోనూ అదే విషయాన్ని గుర్తు చేశారు. తన దాకా వస్తే కానీ తెలియదన్నట్టుగా ఇప్పుడు జేమ్స్ ఏఐకి ఓటేశారు. అయితే ఎప్పటిలాగే తాను టెక్నీషియన్స్ పక్షమే అనీ చాటారు. గ్రాఫిక్స్ కారణంగా తాను రూపొందించిన 'అవతార్' సిరీస్, డెనిస్ తెరకెక్కించిన 'డ్యూన్, డ్యూన్ పార్ట్ 2' వంటి సినిమాలకు భారీ వ్యయం అవుతోందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తో సాగితే పనిత్వరగా పూర్తవుతుందని ఆయన భావిస్తున్నారు.
ఏఐతో సాగితే సగానికి సగం వ్యయం తగ్గుతుందని, అలాగే సమయం కూడా కలసి వస్తుందని అంటున్నారు 70 ఏళ్ళ జేమ్స్ కేమరాన్. ఇక్కడ ఆయన వయసును అదే పనిగా గుర్తు చేసుకోవడం దేనికంటే, అవతార్ సిరీస్ తెరకెక్కించడంలోనే ఆయన చాలా ఏళ్ళు సాగారు. 2009లో 'అవతార్' తొలి భాగం విడుదల చేసిన కేమరాన్, దాదాపు 13 ఏళ్ళకు అంటే 2022లో 'అవతార్ - ద వే ఆఫ్ వాటర్'ను రిలీజ్ చేశారు. ఈ యేడాది డిసెంబర్ లో 'అవతార్ 3' గా 'ఫైర్ అండ్ యాష్'ను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు. కేవలం గ్రాఫిక్స్ కారణంగానే సినిమాల నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతోందని జేమ్స్ కేమరాన్ అంటున్నారు. దానిని తగ్గించాలంటే ఏఐతో సాగవలసిందేననీ ఆయన చెబుతున్నారు. ఏఐతో సాగినంత మాత్రాన సినిమా సిబ్బందిని తగ్గించినట్టు కాదనీ భరోసా ఇస్తున్నారు. పైగా ఏఐని హ్యాండిల్ చేయడానికి కూడా మనుషులే కావాలని, ఇప్పుడు సిబ్బందిని డబుల్ చేస్తామని, తద్వారా పని వేగవంతమవుతుందనీ జేమ్స్ వివరిస్తున్నారు.
ఏది ఏమైనా గ్రాఫిక్స్ కంటే ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తోనే ఔట్ పుట్ బాగా వస్తే ఎంతోమంది సినీజనం అటుగా అడుగులు వేయక మానరు. పైగా సమయం కలసి వస్తుందని, అప్పుడు అనుకున్న సమయానికి తమ చిత్రాలను విడుదల చేయవచ్చునని భావిస్తున్నారు. ప్రొఫెషనల్ గ్రేడ్ ఇమేజెస్ ను రూపొందించే 'స్టెబిలిటీ ఏఐ' (Stbility AI) సంస్థలో జేమ్స్ కేమరాన్ కూడా ఓ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాబోయే 'అవతార్-3' గురించి మాట్లాడారు. మరి డిసెంబర్ 19న ప్రేక్షకులను పలకరించబోయే 'అవతార్- ఫైర్ అండ్ యాష్' (Avatar - Fire and Ash) ఏ రేంజ్ లో కనువిందు చేస్తుందో చూడాలి.
Also Read: Charu Asopa: నటనకు స్వస్తి పలకలేదట...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి