Steven Speilberg: భిన్నాభిప్రాయాలు రేకెత్తించిన 'ష్రెక్ -5' టీజర్!
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:12 PM
ఇప్పటి దాకా 'ష్రెక్' సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తూ అఖండ విజయం సాధించాయి. దాదాపు 15 ఏళ్ళ తరువాత 'ష్రెక్ -5' రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలయింది.
బాలలను విశేషంగా అలరించిన 'ష్రెక్' (Shrek) పిక్చర్ బుక్ ఆధారంగా 2001 యానిమేటెడ్ మూవీ 'ష్రెక్' తెరకెక్కింది. ప్రఖ్యాత దర్శకనిర్మాత, పంపిణీదారుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ (Steven Speilberg) కు చెందిన 'డ్రీమ్ వర్క్స్ యానిమేషన్' కంపెనీలోనే 'ష్రెక్' రూపొందింది. స్పీల్ బెర్గ్ 'డ్రీమ్ వర్క్స్' ద్వారానే విడుదలయింది. 24 ఏళ్ళ క్రితం 60 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన 'ష్రెక్' 492 మిలియన్ డాలర్లు పోగేసింది. అంతటి ఘనవిజయం చూసిన తరువాత వరుసగా 'ష్రెక్-2' (Shrek -2), 'ష్రెక్ ద థర్డ్' (Shrek the Third), 'ష్రెక్ ఫరెవర్ ఆఫ్టర్ (Shrek forever After)' అనే సినిమాలు వెలుగు చూశాయి. ఇప్పటి దాకా 'ష్రెక్' సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తూ అఖండ విజయం సాధించాయి. దాదాపు 15 ఏళ్ళ తరువాత 'ష్రెక్ -5' రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలయింది. ప్రధాన పాత్రలు ష్రెక్, డాంకీ, ఫ్లోనా, పినోచ్చియో, పెలిసియా పాత్రలు ఈ టీజర్ లో దర్శనమిచ్చాయి. ఎప్పటిలాగే ఎడ్డీ మర్ఫీ, మైక్ మేయర్స్, కేమరాన్ డియాజ్ వాయిస్ తోనే 'ష్రెక్-5' టీజర్ కూడా సందడి చేసింది.
టీనేజ్ లో ఉన్న పిల్లలు మాత్రం 'ష్రెక్-5' టీజర్ ను చూసి సంతోషిస్తున్నారు. సినిమా ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే పాతికేళ్ళు పైబడ్డ 'ష్రెక్' ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ ను చూసి నిరాశ చెందారు. ఈ పదిహేనేళ్ళ సమయంలో 'ష్రెక్'లోని పాత్రలకు కూడా వయసు పెరిగి ఉంటుంది కదా! అందువల్ల వాటి రూపురేఖల్లో మార్పు ఉంటే బాగుంటుందని కొందరు, ఎప్పుడు వచ్చినా ఒకేలా ఉంటేనే మేలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అన్నట్టు 'ష్రెక్-5' మూవీ 2026 డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రానుంది. అంటే మరో 21 నెలల సమయం ఉందన్న మాట! ఈ లోగా ఫ్యాన్స్ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని 'ష్రెక్-5'లోని కేరెక్టర్స్ మేకోవర్ సాగుతుందేమో చూద్దామంటున్నారు హాలీవుడ్ జనం.