James Bond: క్రిస్టఫర్ నోలాన్ డైరెక్షన్ లో జేమ్స్ బాండ్ మూవీ

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:14 PM

వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట క్రిస్టఫర్ నోలాన్. ఆయన ఇప్పుడు జేమ్స్ బాండ్ మూవీ చేయబోతున్నారు.

ప్రతి సినిమాతో వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగుతున్నారు హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ (Christopher Nolan). అలాంటి నోలాన్ ను వెదుక్కుంటూ జేమ్స్ బాండ్ (James Bond) సినిమా వెళ్తోంది. వింటూంటేనే ఎంతో ఆసక్తి కలుగుతోంది కదూ! ఈ వార్త అటు జేమ్స్ బాండ్ ఫ్యాన్స్ కు, ఇటు నోలాన్ అభిమానులకు ఆనందం పొంగిపొరలేలా చేస్తోంది.

హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ సినిమాలతో ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు ఆయన ఫ్యాన్ గా మారకుండా ఉండలేరు. ఇది ఒకరు అంటున్న మాట కాదు. సాక్షాత్తు హాలీవుడ్ ను ఏలేసిన జేమ్స్ కేమరాన్ (James Cameron), స్టీవెన్ స్పీల్ బర్గ్ (Steven Speilberg) వంటి దిగ్గజ దర్శకులే చెబుతున్నారు. తాను తెరకెక్కించిన ప్రతీ చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందిస్తూ, అందులోని పాత్రలను విలక్షణంగా చిత్రీకరిస్తూ సాగుతున్నారు క్రిస్టఫర్. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో జేమ్స్ బాండ్ మూవీని తెరకెక్కించాలని అమేజాన్ - ఎమ్.జి.ఎమ్. (Amezon - MGM) సంస్థ భావిస్తోంది. ఆ సంస్థ అభిమానులు, సన్నిహితులు కూడా వారి నిర్ణయం సబబైనదే అని కితాబు నిస్తున్నారు.. ఎందుకంటే ఒకప్పుడు డీసీ కామిక్స్ లోని బ్యాట్ మేన్ కేరెక్టర్ తో క్రిస్టఫర్ రూపొందించిన 'బ్యాట్ మేన్ బిగిన్స్' , 'ద డార్క్ నైట్' భలేగా అలరించాయి.. ఇందులో క్రిస్టఫర్ క్రియేట్ చేసిన జోకర్ పాత్ర మరపురానిది... కాబట్టి పాత పాత్రలతోనూ అదరహో అనిపించేలా సినిమాలు తీయడంలో నోలాన్ సిద్ధహస్తుడనీ హాలీవుడ్ జనం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నోలాన్ డైరెక్షన్ లో జేమ్స్ బాండ్ ను కొత్తతరహాలో చూపించాలని అమేజాన్ - ఎమ్.జి.ఎమ్. సంస్థ ప్రయత్నిస్తోంది.

Also Read: Mythri Movie Makers: 'కిస్ కిస్ కిస్సక్'గా 'పింటూ కీ పప్పీ'


ఆరంభంలో 'మెమెంటో, ఇన్ సోమ్నియా, బ్యాట్ మేన్ సిరీస్'తో ఆకట్టుకున్న క్రిస్టఫర్ నోలాన్ 'ఇన్ సెప్షన్'తో ఒక్కసారిగా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు. నోలాన్ కెరీర్ లో ఫస్ట్ బిగ్ హిట్ గా 'ఇన్ సెప్షన్' నిలచింది. ఆ తరువాత "ఇంటర్ స్టెల్లార్, డన్ కిర్క్, టెనెట్" సినిమాలతోనూ మురిపించిన క్రిస్టఫర్ గత సంవత్సరం తన 'ఒపెన్ హైమర్'తో బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అందుకున్నారు. ప్రస్తుతం హోమర్ 'ఆడిస్సీ'ను తెరకెక్కిస్తున్నారు క్రిస్టఫర్. అది పూర్తి కాగానే ఆయన దర్శకత్వంలో కొత్త జేమ్స్ బాండ్ మూవీ రూపొందించాలని ఎమ్.జి.ఎమ్. సంస్థ అభిలాష. చిన్నప్పటి నుంచీ తనను ఎంతగానో అలరించిన జేమ్స్ బాండ్ ను తన పంథాలో తెరకెక్కించడం అదృష్టంగానే భావిస్తాననీ క్రిస్టఫర్ అంటున్నారు. ఇప్పుడు తీస్తోన్న 'ఆడిస్సీ'నే క్రిస్టఫర్ కు ఓ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పటికే హోమర్ రాసిన 'ఆడిస్సీ' ఆధారంగా పలు హాలీవుడ్ మూవీస్ తెరకెక్కాయి. అలాగే వెబ్ సిరీస్ కూడా రూపొందాయి. ఈ నేపథ్యంలో గ్రీకుల పురాణం 'ఆడిస్సీ'ని క్రిస్టఫర్ ఏ తీరున తెరకెక్కిస్తారో చూడాలని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కాగానే నోలాన్ మరో సవాల్ గా జేమ్స్ బాండ్ ను నవతరం ప్రేక్షకులు మెచ్చేలా ఎంచుకుంటున్నారనీ సినీజనం అంటున్నారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఆబాలగోపాలాన్నీ అలరించిన జేమ్స్ బాండ్ పాత్రను క్రిస్టఫర్ నోలాన్ ఏ రీతిన తీర్చిదిద్దుతారో చూడాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 07 , 2025 | 04:14 PM