Mikey Madison - Oscar: చిన్న వయసులో చరిత్రకెక్కింది
ABN , Publish Date - Mar 16 , 2025 | 10:43 AM
‘అనోరా’ చిత్రంలో నేను పోషించిన వేశ్య పాత్ర కోసం మూడు నెలల పాటు ప్రత్యేకంగా ల్యాప్ డ్యాన్స్ నేర్చుకున్నా. కొన్ని రకాల యాక్షన్ స్టంట్స్ కూడా సాధన చేశా. అంతేకాదు... రష్యన్ భాష కూడా నేర్చుకున్నా.
మైకీ మ్యాడిసన్(Mikey Madison)... ఈ పేరు ప్రస్తుతం ప్రపంచమంతా మార్మోగుతోంది. హాలీవుడ్ చిత్రం ‘అనోరా’లో (Anora)వేశ్యగా నటించి ఉత్తమనటిగా ‘ఆస్కార్’ (97th oscar) అందుకుంది. పాతికేళ్లకే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకొని... ఆస్కార్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో అతి పిన్న నటిగా చరిత్రకెక్కింది. ఈ సందర్భంగా ఆమె గురించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలివి...
వారి కష్టాలు కన్నీళ్లు పెట్టించాయి...
‘అనోరా’ చిత్రంలో నేను పోషించిన వేశ్య పాత్ర కోసం మూడు నెలల పాటు ప్రత్యేకంగా ల్యాప్ డ్యాన్స్ నేర్చుకున్నా. కొన్ని రకాల యాక్షన్ స్టంట్స్ కూడా సాధన చేశా. అంతేకాదు... రష్యన్ భాష కూడా నేర్చుకున్నా. వేశ్యల జీవితాలు, సమాజంలో వాళ్లు ఎదుర్కొంటోన్న సమస్యల గురించి తెలుసుకోవడానికి పలుమార్లు సెక్స్ క్లబ్స్, నైట్ క్లబ్స్‌కి వెళ్లా. ఎంతో మంది వేశ్యలను కలిశా. ఆ క్రమంలో వాళ్ల బాధలు, సమాజం నుంచి వాళ్లు ఎదుర్కొంటున్న అవమానాలను ప్రత్యక్షంగా చూశా. వారి మాటలు నా మనసును బాగా కదిలించాయి. కన్నీళ్లు పెట్టించాయి.
నేను సిగ్గరిని...
ఒకప్పుడు నేను చాలా సిగ్గరిని. ఎవరితోనైనా మాట్లాడాలంటే తెగ సంకోచించేదాన్ని. ఎదుటివారి కళ్లలోకి చూసే సాహసం కూడా చేసేదాన్ని కాదు. అయితే ఇవన్నీ కెమెరా అవతలే. ఒక్కసారి కెమెరా ముందుకు వెళితే గనుక సిగ్గు, బిడియాన్ని పక్కన పెట్టేసి నా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తా. దర్శకుడు కట్ చెప్పగానే వెళ్లిపోయి ఒక మూలన కూర్చొనేదాన్ని. సెట్స్‌లో ఎవరితోనూ పెద్దగా కలిసేదాన్ని కాదు. తర్వాత మెల్లమెల్లగా నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు ఎవరితోనైనా కాన్ఫిడెంట్‌గా మాట్లాడే స్థాయికి వచ్చా. ఇదంతా ఎలా సాధ్యమైందో తలుచుకుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యమేస్తుంది.
ఇంట్లోనే చదువంతా...
నేను పుట్టి పెరిగిందంతా లాస్ ఏంజెల్స్‌లో. అమ్మానాన్నలిద్దరూ మానసిక వైద్య నిపుణులు. ఏడో తరగతిలో ఉన్నప్పుడే ‘రిటైర్‌మెంట్ అండ్ పనిష్ బాక్స్’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘లిజా లిజా స్కైస్ ఆర్ గ్రే’తో హీరోయిన్‌గా అడుగుపెట్టా. సినిమాల వల్ల స్కూలుకు వెళ్లడం కుదరకపోవడంతో నా చదువంతా ఇంట్లోనే సాగింది. ‘బెటర్ థింగ్స్’ అనే కామెడీ డ్రామా సిరీస్‌లో టీనేజ్ యువతి పాత్ర పోషించా. ఆ సిరీస్ విజయవంతంగా 2022 దాకా నడిచింది. ‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’, ‘స్ర్కీమ్’ సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ జర్నీలో బ్రాడ్‌పిట్, లియోనార్డో డికాప్రియో వంటి మేటి నటుల సరసన నటించే అవకాశం దక్కింది.
అన్నీ అమ్మే
మేము ఐదుగురు తోబుట్టువులం. మా అమ్మ మమ్మల్ని కంటికిరెప్పలా చూసుకుంటూ, ఇంటిని చక్కబెడుతూ, మరోవైపు ఉద్యోగినిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది. అంత ఓపికగా అన్నింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుందోనని ఆశ్చర్యపోతుంటా. నాకు అమ్మ అయినా, స్నేహితురాలైనా, గైడ్ అయినా.. అన్నీ తనే. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా మొదట తనతోనే పంచుకుంటా. అమ్మ ప్రోత్సాహంతోనే యాక్టింగ్ స్కూల్‌లో చేరి ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నా. అమ్మ, అమ్మమ్మకు గుర్రపు స్వారీలో నైపుణ్యం ఉంది. వారిని చూశాకే నేనూ గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నా. అందుకే నా జీవితంలో అత్యంత ప్రభావంతమైన వ్యక్తి ఎవరని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా అమ్మ పేరే చెబుతా.
వంట బాగా చేస్తా
వంట చేసి, నలుగురికి పెట్టడమంటే
నాకు చాలా ఇష్టం. ఎవరైనా మా ఇంటికి వస్తున్నారంటే.. ముందుగానే వాళ్లకి నచ్చిన ఐటెమ్స్ అన్నీ కనుక్కొని, నా స్టైల్‌లో కమ్మగా వండుతా. ఖాళీ సమయాల్లో కొత్త కొత్త వంటకాలను ప్రయత్నిస్తుంటా. వీగన్ చాక్లెట్ చిప్ కుకీస్ నాకు బాగా ఇష్టం. సినిమాలు, సిరీస్‌లు చూడడానికి ఎక్కువ సమయం కేటాయిస్తా. అప్పుడప్పుడు సరదాగా స్నేహితులతో ఔటింగ్స్‌కు వెళ్తుంటా. లేదంటే నా పెంపుడు కుక్క జామ్, పెంపుడు పిల్లి బిస్కట్‌తో ఎక్కువ సమయం గడుపుతా.
వింటేజ్ దుస్తులకే ఓటు
నా దృష్టిలో ఫ్యాషన్ అంటే... అందం, సౌకర్యం రెండూ. ఒకవేళ నాకు బాగా నచ్చి, సౌకర్యంగా లేకపోతే ఆ దుస్తుల జోలికే వెళ్లను. యుక్త వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా 70ల నాటి దుస్తులు ధరించడానికి ఇష్టపడేదాన్ని. నిజానికి నాకు మోడ్రన్ దుస్తుల కన్నా పాతకాలపు దుస్తుల్లో కనిపించడమంటేనే ఇష్టం. నా వార్డ్‌రోబ్‌లో ఎక్కువగా వింటేజ్ దుస్తులే ఉంటాయి. ఓసారి విక్టోరియన్ స్టైల్ దుస్తులు ధరించి తీయించుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తే అవి బాగా వైరల్ అయ్యాయి.