Oscar winner: ఆస్కార్ ఉత్తమ నటుడు ఆడ్రియెన్ బ్రాడీ అరుదైన రికార్డ్స్
ABN , Publish Date - Mar 03 , 2025 | 01:10 PM
ఈ సారి జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్రదానోత్సవంలో ఉత్తమనటునిగా నిలచిన ఆడ్రియెన్ బ్రాడీ (Adrein Brody) ఓ చరిత్రను సృష్టించారు.
ఈ సారి జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్రదానోత్సవంలో ఉత్తమనటునిగా నిలచిన ఆడ్రియెన్ బ్రాడీ (Adrein Brody) ఓ చరిత్రను సృష్టించారు. ఆయన మొదటిసారి 2002లో 'ద పియానిస్ట్' (The Pianist -2002) సినిమాతో బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను అందుకున్నారు. అప్పుడు బ్రాడీ వయసు 29 సంవత్సరాలు అంత పిన్నవయసులో ఉత్తమ నటునిగా ఆస్కార్ అందుకున్న మొదటి యాక్టర్ గా చరిత్రలో నిలిచారు బ్రాడీ. సరిగా 22 సంవత్సరాల తరువాత బ్రాడీ ఉత్తమ నటునిగా రెండో ఆస్కార్ అవార్డును 'ద బ్రూటలిస్ట్' (The Brutalist - 2024) చిత్రంతో అందుకోవడం విశేషం! అప్పుడు 'ద పియానిస్ట్', ఇప్పుడు 'ద బ్రూటలిస్ట్'. టైటిల్స్ లో ఒకే రిథమ్ కనిపిస్తున్నట్టే కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు నాజీల మారణకాండ నేపథ్యంలోనే రూపొందాయి. 'ద పియానిస్ట్' సినిమాలో హోలోకాస్ట్ నుండి తప్పించుకున్న పాలిస్- జ్యూయిస్ పియానిస్ట్ గా ఆడ్రీ నటించి మెప్పించారు.
ఈ సారి 'ద బ్రూటలిస్ట్'లోనూ మారణహోమం నుండి తప్పించుకున్న హంగేరియన్ - జ్యూయిస్ గా నటించి ఆకట్టుకున్నారు బ్రాడీ. నిజజీవితంలోనూ ఆడ్రియెన్ బ్రాడీలో యూదుల రక్తం ఉంది. ఆయన తండ్రి ఎలియెట్ బ్రాడీ పాలిష్- జ్యూయిస్ కావడం విశేషం! అందువల్లే తనకు లభించిన క్లిష్టమైన పాత్రల్లోనూ అతిసులువుగా నటించేసి మెప్పించారు బ్రాడీ అని పరిశీలకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలా వరుసగా రెండు హోలోకాస్ట్ సర్వైవర్స్ కేరెక్టర్స్ తో ఉత్తమ నటుని కేటగిరీలో ఆస్కార్ అందుకోవడం బ్రాడీ నటజీవితంలో ఓ ప్రత్యేకతగా నిలచింది. అలాగే ఆస్కార్ చరిత్రలో 'యంగెస్ట్ బెస్ట్ యాక్టర్'గా, వరుసగా రెండుసార్లు నాజీల మారణహోమం నుండి తప్పించుకుని జీవనం సాగించిన పాత్రల్లోనే నటించి ఉత్తమ నటునిగా నిలచిన క్రెడిట్ నూ దక్కించుకున్నారు బ్రాడీ. మరి ఆడ్రియెన్ బ్రాడీ నెలకొల్పిన ఈ ఆస్కార్ రికార్డులను భవిష్యత్ లో ఎవరు బద్దలు కొడతారో చూడాలి.