Oscars 2025: ఈసారి ఆస్కార్ అవార్డులు ఉండవా.. క్లారిటీ వచ్చేసింది
ABN , Publish Date - Jan 15 , 2025 | 11:56 PM
లాస్ ఏంజెలెస్‌లో అలుముకున్న కార్చిచ్చు కారణంగా 97వ ఆస్కార్ అవార్డుల వేడుక రద్దయిందంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా అకాడమీ సభ్యులు రియాక్ట్ అయ్యారు. ఈసారి అవార్డుల వేడుక ఉంటుందో, ఉండదో వారు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే..
రెండు మూడు రోజులుగా 97వ ఆస్కార్ అవార్డుల వేడుక రద్దంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు కారణంగా మార్చి 2న జరగాల్సిన ఆస్కార్ వేడుకను ఫిల్మ్ అకాడమీ క్యాన్సిల్ చేసిందనేది వినిపిస్తున్న వార్తల్లోని సారాంశం. అయితే ఈ వార్తలపై అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్ రియాక్ట్ అయ్యారు. అకాడమీ అవార్డుల వేడుకపై వారిచ్చిన సమాధానంతో.. ఈ వేడుక ఉంటుందా? ఉండదా? అనేది క్లారిటీ వచ్చేసింది. 96 సంవత్సరాలుగా ఈ వేడుకను నిర్వహిస్తున్నామని, కోవిడ్ టైమ్‌లో వాయిదా వేశాం తప్పిదే.. అవార్డ్స్ ఈవెంట్‌ని ఎప్పుడూ క్యాన్సిల్ చేయలేదని అకాడమీ సభ్యులు సైతం చెబుతున్నారు.
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
అసలు ఏం జరిగిందంటే..
ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భీకర కార్చిచ్చు రాజేసుకుంది. కొన్ని గంటల్లోనే మంటలు సుదూర ప్రాంతాలకు వ్యాపించడంతో.. కొన్ని వేల హెక్టార్ల అసువులు దగ్ధం అయిపోయాయి. దీంతో లాస్ ఏంజెలెస్‌లో ఎమెర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది. దీంతో పరివాహక ప్రాంతాల్లోని 13 వేల నివాసాలు, దాదాపు 30 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించినట్లుగా వార్తలు వచ్చాయి. అందులో ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఈ కార్చిచ్చు కారణంగా హాలీవుడ్ స్టార్ యాక్టర్స్.. జెన్నిఫర్ అనిస్టన్, బ్రాడ్లీ కూపర్, టామ్ హాంక్స్, రీస్ విథర్‌స్పూన్, ఆడమ్ సాండ్లర్, మైఖేల్ కీటన్ వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ కార్చిచ్చులో అకాడమీకి చెందిన నలుగురు సభ్యుల ఇళ్లు కూడా బూడిదైనట్లుగా తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆస్కార్ అవార్డుల వేడుక నిర్వహించడం సాధ్యం కాదనేలా కొందరు వార్తలు వైరల్ చేశారు. ఈ వార్తలపై అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్ స్పందించారు.
‘‘లాస్ ఏంజెలెస్‌లో మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. అందుకే ఓటింగ్ వ్యవధిని పొడిగించాలని భావిస్తున్నాం. నామినేషన్లు ప్రకటించడానికి తేదీని మార్చాలని, సభ్యులకు అదనపు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని తెలిపారు తప్పితే, ఎక్కడా ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లుగా మాత్రం చెప్పలేదు. ఈ క్రమంలో జనవరి 23న నామినేషన్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..