OSCAR 2025: 97వ ఆస్కార్ వేడుకకు... ఇక నాలుగు రోజులే

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:33 PM

అమెరికాలోని లాస్ ఏంజెలిస్ (Los Angeles) కేంద్రంగా సాగే అకాడమీ అవార్డుల (Academy Awards) వేడుక తీరే వేరు. సినిమాలంటే అంతగా ఆసక్తి చూపించని వారు సైతం ఆస్కార్ అవార్డుల వేడుకను కళ్ళింతలు చేసుకొని చూస్తారంటే అతిశయోక్తి కాదు.

సినిమా అభిమానులను అలరిస్తూ ఆస్కార్ (Oscar 2025)అవార్డుల వేడుక సాగనుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు సంబంధించి ఎన్ని అవార్డులు ప్రకటిస్తున్నా, అమెరికాలోని లాస్ ఏంజెలిస్ (Los Angeles) కేంద్రంగా సాగే అకాడమీ అవార్డుల (Academy Awards) వేడుక తీరే వేరు. సినిమాలంటే అంతగా ఆసక్తి చూపించని వారు సైతం ఆస్కార్ అవార్డుల వేడుకను కళ్ళింతలు చేసుకొని చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆకర్షించే 97వ  ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయ కాలమానం ప్రకారం ఈ  సంవత్సరం మార్చి 3వ తేదీ ఉదయం 5 గంటల నుండి  జరగనుంది. వాస్తవానికి అమెరికాలో మార్చి 2వ తేదీ ఆదివారం సాయంకాలం నుండే సందడి సాగనుంది. ఆ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల దాకా ఈ వేడుక జరుగుతుంది. లాస్ ఏంజెలిస్ లోని డాల్బీ థియేటర్ వేదికగా 97వ ఆస్కార్ అవార్డుల వేడుక సాగనుంది. (Academy Awards)

97వ ఆస్కార్ అవార్డుల వేడుక 'హులు' (Hulu)లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. దీంతో పాటు 'హులు లైవ్ టీవీ, యూట్యూబ్ (Youtube), ఏటి అండ్ టి టీవీ, ఫ్యూబో టీవీ' లోనూ ఈ వేడుకను వీక్షించవచ్చు.  ఏబీసీ డాట్ కామ్ (ABC.com)లోనూ, ఏబీసీ యాప్ ద్వారా కూడా ఆస్కార్ వేడుకను చూసే వీలుంది. అమెరికా టెలివిజన్ హోస్ట్, కమెడియన్  కనాన్ ఓ బ్రియెన్ (Conan O'Brien) ఈ వేడుకను నిర్వహించనున్నారు. కనాన్ ఓ బ్రియెన్ ఆస్కార్ వేడుకలో హోస్ట్ గా వ్యవహరించడం ఇదే మొదటిసారి.




ఈ యేడాది జనవరిలో లాస్ ఏంజెలిస్ లోని అడవుల్లో దావానలం చెలరేగి పట్టణాలకు నగరాలకు కూడా దాని సెగ తగిలింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల వేడుకను వాయిదా వేస్తారని భావించారు. అయితే అకాడమీ అవార్డుల నిర్వాహకులు నామినేషన్స్ ను ప్రకటించడంలో వాయిదాలు వేసినా, వేడుకను మాత్రం ముందుగా అనుకున్న మార్చి 2వ తేదీనే నిర్వహించడానికి కంకణం కట్టుకున్నారు. అందువల్ల 'వైల్డ్ ఫైర్స్' ప్రభావం ఆస్కార్స్ పై లేనట్టే అని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం 23 విభాగాల్లో అవార్డుల ప్రదానం జరగనుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు - అన్నవే ఆస్కార్ అవార్డుల్లో అత్యున్నతంగా నిలిచేవి. వీటితో పాటు ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు కూడా ఉంటాయి.

ఇక రచనకు సంబంధించిన అవార్డుల్లో  ఉత్తమ స్క్రీన్ ప్లే లో ఒరిజినల్, అడాప్టెడ్ అని రెండు విభాగాలు ఉంటాయి. వీటి తరువాత అత్యంత ఆసక్తి కలిగించే అవార్డు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్ అన్నదే. గతంలో ఈ అవార్డును బెస్ట్ ఫారెన్ మూవీ అని పేర్కొనేవారు. కొంతకాలంగా ఆ పేరు స్థానంలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అన్నది నిలచింది. బెస్ట్ యానిమేటెడ్ మూవీ, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిమ్,  బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్ అన్న అవార్డులు కూడా ఉన్నాయి. బెస్ట్ మ్యూజిక్ లో ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ అని రెండు విభాగాలు ఉన్నాయి. తరువాత బెస్ట్ సౌండ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఫిలిమ్ ఎడిటింగ్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అన్న విభాగాలు సైతం సినీఫ్యాన్స్ కు ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి. మరి మార్చి 2వ తేదీ జరిగే 97వ ఆస్కార్ వేడుకల్లో ఈ 23 విభాగాల్లో ఎవరు విజేతలుగా ఆనందం సొంతం చేసుకుంటారో చూడాలి.

Updated Date - Mar 04 , 2025 | 12:22 PM