Wife Off Movie Review: బావని చిన్నప్పుడే భర్తగా ఊహించుకున్న మరదలు వేశ్యగా ఎందుకు మారింది?

ABN , Publish Date - Jan 26 , 2025 | 06:08 PM

వేశ్య పాత్రలో హీరోయిన్లు నటించడం చాలా అరుదుగా ఉంటుంది. అలాగే హీరోయిన్లతో అలాంటి పాత్రలు చేయించాలంటే.. దమ్మున్న పాత్రలని దర్శకుడు క్రియేట్ చేయాలి. ఇప్పుడలాంటి పాత్రతో ‘వైఫ్ ఆఫ్’ పేరుతో ఓ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆ సినిమా ఎలా ఉందంటే..

Wife Off Movie Review

మూవీ రివ్యూ: ‘వైఫ్ ఆఫ్’

నటీనటులు: నిఖిల్ గాజుల, దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ, సాయి శ్వేత తదితరులు

దర్శకత్వం: భాను ఎరుబండి

స్ట్రీమింగ్: ETV Win

థియేటర్లలోకి సినిమాలు వస్తున్నాయి.. పోతున్నాయి. ఎక్కడో ఒకటి హిట్ అవుతుంది తప్పితే.. మిగతావన్నీ ప్రేక్షకులను మెప్పించలేక, థియేటర్లకి రప్పించలేక చతికిలపడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. కానీ ఓటీటీలు వచ్చిన తర్వాత చతికిలపడిన సినిమాలే కాదు, విడుదలకు నోచుకోలేని సినిమాలు కూడా ఏదో రకంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.. ఆదరణను రాబట్టుకుంటున్నాయి. అలా థియేటర్లలో విడుదలకు నోచుకోలేక మూలన పడిన ఓ సినిమా ఈ వారం ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఆ సినిమానే ‘వైఫ్ ఆఫ్’. ఈ సినిమా ఎలా ఉందంటే.. (Wife Off Movie Review)


కథ:

రివేంజ్ డ్రామాగా ఈ సినిమాను దర్శకుడు మలిచాడు. దర్శకుడు కావాలని ప్రయత్నాలు చేస్తున్న అభి (అభినవ్ మణికంఠ)కి, అదే టైమ్‌లో నటనపై ఆసక్తి ఉన్న అవని (దివ్య శ్రీ) తారసపడుతుంది. తన కెరీర్‌కి ఉపయోగపడే ఓ షార్ట్ ఫిల్మ్ కోసం అభికి అవని సహకరిస్తుంది. అదే క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ మొదలై.. వ్యక్తపరుచుకునే సమయానికి అవని వెడ్డింగ్ కార్డుతో షాకిస్తుంది. తన బావతో పెళ్లి ఫిక్సయినట్లుగా చెప్పి అభికి దూరమైన అవనికి మామయ్య కొడుకు రామ్ (నిఖిల్ గాజుల)తో పెళ్లవుతుంది. పెళ్లి అనంతరం మొదటి రాత్రే.. తన బావకి మరో అమ్మాయి ప్రీతి (సాయి శ్వేతా)తో ఎఫైర్ ఉన్నట్లుగా తెలుస్తుంది? అప్పుడు అవని ఏం చేసింది? బావని అవని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ప్రేమించిన అభి ఏమయ్యాడు? వీరందరిని వదిలి అర్ధరాత్రి రోడ్డుపై అవని గంజాయి సేవిస్తూ.. వేశ్యగా ఎందుకు మారింది? అదే సమయంలో మూడు హత్యలకు ఆమె ఎలా కారణమైంది? తెలుసుకోవాలంటే ఈటీవీ విన్‌లోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

ఈ సినిమాలో పాత్రలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిలో అవనిగా చేసిన దివ్య శ్రీ పాత్రే ప్రధానంగా సినిమా నడుస్తుంది. ఆమె పాత్రను దర్శకుడు వైవిధ్యంగా మలిచాడు. ప్రధాన పాత్ర అయినప్పుడు భారం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సీన్లలో మెప్పించిన దివ్య శ్రీ నటన, కొన్ని సీన్లలో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా వేశ్య పాత్రలో ఆమె అంతగా అతకలేదు. ఆమె క్యారీ చేసిన ఎమోషన్ కూడా అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. అవనిని ఇష్టపడే ప్రేమికుడు అభి పాత్రలో అభినవ్ నటన క్యూట్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్ట్‌లోనూ అభి కొత్తగా ఏం చేయలేదు కానీ.. తన పాత్రకి న్యాయం చేశాడు. ఇక రామ్‌గా నిఖిల్ గాజులకు నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించి మెప్పించాడు. ముందు తిట్టుకున్నవారే.. ఆ తర్వాత ఆయన పాత్ర చూసి జాలి పడతారు. అలా చేసే క్రమంలో నిఖిల్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సాయి శ్వేతా పాత్రని కూడా దర్శకుడు వైవిధ్యంగా మలిచాడు. ఆమె పాత్రకు స్పేస్ తక్కువగా ఉన్నా.. పాత్రకి సరిపడా సపోర్ట్ సాయి శ్వేతా ఇచ్చింది. సాంకేతికంగా ఈ సినిమా ఓ.. అన్నంతగా లేదులే కానీ.. ఏం కావాలో అవి అయితే సమకూర్చారు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ ‘నువ్వు బావ అని తెలిసినప్పుడే భర్తగా ఊహించుకున్నాను’, ‘ప్రేమంటే మనం ప్రేమించిన మనిషి సంతోషంగా ఉండాలని కోరుకోవడం, అంతేకానీ ఆ సంతోషాన్ని దూరం చేసి దగ్గరవ్వాలనుకోవడం కాదు’ వంటివి బాగున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఓకే అంటే ఓకే. ఈ సినిమాకు ప్లస్ అంటే మాత్రం కచ్చితంగా ఎడిటింగ్ అనే చెప్పుకోవాలి. కేవలం 80 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాను టైమ్ పెట్టుకుని మరీ చూడాల్సిన అవసరం లేదు.. టైమ్ ఉన్నప్పుడు మాత్రం అలా ఓ లుక్ వేయవచ్చు.

Also Read- Anil Ravipudi: ఇండస్ట్రీలోకి రాకముందే అనిల్ ప్రేమకి సహాయం చేసిన నటులు


దర్శకుడు భాను.. ఈ సినిమాకు ఏదైనా రియల్ స్టోరీ స్ఫూర్తిగా తీసుకున్నాడేమో తెలియదు కానీ.. నిజ జీవితంలో జరుగుతున్న కథతోనే ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. రేసీ స్క్రీన్‌ప్లే‌తో తక్కువ నిడివితో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేసినా.. కొన్ని సీన్లు సాగదీసినట్లుగా, రిపీటెడ్‌గా అనిపిస్తాయి. సినిమాలో ట్విస్ట్‌లు ఉన్నాయి కానీ.. ఆ ట్విస్ట్‌లు ఎంగేజ్ చేయడంలో అంత సక్సెస్ కాలేదు. మూడు అధ్యాయాలుగా కథని చూపించిన తీరు బాగుంది. కాస్త పేరున్న ఆర్టిస్ట్‌లు, ఇంకాస్త గ్రిప్పింగ్‌గా స్టోరీనీ రెడీ చేసుకుని ఉంటే మాత్రం ‘వైఫ్ ఆఫ్’ సినిమా మంచి ఎంగేజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిలిచి ఉండేది. ప్రేమ, ప్రతీకారం వంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌గా నిలిచాయి. ఈ సినిమా విషయంలో మాత్రం ట్విస్ట్‌ల పై పెట్టిన శ్రద్ద, ఇతర కంటెంట్‌పై పెట్టలేదనిపిస్తుంది. పోనీ ఆ ట్విస్ట్‌లైనా గ్రిప్పింగ్‌గా ఉన్నాయా? అంటే అదీ లేదు. చాలా సాదాసీదాగా నడిచిందీ ‘వైఫ్ ఆఫ్’.

ఫైనల్‌గా.. ఖాళీగా ఉండి, ఏం తోచకపోతే.. ఫాస్ట్ ఫార్వర్డ్ ఫేజ్‌లో ఈ సినిమాను చూడొచ్చు. లేదంటే లైట్.


Also Read- Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..

Also Read- Mass Jathara Teaser: జాతర కాదు.. ర్యాంపేజ్.. ‘మనదే ఇదంతా’!

Also Read- Padma Bhushan Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్

Also Read- SSMB29 Memes: మహేశ్‌పై మీమ్స్‌.. ప్రియాంక ఫిక్స్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 06:08 PM