Madha Gaja Raja Review: 12 ఏళ్ల తర్వాత విడుదలైన విశాల్‌ ‘మదగజరాజ’ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jan 31 , 2025 | 08:26 AM

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ తమిళ హీరో విశాల్‌ (Vishal). యాక్షన్‌తోపాటు వినోదాన్ని జోడించి సుందర్‌.సి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'మదగజరాజ’. (Madha Gaja Raja) 2012లో ప్రారంభమైన ఈ చిత్రం పలు కారణాల చేత విడుదలకు నోచుకోలేదు.

Madha Gaja Raja Movie Still

సినిమా రివ్యూ: 'మద గజ రాజ' (Madha Gaja Raja Review)
విడుదల తేది: 31–01–2025
నటీనటులు: విశాల్‌, అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంతానం, సోనూసూద్‌, అజయ్‌ రత్నం, మణివణ్ణన్‌; శరత్‌ సక్సేనా, ఆర్య, సదా, మనోబాల తదితరులు
కెమెరా: రిచర్డ్‌ ఎం నాథన్‌
సంగీతం: విజయ్‌ ఆంటోని
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కేఎల్‌, ఎన్బీ శ్రీకాంత్‌
రచన: సుందర్‌ సి, వెంకట్‌ రాఘవన్‌
నిర్మాణం: జెమిని ఫిల్మ్‌ సర్క్యూట్‌, బెంజ్‌ మీడియా
దర్శకత్వం: సుందర్‌ సి. (Sundar C)

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ తమిళ హీరో విశాల్‌ (Vishal). యాక్షన్‌తోపాటు వినోదాన్ని జోడించి సుందర్‌.సి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'మదగజరాజ’. (Madha Gaja Raja) 2012లో ప్రారంభమైన ఈ చిత్రం పలు కారణాల చేత విడుదలకు నోచుకోలేదు. దాదాపు పుష్కర కాలం తర్వాత తమిళంలో సంక్రాంతి బరిలో విడుదలైంది. హీరో విశాల్‌ అనారోగ్యంతోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎప్పుడు హుషారుగా ఉండే ఆయన ఈ సినిమా ప్రచార వేడుకల్లో చేతులు వణుకుతూ.. మాట తడబడుతూ.. నిలబడటానికీ కూడా కష్టంగా ఉండటం హాట్‌ టాపిక్‌గా మారింది. విశాల్‌కి ఏమైందీ అంటూ చర్చ మొదలైంది. అలాంటి పరిస్థితుల్లో విడుదలైన ఈ చిత్రం తమిళంలో బంపర్‌ విజయం అందుకొంది. రెండు వారాలు ఆలస్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మదగజరాజ కథేంటి? ఎలా ఉంది అన్నది చూద్దాం. (Madha Gaja Raja Review)


MGR.jpg

కథ: (Madha Gaja Raja Review)
మదగజరాజా అలియాస్‌ ఎంజీఆర్‌ (విశాల్‌) అరకు ప్రాంతంలో ఓ కేబుల్‌ ఆపరేటర్‌. తండ్రి అక్కడి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తుంటాడు. పలు సందర్భాల్లో తండ్రి చేయాల్సిన పనులను తానే చేస్తుంటాడు. ఆ క్రమంలోనే మాధవి (అంజలి)ని చూసి మనసు పడతాడు. చిన్న కారణంతో వీరిద్దరూ దూరం అవుతారు. తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్ననాటి స్కూల్‌ మాస్టర్‌ (శరత్‌ సక్సేనా) నుంచి ఫోన్‌ వస్తుంది. దాంతో రాజా అతని బాల్య స్నేహితులంతా పెళ్లిలో కలుసుకుంటారు. సంతోషంగా కూతురి పెళ్లి చేయాల్సిన మాస్టర్‌కు ఓ సమస్య ఎదురవుతుంది. రాజా, అతని స్నేహితులంతా ఆ సమస్యను పరిష్కరిస్తారు. పెళ్లి తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్తున్న సమయంలో రాజా స్నేహితులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని రాజా వాళ్ల కోసం నిలబడతాడు. తన స్నేహితుల కష్టాలకు కారణం బడా వ్యాపారవేత్త అయిన కాకర్ల విశ్వనాథ్‌ (సోనూసూద్‌) అని తెలుసుకుని హైదరాబాద్‌ చేరుకుని అతనికి రాజా ఎలా బుద్ధి చెప్పాడు. ఇందులో మాయ (వరలక్ష్మి శరత్‌ కుమార్‌) పాత్ర ఏంటి? అన్నది కథ.


విశ్లేషణ..
ఒకరికి సహాయం చేయడంలో ఆనందాన్ని వెతుక్కునే ఓ యువకుడు తనకు చదువు చెప్పిన గురువు, తన ముగ్గురు   స్నేహితులను కష్టాల నుంచి గట్టెక్కించడమే ఈ కథ.  ఇదేమీ కొత్త కథ కాదు. ఎన్నో సినిమాల్లో చూసిందే. పైగా ఇది 12 ఏళ్ల క్రితం మొదలైన సినిమా. అప్పటికీ కూడా ఇదేమీ కొత్త కథ కాదు. మాస్‌ మాసాల చిత్రాలకు కేరాఫ్‌ అయిన దర్శకుడు సుందర్‌ సి కథ, కథనాలు రొటీన్‌ అనే విషయాన్ని గమనించలేదు కాబోలు. కొన్ని సన్నివేశాలను తెరకెక్కించడంతో ఎక్కడా లాజిక్‌ గురించి పట్టించుకోలేదు. సీన్లు మాత్రం ఒకదాని వెనుక ఒకటి వేగంగా పరిగెడుతుంటాయి. కామెడీ మాత్రం బాగానే రాసుకున్నారు. ఈ సినిమాకు ఆ కామెడీనే కాస్త ప్లస్‌ అయింది. యాక్షన్‌ హీరోగా విశాల్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అలా యాక్షన్‌ ప్రియులను ఈ సినిమా అలరిస్తుంది. విశాల్‌ సిక్స్‌ప్యాక్‌ బాడీ ఆకట్టుకుంది. అయినా ఇన్నేళ్ల తర్వాత విడుదల చేసే ధైర్యం చేశారు మేకర్స్‌. సినిమా ప్రారంభం నుంచే హీరోకి స్నేహితుడిగా సంతానం పాత్ర అలరించింది. తనదైన శైలి డైలాగ్‌లు, సెకెండాఫ్‌లో మినిస్టర్‌ సత్తిబాబు(మనోబాల) చుట్టూ అల్లిన సన్నివేశాలు  ప్రేక్షకుల్ని నవ్వులు పూయిస్తాయి. సంతానం నోట పలికిన కొన్ని డైలాగ్‌లు డబల్‌ మీనింగ్‌ అనిపించినా అవన్నీ కూడా నవ్వుల్లో కొట్టుకుపోతాయి. కోర్టులో సంతానం కేసు, పంచ్‌ డైలాగ్‌లు బాగా వర్కవుట్‌ అయ్యాయి. సంతానం అత్త క్యారెక్టర్‌, అంజలి తండ్రి పాత్ర సినిమాకు కాస్త భారంగా అనిపిస్తాయి. ముఖ్యమంత్రిని సైతం తన చేతిలో పెట్టుకున్న ఓ ప్రైవేట్‌ వ్యక్తి ఇంటికి సీబీఐ అంటూ  సాధారణ ఆటో డ్రైవర్‌తో కలిసి వెళ్లడం, సవాల్‌ చేయడం రియలిస్టిక్‌గా ఉండవు. సత్తిబాబు డెడ్‌బాడీతో హీరో అతని గ్యాంగ్‌ చేసే హంగామా అంతా నవ్వుకోవడం కోసం ఇరికించి నట్లు అనిపిస్తాయి. హీరోయిన్లు ఇద్దరూ గ్లామర్‌ కోసమే అన్నట్లు ఉన్నారు. తెలుగు ఆర్టిస్ట్‌లు ఇందులో చాలామందే ఉన్నారు. కానీ ఎవరూ సొంతగా డబ్బింగ్‌ చెప్పలేదు. విశాల్‌ సహా అందరికీ డబ్బింగ్‌ వేరే ఆర్టిస్ట్‌లతో చెప్పించారు. అదొక మైనస్‌గా అనిపించింది. కొన్ని చోట్ల ఊరి పేర్లు తెలుగులోనే ఉన్నా.. చివరికి వచ్చేసరికి తమిళ పేర్లు కనిపిస్తాయి. డబ్బింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. (Madha Gaja Raja Review)


నటీనటులు విషయానికొస్తే.. ఈ తరహా పాత్ర విశాల్‌కు కొత్త కాదు. ఇలాంటి యాక్షన్‌ సినిమాలు చాలానే చేశాడు. దాంతో రాజా పాత్రను అలవోకగా చేసేశాడు. అతని తాలుక యాక్షన్‌ ఎక్కడా మిస్‌ కాలేదు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఈ జనరేషన్‌ అమ్మాయిలా ట్రెండీగా హాట్‌హాట్‌గా కనిపించింది. అంజలి తన అందంతో ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా ఆమె కూడా అందాల్ని ఆరబోసింది. అయితే హీరోయిన్లు ఇద్దరికీ సినిమాలో అంత ప్రాధాన్యం లేదు. విలన్‌గా సోనూసూద్‌ మెప్పించాడు. సంతానం మాత్రం తనదైన స్టైల్‌లో నవ్వులు పూయించాడు. అతని పాత్ర సినిమాకు ప్లస్‌ అయింది.  సినిమా ప్రారంభంలో బస్‌ ఛేజ్‌, ఫైట్‌ నిడివి ఎక్కువ తీసుకున్న భావన కలిగింది.. ఇక సెకెండాఫ్‌కి మనోబాల శవం ఎపిసోడ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ప్రీ క్లైమాక్స్‌లో ఆ పాత్ర చుట్టూనే కామెడీని తిప్పారు. సదా, ఆర్య అతిథి పాత్రల్లో మెరిసారు. సదాపై చిత్రీకరించిన చివరి పాట బీట్‌ ఆకట్టుకునేలా ఉంది. కెమెరా వర్క్‌ క్వాలిటీగా ఉంది. అంజలి తండ్రి, సంతానం అత్త పాత్రలో ఎడిటర్‌ కాస్త పని చేయాల్సింది.  విజయ్‌ ఆంటోనీ  నేపథ్య సంగీతం మాత్రం బావుంది. పాటలు సోసోగా అనిపిస్తాయి. దర్శకుడు సుందర్‌.సి కొత్తదనం, లాజిక్కులు పక్కన పెట్టి పూర్తిగా కామెడీ మీద ఆధారపడి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తీసిన సినిమా ఇది. 12ఏళ్ల గ్యాప్‌ తర్వాత విడుదలైనా తమిళంలో సంక్రాంతికి విడుదలై రూ 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ తెలుగు అనువాదం విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంపాక్ట్‌ బావుండేది. లాజిక్కుల జోలికి వెళ్లకుండా యాక్షన్‌ను ఇష్టపడేవారు, వినోదం కోరుకునేవారు రెండున్నర గంటల్లో ఎక్కువ సేపు నవ్వుకోవడానికి ఈ సినిమాను చూడొచ్చు.

ట్యాగ్‌లైన్‌: నవ్వుల మదగజరాజ

Updated Date - Jan 31 , 2025 | 01:26 PM