Chhavva Review: శంభాజీ జీవిత కథ 'ఛావా' ఎలా ఉందంటే

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:16 PM

'లుకా చుప్పీ'తో దర్శకునిగా మంచి మార్కులు సంపాదించుకున్న లక్ష్మణ్ ఉటేకర్ తన 'జర హట్కే జర బచ్కే' హీరో విక్కీ కౌశల్ తో తెరకెక్కించిన చిత్రం 'ఛావా'. రష్మిక మందన్న  నాయికగా నటించడం విశేషం! గత సంవత్సరం 'స్త్రీ-2' (Stree-2)తో బ్లాక్ బస్టర్ హిట్ పట్టేసిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా రివ్యూ: 'ఛావా'
విడుదల తేది: 14-2-2025
నటీనటులు: విక్కీ కౌశల్ (Vicky Kaushal)(శంభాజీ మహారాజ్), రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna)(మహారాణి యెసుబాయ్), అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) (ఔరంగజేబు), అశుతోష్ రాణా (Ashutosh Rana )(సర్వసేనాధిపతి హంబీరావ్ మొహతే), దివ్యదత్త (సొయరా బాయ్), వినీత్ కుమార్ సింగ్ (Vineet Kumar Singh ), డయానా పింటీ (Diana Penty) (జినత్ ఉన్ నిస్సా బేగమ్), ప్రదీప్ రావత్ (Pradeep Rawat), అలోక్ నాథ్ (Alok Nath) తదితరులు

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫి : సౌరభ్ గోస్వామి (Saurabh Goswami)
సంగీతం: ఎ.ఆర్.రహమాన్ (A. R. Rahman)

నిర్మాత: దినేశ్ విజన్ (Dinesh Vijan)  

దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)

పీరియడ్ మూవీస్ అంటే చాలు పాత చిత్రాలలో తమకు నచ్చిన కాస్ట్యూమ్ డ్రామాస్ ను ఎంపిక చేసుకొని, వాటి బాటలోనే పయనించాలని ప్రయత్నిస్తున్నారు మన దర్శకనిర్మాతలు. ఆ కోవకు చెందిన చిత్రమే 'వేలంటైన్స్ డే' కానుకగా విడుదలైన బాలీవుడ్ పీరియడ్ మూవీ 'ఛావా' (Chhaava). ఈ సినిమాను చూస్తే గతంలో మనం చూసిన పలు పీరియడ్ మూవీస్ గుర్తుకు రాకమానదు. మరాఠా యోధులకు అత్యంత పూజనీయుడు ఛత్రపతి శివాజీ. ఆయన తనయుడు ఛత్రపతి శంభాజీ గాథతో 'ఛావా' చిత్రం తెరకెక్కింది. 'ఛావా' అంటే సింహం బిడ్డ అని అర్థం! శివాజీ సింహం అని మరాఠాలు భావిస్తారు. అందువల్ల శంభాజీని 'ఛావా' అని పిలిచేవారట. 'లుకా చుప్పీ'తో దర్శకునిగా మంచి మార్కులు సంపాదించుకున్న లక్ష్మణ్ ఉటేకర్ తన 'జర హట్కే జర బచ్కే' హీరో విక్కీ కౌశల్ తో తెరకెక్కించిన చిత్రం 'ఛావా'. రష్మిక మందన్న  నాయికగా నటించడం విశేషం! గత సంవత్సరం 'స్త్రీ-2' (Stree-2)తో బ్లాక్ బస్టర్ హిట్ పట్టేసిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పబ్లిసిటీ లో 'స్త్రీ-2'  మేకర్స్ నుండి వస్తోన్న సినిమా అంటూ టముకు వేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వ్యాఖ్యానంతో 'ఛావా' కథ(Chhaava)సాగుతుంది.


Rashmika.jpg

కథ:

ఛత్రపతి శివాజీ అనంతరం ఆయన తనయుడు శంభాజీ అధికారం చేపట్టడం, ఆ తరువాత పలు యుద్ధాలు చేసి హిందూ సామ్రాజ్య విస్తరణకు పూనుకోవడం అన్నవి చరిత్ర చెబుతున్న అంశాలే. వాటినే ఆధారం చేసుకొని 'ఛావా' కూడా తెరకెక్కింది. మొఘల్ సామ్రాజ్యాధినేతలకు ఛత్రపతి శివాజీ వెన్నులో చలి పుట్టించాడని అందరికీ తెలుసు. అతని మరణానంతరం మరాఠా రాజ్యాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆశిస్తాడు. తనకున్న పరిధిలోనే శంభాజీ మొఘల్ సేనలను తరిమికొట్టడమే కాదు చుట్టూ కూడా మొఘల్ వ్యతిరేక రాజ్యాన్ని విస్తరిస్తూ పోతాడు. ఔరంగజేబు శంభాజీకి ఓ ప్రతిపాదన పంపుతాడు. ఇస్లామ్ స్వీకరించి, తన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తే యథేచ్ఛగా మరాఠా రాజ్యాన్ని శంభాజీ ఏలుకోవచ్చునన్నదే ఆ ప్రతిపాదన. అందుకు శంభాజీ ప్రతిగా ఔరంగజేబ్ కూతురును తనకిచ్చి పెళ్ళి చేస్తే అప్పుడు ప్రతిపాదనను అంగీకరిస్తానని సమాధానమిస్తాడు. దాంతో పోరాటం తప్పదు. చివరకు శంభాజీ పంతం ఏమైంది? ఔరంగజేబ్ ఏం చేశాడు? అన్న అంశాలతో కథ సాగుతుంది.

 
విశ్లేషణ:

శివాజీ తనయుడు శంభాజీ జీవితంపై విభిన్న కోణాల్లో కథ వినిపిస్తుంది. అయితే శివాజీ సావంత్ రాసిన 'ఛావా' ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కింది. దానికి కొన్ని మార్పులూ చేర్పులూ జరిగాయి. రిషి విర్మానీ, ఓంకార్ మహాజన్ తో కలసి దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ స్క్రీన్ ప్లే రూపొందించారు. కథ నడచిన పంథా చూస్తే ఆ మధ్య వచ్చిన పీరియడ్ మూవీ 'పద్మావత్', అంతకు ముందు వచ్చిన 'జోధా అక్బర్' వంటి సినిమాలు గుర్తుకు రాకమానవు. ఇక క్లయిమాక్స్ లో మొఘల్ రాజకుమారి నిస్సా బేగమ్ సన్నివేశాలు చూస్తే మెల్ గిబ్సన్ తెరకెక్కించిన 'ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్' పతాక సన్నివేశాలూ స్ఫురిస్తాయి. ఈ సినిమాకు ఎ.ఆర్.రహమాన్ బాణీలు ప్రాణం పోశాయనే చెప్పాలి. రిషీ విర్మానీ, ఇర్షాద్ కామిల్ కలసి రాసిన సంభాషణలు 'అనార్కలి, మొఘల్ ఏ ఆజమ్' సినిమా ఫక్కీని గుర్తు చేస్తాయి. నటీనటుల్లో విక్కీ కౌశల్ అందరికన్నా మంచి మార్కులు పోగేసుకుంటాడు. మిగిలినవారు కూడా తమకు లభించిన పాత్రలకు న్యాయం చేయడానికి తపించారు. మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ నటన ఆకట్టుకుంటుంది. రాణి పాత్రలో రశ్మిక తనదైన బాణీ పలికించింది. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించినా, అతిగా చేసిన ప్రోస్తెటిక్ మేకప్ కారణంగా అతడిని గుర్తించడానికే సమయం పడుతుంది. "ఆయారే తూఫాన్..." సాంగ్ ఆకట్టుకుంటుంది. కానీ, అందులో రెహమాన్ పాత బాణీలే వినిపించడం విశేషం! సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫి వార్ సీన్స్ ను ఎంతగానో హైలైట్ చేసింది. ఇక దినేష్ విజన్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఏదిఏమైనా ప్రస్తుతం దేశం మొత్తం మీద 'హిందూత్వ' గాలి వీస్తోంది. ఈ నేపథ్యంలో పలువురుని 'ఛావా' ఆకట్టుకొనే అవకాశం ఉందని చెప్పవచ్చు.

ట్యాగ్ లైన్ - 'ఛావా'... చేవ ఉంటే చూడు!

Updated Date - Feb 14 , 2025 | 05:18 PM