Chhaava Review: శంభాజీ మహారాజ్ కథ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Mar 07 , 2025 | 02:31 PM

హిందీలో ఫిబ్రవరి 14న విడుదలైన 'ఛావా' చిత్రం ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ సంస్థ శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ భారీ స్థాయిలో విడుదల చేసింది.

సినిమా రివ్యూ: 'ఛావా' (తెలుగులో)

విడుదల తేది: 07-3-2025

నటీనటులు: విక్కీ కౌశల్ (Vicky Kaushal)(శంభాజీ మహారాజ్), రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna)(మహారాణి యెసుబాయ్), అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) (ఔరంగజేబు), అశుతోష్ రాణా (Ashutosh Rana )(సర్వసేనాధిపతి హంబీరావ్ మొహతే), దివ్యదత్త (సొయరా బాయ్), వినీత్ కుమార్ సింగ్ (Vineet Kumar Singh ), డయానా పింటీ (Diana Penty) (జినత్ ఉన్ నిస్సా బేగమ్), ప్రదీప్ రావత్ (Pradeep Rawat), అలోక్ నాథ్ (Alok Nath) తదితరులు.

సాంకేతిక నిపుణులు: (Chhaava Review)

సినిమాటోగ్రఫి : సౌరభ్ గోస్వామి (Saurabh Goswami)

సంగీతం: ఎ.ఆర్.రహమాన్ (A. R. Rahman)

నిర్మాత: దినేశ్ విజన్ (Dinesh Vijan)

దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)

హిందీలో ఫిబ్రవరి 14న విడుదలైన 'ఛావా' చిత్రం ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ సంస్థ శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ భారీ స్థాయిలో విడుదల చేసింది.

కథ విషయానికి వస్తే.. (Chhaava Review)

మరాఠా యోధులకు అత్యంత పూజనీయుడు ఛత్రపతి శివాజీ. ఆయన తనయుడు ఛత్రపతి శంభాజీ గాథతో 'ఛావా' చిత్రం తెరకెక్కింది. 'ఛావా' అంటే సింహం బిడ్డ అని అర్థం! శివాజీ సింహం అని మరాఠాలు భావిస్తారు. అందువల్ల శంభాజీని 'ఛావా' అని సంభోదించేవారు. 'లుకా చుప్పీ'తో దర్శకునిగా మంచి మార్కులు సంపాదించుకున్న లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ తన 'జర హట్కే జర బచ్కే' హీరో విక్కీ కౌశల్ తో తెరకెక్కించిన చిత్రం 'ఛావా'. రష్మిక మందణ్ణ నాయికగా శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయిగా నటించింది! గత సంవత్సరం 'స్త్రీ-2' (Stree-2)తో బ్లాక్ బస్టర్ హిట్ పట్టేసిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పబ్లిసిటీ లో 'స్త్రీ-2' మేకర్స్ నుండి వస్తోన్న సినిమా అని పేర్కొన్నారు. అది సినిమా ఓపెనింగ్స్ కు బాగానే ఉపయోగపడింది.

ఛత్రపతి శివాజీ అనంతరం ఆయన తనయుడు శంభాజీ అధికారం చేపట్టడం, ఆ తరువాత పలు యుద్ధాలు చేసి హిందూ సామ్రాజ్య విస్తరణకు పూనుకోవడం అన్నవి చరిత్ర చెబుతున్న అంశాలే. వాటినే ఆధారం చేసుకొని 'ఛావా' కూడా తెరకెక్కింది. మొఘల్ సామ్రాజ్యాధినేతలకు ఛత్రపతి శివాజీ వెన్నులో చలి పుట్టించాడని అందరికీ తెలుసు. అతని మరణానంతరం మరాఠా రాజ్యాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆశిస్తాడు. అయితే తండ్రి శివాజీ నుండి శౌర్యాన్ని పుణికి పుచ్చుకున్న శంభాజీ మొఘల్ సామ్రాజ్యానికి కీలకమైన బర్హన్ పూర్ పై దాడి చేసి... ఔరంగజేబు ఖజానాను కొల్లగొడతాడు. కంటిలో నలుసుగా మారిన శంభాజీని హతమార్చి కానీ కిరీటాన్ని ధరించనని ఔరంగజేబు ప్రతినబూని, ఢిల్లీ నుండి దక్కన్ కు సైన్యంతో బయలుదేరతాడు. ఇదిలా ఉంటే... ఔరంగజేబు కుమారుడు అక్బర్ తండ్రితో గొడవ పడి శంభాజీతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తాడు. కానీ శంభాజీ అందుకు నిరాకరిస్తాడు. అయితే ఔరంగజేబు నుండి అక్బర్ కు ప్రాణహాని కలగకుండా చూస్తానని హామీ ఇస్తాడు. ఔరంజేబు దండయాత్రను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? సొంత మనుషులు చేసిన కుట్రకు ఎలా బలి అయ్యాడు? మతం మారితే క్షమిస్తానని చెప్పినా ఔరంగజేబుకు శంభాజీ ఏం బదులిచ్చాడు? అనేది మిగతా కథ.


విశ్లేషణ: (Chhaava Cinema Review)

శివాజీ తనయుడు శంభాజీ (Sambaji Maharaj) జీవితంపై విభిన్న కోణాల్లో కథ వినిపిస్తుంది. అయితే శివాజీ సావంత్ రాసిన 'ఛావా' ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కింది. దానికి కొన్ని మార్పులూ చేర్పులూ జరిగాయి. రిషి విర్మానీ, ఓంకార్ మహాజన్ తో కలసి దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ స్క్రీన్ ప్లే రూపొందించారు. కథ నడచిన పంథా చూస్తే ఆ మధ్య వచ్చిన పీరియడ్ మూవీ 'పద్మావత్', అంతకు ముందు వచ్చిన 'జోధా అక్బర్' వంటి సినిమాలు గుర్తుకు రాకమానవు. ఇక క్లయిమాక్స్ లో మొఘల్ రాజకుమారి నిస్సా బేగమ్ సన్నివేశాలు చూస్తే మెల్ గిబ్సన్ తెరకెక్కించిన 'ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్' పతాక సన్నివేశాలూ స్ఫురిస్తాయి. ఈ సినిమాకు ఎ.ఆర్.రహమాన్ బాణీలు, నేపథ్య సంగీతం ప్రాణం పోశాయి. రిషీ విర్మానీ, ఇర్షాద్ కామిల్ కలసి రాసిన సంభాషణలు 'అనార్కలి, మొఘల్ ఏ ఆజమ్' సినిమా ఫక్కీని గుర్తు చేస్తాయి.

నటీనటుల్లో విక్కీ కౌశల్ అందరికన్నా మంచి మార్కులు పోగేసుకుంటాడు. శంభాజీ గుణగణాలను ఔపోసన పట్టాడా అనిపించేవిధంగా నటించాడు. మహరాణి పాత్రలో రశ్మిక తనదైన బాణీ పలికించింది. మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ నటన ఆకట్టుకుంటుంది. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా అత్యద్భుత నటన కనబరిచాడు. ముందుగా మేకర్స్ ఆ పాత్ర చేసింది అక్షయ్ ఖన్నా చెప్పి ఉండకపోతే... ప్రోస్తెటిక్ మేకప్ కారణంగా అతడిని గుర్తించడం కష్టమయ్యేది. దివ్యా దత్తా, ప్రదీప్ రావత్, అశుతోష్‌ రాణా, వినీత్ కుమార్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫి వార్ సీన్స్ ను ఎంతగానో హైలైట్ చేసింది. ఇక దినేష్ విజన్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. తెలుగులోనూ సంభాషణలు సరళంగా, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉన్నాయి. ఇవాళ దేశ వ్యాప్తంగా 'హిందుత్వ' పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలు విజయాన్ని అందుకోవడం సహజం. 'ఛావా' విషయంలోనూ అదే జరిగింది.

Tagline: చేవ చూపిస్తున్న'ఛావా'

Updated Date - Mar 07 , 2025 | 04:48 PM