Thudarum Movie: తుడరుమ్ మూవీ రివ్యూ

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:18 PM

మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'తుడరుమ్'. శుక్రవారం మలయాళంలో విడుదలైన ఈ చిత్రం శనివారం తెలుగులో వచ్చింది.

సీనియర్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. వయసు మీద పడుతున్నా, ఆయనతో యాక్షన్ మూవీస్ చేయించడానికి యంగ్ డైరెక్టర్స్ కూడా వెనుకాడరు. అయితే లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో హీరోలు యాక్షన్ సీన్స్ లో అంతగా శ్రమపడకుండానే తెర మీద రక్తపాతాన్ని సృష్టించేస్తున్నారు. దానికి ఆ మధ్య వచ్చిన 'ఎంపురాన్' (Empuraan) ఓ ఎగ్జాంపుల్. కానీ మోహన్ లాల్ తాజా చిత్రం 'తుడరుమ్' (Thudarum) అందుకు పూర్తిగా భిన్నమైంది. ఈ సినిమాలో మోహన్ లాల్ చేసిన యాక్షన్ సీన్స్ చూస్తే... ఓ పాతికేళ్ళ క్రితం నాటి ఆయన సినిమాలు గుర్తొస్తాయి. మలయాళంలో శుక్రవారం విడుదలైన 'తుడరుమ్' మూవీ... ఒకరోజు ఆలస్యంగా శనివారం తెలుగులో వచ్చింది. 'తుడరుమ్' పేరుతోనే దీన్ని డబ్ చేశారు. అన్నట్టు... ఈ పేరుకు అర్థం 'సశేషం' అని!


కథ విషయానికి వస్తే...

టాక్సీ డ్రైవర్ షణ్ముఖం (మోహన్ లాల్)ను అందరూ బెంజ్ అని ప్రేమగా పిలుస్తుంటారు. భార్య లలిత (శోభన Sobhana), కొడుకు, కూతురులతో హ్యాపీగా జీవితాన్ని గడుపు తుంటాడు బెంజ్. అతనికి తన పాత అంబాసిడర్ కారంటే ప్రాణం. గతంలో చెన్నయ్ లో పళనిస్వామి (భారతీరాజా Bharathi Raja) అనే స్టంట్ కొరియోగ్రాఫర్ దగ్గర పనిచేసిన బెంజ్... ఓ చేదు సంఘటనతో ఆ వృత్తిని వదిలేసి, సొంతవూరు వచ్చి టాక్సీ డ్రైవర్ గా స్థిరపడతాడు. బెంజ్ ఊరులో లేని సమయంలో అతని టాక్సీని వేరే వ్యక్తి తీసుకెళ్ళి అందులో గంజాయిని క్యారీ చేస్తుంటే పోలీసులు బండిని సీజ్ చేస్తారు. దాన్ని విడిపించడానికి బెంజ్ నానా తిప్పలూ పడతాడు. పోలీసు అధికారులు టాక్సీ ఇవ్వడానికి నరకం చూపిస్తారు. చివరికి పోలీసుల నుండి టాక్సీని తీసుకుని ఇంటికి వచ్చేసరికీ ఇంజనీరింగ్ చదువుకుంటున్న, బెంజ్ కొడుకు కనిపించకుండా పోతాడు. కొడుకు విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన బెంజ్... ఆ తర్వాత అతని కదలికలకు సంబంధించిన ఆరా తీసినప్పుడు ఊహించని విషయాలను బయటపడతాయి. ఆ పాత అంబాసిడర్ కారుకు బెంజ్ కు ఉన్న అనుబంధం ఏమిటీ? పోలీసులు బెంజ్ ను ఎందుకు టార్గెట్ చేశారు? అసలు బెంజ్ కొడుకు ఏమైపోయాడు? అన్నదే… మిగతా కథ.

ఎలా ఉందంటే...

ఈ మధ్య మలయాళంలో వస్తున్న కొన్ని సినిమాలలో అక్కడ జరిగిన ప్రకృతి వైపరీత్యాలను కథానుగుణంగా వాడుకోవడం బాగా జరుగుతోంది. 'తుడరుమ్'లోనూ 2024లో వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన దుర్ఘటనను వాడుకున్నారు. దానితోనే సినిమా మొదలవుతుంది. అక్కడి నుండి అసలు కథలోకి వెళ్ళాడు దర్శకుడు తరుణ మూర్తి (Taruna Murthy). ప్రథమార్ధంలో బెంజ్ ఫ్యామిలీ, వారి మధ్య ఉండే అనుబంధాన్ని చూపడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. ఇక బెంజ్ గతాన్ని గురించి అక్కడక్కడా చెప్పినా అదేమీ మనసుకు పట్టేది కాదు. దాంతో ఇంటర్వెల్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్రర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ తో ఆడియెన్స్ ను కాస్త అలర్ట్ అవుతారు. బెంజ్ కుటుంబంలో ఏం జరిగిందనేది ఊహకందేదే అయినా... ఆ కష్టం నుండి వారు ఎలా బయటపడతారనే సందిగ్థం ప్రేక్షకులను కొంతలో కొంత ఎంగేజ్ చేస్తుంది. బెంజ్ గత జీవితాన్ని పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకునే విధంగా ఇంట్రస్టింగ్ గా ఉంది. అయితే దాన్ని హడావుడిగా చెప్పేశారు. పోలీసు హింసను గ్లోరిఫై చేయాలని డైరెక్టర్ అనుకోవడం వల్ల సినిమా నిడివి అనవసరంగా పెరిగిపోయింది.

నిజానికి ఇది పరువు హత్యకు సంబంధించిన కథ. దానిని డైరెక్ట్ గా చెప్పుకుండా... ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని ఆసక్తికరమైన అంశాలను అల్లుకుంటూ వెళ్ళారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు 'దృశ్యం' సినిమా మదిలో మెదులుతుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా అది తెరకెక్కగా... దీన్ని యాక్షన్ డ్రామాగా మలిచారు. దాంతో అవసరానికి మించిన యాక్షన్ చోటు చేసుకుంది. అయితే... ఈ వయసులో మోహన్ లాల్ తో ఆ స్థాయిలో యాక్షన్ సీన్స్ చేయించడం ఆయన ఫ్యాన్స్ కు పండగే. మోహన్ లాల్ ఎమోషన్స్ ను అద్భుతంగా పండించడంతో పాటు యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. చాలా యేళ్ళ తర్వాత శోభన... మోహన్ లాల్ సరసన నటించింది. కానీ ఆమె పాత్రకు ఏమంత ప్రాధాన్యం లేదు. ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఆడియెన్స్ కు తెలిసిపోతుంది. కానీ హీరోకు, విలన్ కు మధ్య కాన్ ఫ్లిక్ట్ ను చివరి నిమిషంలో కానీ రివీల్ చేయలేదు. దీనికి తోడు సినిమా నిడివి ఎక్కువ కావడంతో ప్రేక్షకులు సహనం కోల్పోతారు.

నటీనటులు... సాంకేతిక నిపుణులు

ఇందులో మోహన్ లాల్ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పాత్రలను ప్రకాశ్ వర్మ, బిను పప్పు చేశారు. అలానే పహద్ ఫాజిల్ బ్రదర్ ఫర్హాన్ ఫాజిల్, మణియన్ పిళ్ళై రాజు, అర్షా బైజు, ఇర్షాద్ అలీ, థామస్ మాథ్యూ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. భారతీరాజా గెస్ట్ రోల్ లో మెరిశారు. తెలుగువారికి నోన్ ఫేసెస్ అంటే మోహన్ లాల్, శోభననే! ఆర్టిస్టుల నటనకు వంక పెట్టడానికి లేదు. అలానే సాంకేతిక నిపుణుల పనితనం బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

సినిమా కథ ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం, కోట బొమ్మాళి తదితర ప్రదేశాలలో జరిగినట్టుగా చూపించి, తెలుగు నేటివిటీని డైలాగ్స్ ద్వారా అద్దే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా సినిమా పేరునూ తెలుగులో పెట్టేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇవాళ మలయాళంలో కొత్త నటీనటులతోనూ థ్రిల్లర్ జానర్ మూవీస్ చాలానే తీస్తున్నారు. ఇదీ అదే కోవకు చెందినదే. కాకపోతే... వాటిల్లో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో కొరవడింది. మోహన్ లాల్ హీరోగా నటించడమనేదే 'తుడరుమ్' వరకూ మెయిన్ హైలైట్. సో... ఆయన అభిమానులకు ఈ సినిమా నచ్చే ఆస్కారం ఉంది.

ట్యాగ్ లైన్: మోహన్ లాల్ యాక్షన్ షో!

రేటింగ్ 2.5/ 5

Updated Date - Apr 26 , 2025 | 04:21 PM