Odela -2 Movie : ఓదెల 2 మూవీ రివ్యూ

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:42 PM

తమన్నా కీలక పాత్ర పోషించిన 'ఓదెల -2' చిత్రం ఏప్రిల్ 17న జనం ముందుకు వచ్చింది. సంపత్ నంది నేతృత్వంలో అశోక్ తేజ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

దేవుడు, దెయ్యం కాన్సెప్ట్ తో గతంలో పలు చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సక్సెస్ అయితే మరి కొన్ని పరాజయం పొందాయి. కరోనా సమయంలో ఓటీటీలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ (Odela Railway Station) సక్సెస్ కావటంతో దానికి సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela -2) తెరకెక్కించారు. పార్ట్ వన్ లోని కథకు భిన్నంగా ఈ సీక్వెల్ లో ఆత్మను ప్రవేశ పెట్టి, దానిని పరమాత్మతో అంతం చేయించే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 17న ఆడియన్స్ ముందుకు వచ్చింది. తమన్నా (Tamannaah) లీడ్ రోల్ పోషించిన 'ఓదెల -2' ని అశోక్ తేజ (Ashok Teja) డైరెక్ట్ చేశారు. సంపత్ నంది (Sampath Nandi) కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. మరి దీనికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం…


కథ విషయానికి వస్తే…

2022 ఆగస్ట్ 26న ఆహాలో స్ట్రీమింగ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వేస్టేషన్' మంచి ఆదరణ లభించింది. అందులో ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే ఈ ‘ఓదెల 2’ ఆరంభం అవుతుంది. దాంట్లో ఎలాగైతే హెబ్బా పటేల్ (Hebah Patel)... వశిష్ట (Vasishta) తలతో పోలీస్ స్టేషన్ లో అడుగు పెడుతుందో ఇందులోనూ అలాగే ఆరంభంలో ఓ పాప హెబ్బా తలతో ఎంట్రీ ఇవ్వటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అక్కడ నుంచే కథను రివీల్ చేస్తారు. ఓదెల గ్రామంలో ఎంతోమంది అమ్మాయిల మాన, ప్రాణాలు తీసిన తిరుపతి ఆత్మకి శాంతి కలగకూడదని ఊరివారంతా తీర్మానించి 'సమాధి శిక్ష' అంటూ శవ సమాధి చేస్తారు. అలా సమాధి శిక్ష అనుభవిస్తున్న తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి మళ్ళీ శోభనం జరుపుకునే అమ్మాయిల్ని చంపేస్తుంటుంది. ఈ సమస్య నుంచి తమని కాపాడేది జైలు శిక్ష అనుభవిస్తున్న రాధ (హెబ్బా పటేల్) సోదరి భైరవి (తమన్నా) అని తెలుసుకుని తనని గ్రామానికి తీసుకువస్తారు. ఆ తర్వాత భైరవి, తిరుపతి ప్రేతాత్మ మధ్య జరిగే యుద్ధమే ఈ ‘ఓదెల 2’.

విశ్లేషణ:

కథగా చెప్పాలంటే సింపుల్. ఊరుని పట్టి పీడిస్తున్న ప్రేతాత్మ ను దైవాంశ అండతో ఓ నాగసాధువు ఎలా కాపాడిందన్నదే సినిమా. ఓవరాల్ గా చూస్తే మూవీలో హింస ఎక్కువగా డామినేట్ చేసిందనే చెప్పాలి. ప్రత్యేకించి ప్రధమార్థంలో తిరుపతి ప్రేతాత్మ మహిళలపై దాడి చేసే సన్నివేశాలు మితిమీరిన హింసతో ఉన్నాయి. ఊరికి సాయం చేసేందుకు నాగ సాధువు భైరవి ఎంట్రీతో ఇంటర్వెల్ పడుతుంది. నిజానికి ఇక్కడ నుంచే కేర్ ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంది. అయితే సెకండాఫ్ స్లో నెరేషన్ తో బోరు కొట్టించేలా సాగటం ఈ సినిమాకు పెద్ద మైనస్. భైరవి నీడలో శివుడు కనిపించటంతో పాటు పతాక సన్నివేశాలలో శివుడు వచ్చే సీన్ సినిమాను కొంత మేరకు నిలబెట్టాయని చెప్పాలి. 'హనుమాన్' మూవీ క్లయిమాక్స్ లో ఎలా హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడో అలా ఇందులో క్లైమాక్స్ లో భైరవిని కాపాడటానికి నందీశ్వరుడు, శివుడు వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ఇవే సినిమాను కాపాడాయని చెప్పవచ్చు.


నటీనటులు…. సాంకేతిక నిపుణులు..

నాగ సాధువు భైరవిగా తమన్నా నటన బాగుంది. క్లైమాక్స్ లో తన నటనతో తమన్నా ఆకట్టుకుంది. అయితే ప్రేతాత్మ తిరుపతి గా వశిష్ట సత్తా చాటాడు. నిజానికి సినిమాలో అతనే హైలైట్. హెబ్బా పటేల్ ఎందుకో బాగా తేలిపోయింది. తన పాత్రకి అంత ప్రాధాన్యం కూడా లేదు. సాయిబు పాత్రలో మురళీ శర్మ, పూజారిగా శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకి బలం మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ (Ajaneesh Loknath). అతనీ సినిమాకు అందించిన బీజీఎం అదిరింది. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ వర్క్ కూడా బాగుంది. అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్ తో పాటు అక్కడక్కడ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

ఓవరాల్ గా తొలి భాగం ‘ఓదెల రైల్వేస్టేషన్’తో పోలిస్తే ‘ఓదెల 2’ తేలిపోయింది. ఆత్మ పరమాత్మ సంఘర్షణలో ఎక్కువ భాగం ఆత్మదే పై చేయిగా చూపించటం ఆడియన్స్ కు అంతగా నచ్చదు. పతాక సన్నివేశం బాగున్నా మిగతాదంతా భరించాలంటే కష్టమైన పనే. థియేటర్ లోంచి బయటకు వచ్చే ఆడియన్ బాగుంది అని చెప్పటానికి ఎంతో సంశయిస్తారనేది వాస్తవం. ఇక చివరలో ‘ఓదెల 3’ ఉంటుందని స్క్రీన్ పై పడగానే 'దీనికి సీక్వెలా?' అనిపించక మానదు.

ట్యాగ్ లైన్: ప్రేక్షకుల ఓపికకు సమాధి…

రేటింగ్: 2.25/5

Updated Date - Apr 17 , 2025 | 04:01 PM