JAAT Review: జాట్ రివ్యూ
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:54 PM
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో తెలుగు దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కించిన 'జాట్' చిత్రం గురువారం విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
చాలా ఏళ్ళ తరువాత 'గదర్ -2' (Gadar -2) తో ఘనవిజయం సాధించిన సన్నీ డియోల్ (Sunny Deol) 'జాట్' (Jaat)తో జనాన్ని పలకరించడానికి వచ్చారు. గురువారం విడుదలైన 'జాట్'లో జనాన్ని ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాతలు, ఉత్తరాది నిర్మాణసంస్థతో కలసి నిర్మించడం విశేషం కాగా, మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఈ సినిమాతోనే హిందీ చిత్రసీమలో దర్శకునిగా అడుగుపెట్టారు. 'గదర్-2' ఊపులో వచ్చిన 'జాట్' సన్నీ డియోల్ ఫ్యాన్స్ ను అలరించే అంశాలతో తెరకెక్కింది.
కథ ఏమిటంటే...
తుంగ రాణా, అతని సోదరుడు సోములు కలసి అనేక గ్రామాలను భయపెడుతూ తమ గుప్పిట్లో ఉంచుకుంటారు. చివరకు కట్టుకున్న భార్య, కన్నతల్లి కూడా తుంగ రాణా అంటే హడలిపోతుంటారు. అలాంటి ప్రాంతానికి ఊరు పేరులేని వ్యక్తిగా హీరో ఎంట్రీ ఇస్తాడు. రాణా, సోములు ఆట కట్టించేందుకు రంగంలోకి దిగుతాడు హీరో. ఆ తరువాత తెలుస్తుంది అతను బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్ అని. బల్బీర్ ప్రత్యర్థులను చివరకు ఎలా చిత్తు చేశాడన్నదే కథ. తెలుగువారికి ఈ సినిమా చూస్తోంటే మన టాప్ స్టార్స్ నటించిన పలు చిత్రాలు గుర్తుకు వస్తూంటాయి. అయితే మనకు కథ కొత్తగా కనిపించక పోయినా, ఉత్తరాదివారిని ఆకట్టుకొనే అంశాలతో సాగారు దర్శకుడు గోపీచంద్ మలినేని.
విశ్లేషణ...
'గదర్' సీక్వెల్ గా వచ్చిన 'గదర్ -2'లో ఇంకా తనలో సత్తా తగ్గలేదు అని చాటుకున్నారు సన్నీడియోల్. ఆయనలోని ఎమోషన్ ను చక్కగా పండించేందుకు బల్బీర్ ప్రతాప్ సింగ్ పాత్రను రూపొందించారు. ఎక్కడా పట్టు కోల్పోకుండా శ్రీనివాస్ గవిరెడ్డి, కుందన్ పాండేతో కలసి గోపీచంద్ స్క్రీన్ ప్లే రూపొందించారు. సన్నీడియోల్ తన పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రణదీప్ హూడా (Radeep Hooda) , వినీత్ కుమార్ సింగ్ (Vineeth Kumar Singh) తమదైన నటనతో అలరించారు. సీబీఐ ఆఫీసర్ సత్యమూర్తి పాత్రలో జగపతిబాబు (Jagapathi Babu), వసుంధరగా రమ్యకృష్ణ (Ramya Krishna) కనిపించారు. రెజీనా (Regina) ముద్దుగా బొద్దుగా తళుక్కుమంది. ఈ సినిమా స్క్రీన్ ప్లేకు తగ్గట్టుగా థమన్ (Thaman) నేపథ్య సంగీతం అందించారు. అనేక సీన్స్ ను థమన్ బాణీలు ఎలివేట్ చేశాయని చెప్పొచ్చు. రిషి పంజాబీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాతలు నవీన్, రవిశంకర్, టి.జి.విశ్వప్రసాద్, ఉమేశ్ కుమార్ బన్సాల్ ఖర్చుకు వెనుకాడకుండా సాగారనే అనిపిస్తుంది. సన్నీ ఫ్యాన్స్ ను ఆకట్టుకొనేలా యాక్షన్ సీన్స్ తెరకెక్కాయి. ఈ మధ్య వచ్చిన బాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ లో 'జాట్' పరవాలేదనిపిస్తుంది.
కొద్ది రోజుల క్రితం జనాన్ని పలకరించిన సల్మాన్ ఖాన్ 'సికందర్' కూడా సౌత్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లోనే రూపొందింది. అయితే ఆ సినిమా కంటే సన్నీ డియోల్ తో మన తెలుగు దర్శకుడు తీసిన 'జాట్' పరవాలేదనే టాక్ సంపాదించింది. అయితే ప్రథమార్ధంలాగా ద్వితీయార్ధం రక్తి కట్టించలేదన్నది వాస్తవం. సన్నీ హీరోగా నటించినా, ఎందువల్లో దేశవ్యాప్తంగా 'జాట్'కు బాక్సాఫీస్ సందడి కనిపించడం లేదు. చూద్దాం... వారాంతంలో 'జాట్' పికప్ అవుతుందేమో!
ట్యాగ్ లైన్.. 'జాట్' ఘాటు!
రేటింగ్: 2.5/5
Also Read: Jack Movie Review: జాక్ మూవీ రివ్వూ
Also Read: Dilwale Dulhania Le Jayenge: షారుఖ్, కాజల్ కాంస్య విగ్రహాలు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి