Jack Movie Review: జాక్ మూవీ రివ్వూ
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:26 PM
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'జాక్'. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను 'బొమ్మరిల్లు' భాస్కర్ డైరెక్ట్ చేశారు. మరి 'జాక్' ప్రేకకులను మెప్పించిందో లేదో తెలుసుకుందాం!
''డీజే టిల్లు, టిల్లు స్క్వేర్'' తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఇదే ఊపులో 'జాక్' మూవీతో హ్యాట్రిక్ కొట్టేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇందులో హీరో తండ్రి చెప్పినట్టు 'జాక్ ఆఫ్ ఆల్... మాస్టర్ ఆఫ్ నన్'గా హీరో క్యారెక్టర్ ఉండటంతో సిద్ధుకు ఎదురుదెబ్బ తగిలింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన 'జాక్' కథ, కథనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే...
ఇందులో హీరో సిద్ధు జొన్నలగడ్డ పేరు పాబ్లో నెరూడా! ఇదేం పేరు అనే సందేహం ప్రేక్షకులకు కలగొచ్చు. చిలీ దేశానికి చెందిన ప్రముఖ కవి, రాజకీయ నాయకుడి పేరది. ఆయన కవితలతో కనెక్ట్ అయిన సిద్ధు తల్లి కొడుక్కి ఆ పేరు పెడుతుంది. అయితే ఈ కుర్రాడు జాక్ ఆఫ్ ఆల్... మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టుగా చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకూ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు, కోచింగ్స్ తీసుకుంటాడు. కానీ ఎవ్వరూ అతన్ని మాస్టర్ గా చేయలేకపోతారు. చిన్నప్పటి నుండి తల్లి చెప్పినట్టు అందరూ గర్వపడే స్థితికి చేరుకుంటాననే నమ్మకం పాబ్లోకు ఉంటుంది. టెర్రరిస్టుల కారణంగా తల్లి దుర్మరణం చెందడంతో అమ్మలాంటి మాతృదేశానికి సేవ చేయడానికి 'రా'లో చేరాలనుకుంటాడు పాబ్లో. అయితే అతని దుందుడుకు వైఖరి కారణంగా అది సఫలీకృతం కాదు. కానీ ఏదో ఒక రోజు తనకు 'రా' నుండి పిలుపు వస్తుందనే నమ్మకంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే టెర్రరిస్టుల ఆగడాలను అరికట్టడానికి రంగంలోకి దిగేస్తాడు. అదే సమయంలో భారత్ లోకి అత్యాధునిక ఆయుధాలను దొడ్డి దారిన తీసుకొచ్చి, నాలుగు నగరాలలో పేలుళ్ళకు ఉగ్రవాదులు పాల్పడబోతున్నారని 'రా' అధికారి మనోజ్ (ప్రకాశ్ రాజ్)కు తెలుస్తుంది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయాలని అతని బృందం బయలు దేరుతుంది. ఒకే ఆపరేషన్ ను ఇటు మనోజ్, అటు పాబ్లో చేసినప్పుడు ఎలాంటి గందరగోళం నెలకొంది? పాబ్లో అతి వల్ల 'రా' టీమ్ ఎలాంటి ఇబ్బందుల్లో పడింది? ఫైనల్ గా పాబ్లో, రా బృందం టెర్రరిస్టుల అటాక్ నుండి దేశాన్ని ఎలా కాపాడారు? అనేదే 'జాక్' కథ.
సినిమా ఎలా ఉందంటే...
దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్ 'జాక్' మూవీకి 'కొంచెం క్రాక్' అనే ట్యాగ్ లైన్ కరెక్ట్ గా పెట్టారు. దీనిని చూస్తున్నంత సేపు సిద్ధు క్యారెక్టరైజేషన్ కొంచెం కాదు... చాలా పెద్ద క్రాక్ అనిపిస్తుంది. ఇలాంటి కథలు అనేకం ఇప్పటికే వచ్చాయి. టెర్రరిస్టులు దేశంలో పలు చోట్ల దాడికి యత్నించడం, దాన్ని హీరో లేదా అతని బృందం భగ్నం చేయడమనేది ఇవాళ ఉత్తేజాన్ని కలిగించే పాయింట్ కానే కాదు. అయితే... ఆ కుట్రలను ఎలా అడ్డుకుంటారనేదే ఉత్సుకతను కలిగిస్తుంది. అదే ఆడియెన్స్ కు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ను చూసిన భావన కలిగిస్తుంది. కానీ దీనిని ఇందులో పెద్ద కామెడీగా చూపించారు. టెర్రరిస్టుల అటాక్స్ ను, వారిపై చేసే ఎదురుదాడిని బొమ్మలాట మాదిరిగా పిక్చరైజ్ చేశారు. క్లయిమాక్స్ అయితే మరీ దారుణం! 'రా' సంస్థ పట్ల, అందులోని అధికారుల పట్ల జాలి కలిగించేలా ఇందులోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇక హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోను ట్రాప్ చేయాలని హీరోయిన్ చేసే ప్రయత్నాలు చికాకును కలిగిస్తాయి. లేడీ డిటెక్టివ్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఆమె పడే పాట్లు ఆడియెన్స్ మెప్పును పొందవు సరికదా ఇదేం గోల అనేట్టు చేస్తాయి. హీరోకు అతని తల్లికి ఉన్న అనుబంధాన్ని మాత్రం కాస్తంత హార్ట్ టచ్చింగ్ గా చూపించారు. ఫాదర్, సన్ ట్రాక్ ఏమంత కొత్తగా లేదు. వెరశీ దర్శకుడు భాస్కర్ ఏదో తీయాలని ఏదో తీసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో దర్శకుడు భాస్కర్ తన డామినేషన్ ను చూపడానికి ట్రై చేస్తే... మరి కొన్ని సీన్స్ లో హీరో సిద్ధు డామినేట్ చేయడానికి ప్రయత్నించినట్టుగా ఉంది. మొత్తం మీద వీరిద్దరూ కలిసి ఓ రుచీపచీ లేని కిచిడీని తయారు చేశారు.
నటీనటులు... సాంకేతిక నిపుణులు...
నటీనటుల విషయానికి వస్తే... సిద్ధుకు ఈ పాత్ర కేక్ వాక్ లాంటిది. అలానే చాలా ఈజ్ తో చేశాడు. అయితే 'టిల్లు' పాత్రను ఇంకా తన భుజాల మీద నుండి దింపడానికి సిద్ధు ఇష్టపడటం లేదని కొన్ని కామెడీ సీన్స్ చూస్తుంటే అనిపిస్తుంది. 'బేబి' మూవీతో ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య కు సెకండ్ ఫిల్మ్ 'లవ్ మీ'లో మంచి పాత్రే దక్కింది కానీ సక్సెస్ లభించలేదు. ఇందులో పాత్ర నటిగా ఆమెకు పేరు తెచ్చిపెట్టేది కూడా కాదు. ఇతర ప్రధాన పాత్రలను ప్రకాశ్ రాజ్, సుబ్బరాజు, నరేశ్, బిందు చంద్రమౌళి, బ్రహ్మాజీ, సంజయ్ స్వరూప్, రవిప్రకాశ్, రాహుల్ దేవ్ తదితరులు పోషించారు. ఎవరి పాత్రలు ఏమంత చెప్పుకోదగ్గవి కాదు.
టెక్నీషియన్స్ లో చెప్పుకోవాల్సింది సామ్ సి. ఎస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించే! సురేశ్ బొబ్బిలి, అచ్చు రాజమణి సమకూర్చిన స్వరాలు పెద్దంత గొప్పగా లేవు. అయితే ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్ లో వచ్చే హిందీ పాట బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని సినిమా స్థాయిని పెంచేలానే ఉన్నాయి. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఎక్కడా రాజీపడకుండానే దీనిని నిర్మించారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత వన్ టైమ్ వాచ్ బుల్ అనే భావన కలుగుతుంది. దానిని సెకండ్ హాఫ్ తుడిచిపెట్టేసింది. కొత్తదనంలేని కథ, కదిలించని భావోద్వేగాలతో 'జాక్' సాగిన తీరు... ఆడియెన్స్ ను రాక్ లా మార్చేస్తాయి.
ట్యాగ్ లైన్: జాక్ కాదు రాక్!
రేటింగ్ : 2.25/5