Sarangapaani Jathakam: సారంగపాణి జాతకం రివ్యూ
ABN , Publish Date - Apr 25 , 2025 | 02:08 PM
ప్రియదర్శి, రూపా కొడవాయూర్ జంటగా నటించిన సినిమా 'సారంగపాణి జాతకం'. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం....
ప్రస్తుతం ప్రియదర్శి టైమ్ నడుస్తోంది. 'బలగం, 35, కోర్ట్' సినిమాలు అతనికి నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. మధ్యలో 'డార్లింగ్' సినిమా చేదు అనుభవాన్ని ఇచ్చినా... ప్రియదర్శి ని నమ్మి సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య పెరుగుతోంది. క్లీన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించే దర్శకుడిగా పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ మూడేళ్ళ క్రితం తీసిన థ్రిల్లర్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' పరాజయం పాలైంది. దాంతో తనకు అచ్చివచ్చిన కామెడీ జానర్ లోనే ఈసారి 'సారంగపాణి జాతకం' ను మోహనకృష్ణ తెరకెక్కించాడు. దీన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మోహనకృష్ణ, కృష్ణ ప్రసాద్ కాంబోలో ఇప్పటికే 'జెంటిల్ మన్, సమ్మోహనం' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ వచ్చాయి. మరి 'సారంగపాణి జాతకం'తో వీళ్ళు హ్యాట్రిక్ కొట్టారో లేదో తెలుసుకుందాం....
కథ విషయానికి వస్తే...
సారంగపాణి (ప్రియదర్శి) కార్ షోరూమ్ లో సెల్స్ మెన్. చిన్నప్పటి నుంచి అతనికి జాతకాలంటే పిచ్చి. తన షోరూమ్ లోనే మేనేజర్ గా ఉన్న మైధిలి (రూపా కొడవాయూర్) ని సారంగ ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. పెద్దలను ఒప్పించి, ఇద్దరూ పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు. ఆ సమయంలో సారంగ చేతి చూసిన జిగేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) అతని జాతకంలో ఓ చిక్కుముడి ఉందని చెబుతాడు. దాంతో షాక్ కు గురైన సారంగ... మైథిలితో తన పెళ్ళిని వాయిదా వేస్తాడు. జిగేశ్వర్ చెప్పిన చిక్కుముడి ఏమిటీ? దాన్ని విప్పడానికి సారంగ ఏం చేశాడు? ఈ మొత్తం వ్యవహారంలో సారంగను ఎవరెవరు ఎలా అపార్థం చేసుకున్నారు? తిరిగి సారంగ, మైథిలి ఎలా ఒక్కటి అయ్యారు? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే...
జాతకాలను నమ్మే వాళ్ళు కోట్లలో ఉంటారు. అయితే... ఆ నమ్మకం... మూఢ నమ్మకంగా మారనంతవరకూ సమస్య ఉండదు. ఈ సినిమాలోని ప్రధానాంశం అదే! ముక్కూ ముఖం తెలియని వ్యక్తి చెయ్యి చూసి చెప్పిన జాతకాన్ని నమ్మి... సారంగపాణి ఎలా కష్టాలను కొన్ని తెచ్చుకున్నాడు? ఆ తర్వాత తాను ట్రాప్ లో పడ్డాననే విషయాన్ని గ్రహించి, అందులోంచి ఎలా బయటకు వచ్చాడు? అనే దాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ నాన్ స్టాప్ గా ఫన్ రైడ్ సాగిపోతుంది. కాకపోతే మధ్యలో వచ్చే సాంగ్స్ కాస్తంత స్పీడ్ బ్రేకర్స్ గా అనిపిస్తాయి. ఒక్క క్షణం చూపు మరల్చితే ఎక్కడ ఫన్ మిస్ అయిపోతామో అనే భావన కలిగేట్టుగా మోహన్ కృష్ణ ఈ స్క్రిప్ట్ ను రాసుకున్నాడు. క్లీన్ కామెడీ మూవీస్ ను తెరకెక్కించడంతో దిట్ట అని మరోసారి నిరూపించు కున్నాడు. చదువుకున్న మనుషులకు జాతకాలంటే ఇంత పిచ్చి ఉంటుందా? వాటిని నమ్మి ఇంత దారుణాలకు ఒడిగడతారా? అనే సందేహం కొంతమందికి రావచ్చు. కానీ మూఢ నమ్మకం మనుషుల్ని ఏ స్థాయికైనా దిగజార్చుతుందని తెలిపే సంఘటనలు మన కళ్ళ ముందు అనేకం జరుగుతున్నాయి. అలాంటి పిచ్చి నమ్మకాలకు లాజిక్ ఉండదు.
నటీనటులు సాంకేతిక నిపుణులు...
నటీనటుల విషయానికి వస్తే... సారంగపాణిగా ప్రియదర్శి చక్కగా నటించాడు. సందర్భానుసారంగా భావోద్వేగాలు పలికించాడు. అతని క్రైమ్ పార్ట్ నర్ గా వెన్నెల కిశోర్ చెడుగుడు ఆడేశాడు. అతని కామెడీ టైమింగ్ ను తట్టుకోవడం ఎవరికైనా కష్టమే! క్లయిమాక్స్ లో ఇటు వెన్నెల కిశోర్, అటు వైవా హర్ష మధ్యలో... ప్రియదర్శి తేలిపోయాడు! ఈ సినిమాలో చక్కని నటన ప్రదర్శించిన మరో వ్యక్తి వడ్లమాని శ్రీనివాస్. ఈ మధ్య కాలంలో అతనికీ మంచి పాత్రలు పడుతున్నాయి. అవసరాల శ్రీనివాస్ తన పాత్రను చక్కగా పోషించాడు. హీరోయిన్ రూప కొడువాయూర్ సహజ నటన ప్రదర్శించింది. ఇతర ప్రధాన పాత్రలను తనికెళ్ళ భరణి, ప్రదీప్ రుద్ర, కల్పలత, నరేశ్, రూపలక్ష్మి, తనికెళ్ళ భార్గవ్, శివన్నారాయణ, రాజా చెంబోలు తదితరులు చేశారు. అందరి నుండి తనకు కావలసిన మేర నటనను రాబట్టుకున్నాడు ఇంద్రగంటి మోహన కృష్ణ. బేసికల్ గా మోహన కృష్ణ మంచి రైటర్ కూడా కావడంతో అదిరిపోయే పంచ్ డైలాగ్స్ తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు.
ఇలాంటి సినిమాలను ఓ స్థాయిలో నిలబెట్టాలంటే సాంకేతిక నిపుణుల కృషి కూడా ప్రధానం. ఆ విషయంలో అందరూ కష్టపడి వర్క్ చేశారు. ముఖ్యంగా మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ హాయిగా అనిపిస్తుంది. సినిమాలోని ప్రధాన తారాగణం అంతా క్లయిమాక్స్ లో ఒక చోట చేరినప్పుడు దాన్ని బాలెన్స్ చేయడం చాలా కష్టం. డైలాగ్స్ లో బ్రివిటీతో పాటు ఎడిటింగ్ పర్ ఫెక్ట్ గా ఉంటేనే ఆ సీన్స్ పండుతాయి. టెంపో మెయిన్ టైన్ అవుతుంది. ఈ సినిమాలో అది పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఎక్కడా అతి లేకుండా, లాగ్ లేకుండా మార్తండ్ కె వెంకటేశ్ జాగ్రత్త పడ్డాడు. పాటల బాణీలు సో... సో... గా ఉన్నా వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగుంది. పీజీ వింద ఫోటోగ్రఫీ సూపర్. మేకప్, కాస్ట్యూమ్స్ అన్నీ చక్కగా సెట్ అయ్యాయి.
సంక్రాంతి సీజన్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కు వినోదాల విందును అందించిందో... ఈ సమ్మర్ సీజన్ లో 'సారంగపాణి జాతకం' అలానే చల్లని నవ్వుల జల్లును కురిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే... సారంగపాణిగా నటించిన ప్రియదర్శి జాతకమే కాదు... టోటల్ టీమ్ జాతకం అద్భుతంగా ఉంది. అందుకు మెయిన్ రీజన్ లాజిక్ జోలికి పోకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ చేసిన మ్యాజిక్కే!!
రేటింగ్ : 2.75 / 5
ట్యాగ్ లైన్ : జాతకం బాగుంది!