Pelli Kani Prasad Review: సప్తగిరి పెళ్లి కానీ ప్రసాద్ ఏం చెప్పాడంటే...

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:02 AM

కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్నటైమ్ లోనే సప్తగిరి (Saptagiri) హీరోగా టర్న్ తీసుకున్నాడు. ''సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్ బి'' వంటి మూవీస్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగానూ, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. కాస్తంత గ్యాప్ తర్వాత అతను హీరోగా నటించిన మూవీ 'పెళ్ళి కాని ప్రసాద్'.

రివ్యూ: పెళ్ళి కాని ప్రసాద్ (Pellikani prasad Review)

విడుదల తేదీ: 21-3-2025

నటీనటులు: సప్తగిరి, ప్రియాంక శర్మ (Priyanka Sharma) ,మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ్మ, వడ్లమాని సాయి శ్రీనివాస్ తదితరులు 

సంగీతం: శేఖర్ చంద్ర 

నిర్మాతలు: కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల 

దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి. (Abhilash Reddy)


కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్నటైమ్ లోనే సప్తగిరి (Saptagiri) హీరోగా టర్న్ తీసుకున్నాడు. ''సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్ బి'' వంటి మూవీస్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగానూ, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. కాస్తంత గ్యాప్ తర్వాత అతను హీరోగా నటించిన మూవీ 'పెళ్ళి కాని ప్రసాద్'. సహజంగా ఈ టైటిల్ చెప్పగానే గుర్తొచ్చేది 'మల్లీశ్వరి'లో వెంకటేశ్. తర్వాత అల్లరి నరేశ్, శివాజీ ఇదే పేరుతో చేసిన సినిమా. బట్... కథకు యాప్ట్ అని అదే టైటిల్ ను సప్తగిరి సినిమాకూ పెట్టారు. పెళ్లి కాని ప్రసాద్... పెళ్ళైన తర్వాత పడిన అగచాట్లేమిటో తెలుసుకుందాం...

కథ: (Pellikani prasad review)
36 సంవత్సరాలు వచ్చినా పెళ్ళి కావట్లేదని తెగ ఇదైపోతుంటాడు ప్రసాద్. అతని మార్కెట్ వాల్యూ ప్రకారం రెండు కోట్ల కట్నం ఇచ్చే సంబంధమే చేస్తానని భీష్మించుకుంటాడు ప్రసాద్ తండ్రి. చివరకు తను ప్రేమించిన అమ్మాయి మెడలో పైసా కట్నం తీసుకోకుండా తాళి కట్టేస్తాడు ప్రసాద్. అక్కడ నుండే అసలు కథ మొదలవుతుంది. ఫారిన్ లో ఉంటాడనే ఒకే ఒక్క కారణంగా ప్రసాద్ ను పెళ్ళాడిన ప్రియ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అతనితో ఎలా చెడుగుడు ఆడారనేదే ఈ సినిమా.


Pello.jpgవిశ్లేషణ: 

ఒక్కొక్కళ్ళకూ ఒక్కో పిచ్చి ఉంటుంది. అందులో కొందరికి ఫారిన్ వెళ్ళాలనేది ఒకటి. చదువుకోడానికో, ఉద్యోగం చేయడానికి ఫారిన్ వెళ్ళడం ఒకటైతే... ఎన్.ఆర్.ఐ.ను పెళ్ళి చేసుకుని ఫారిన్ వెళ్ళడం మరొకటి. సరే... పెళ్ళి అయిన తర్వాత భర్తతో కలిసి పెళ్ళికూతురు ఫారిన్ వెళితే ఓకే... ఆమెతో పాటు పనోడితో సహా ఇంటిల్లిపాది ఫారిన్ వెళ్ళాలనుకుంటే అతి అత్యశే అవుతుంది. అలాంటి ఓ కుటుంబం చుట్టూ రాసుకున్న కథ ఇది. దగ్గరి బంధువులు ఫారిన్ లో స్థిరపడ్డారనే అసూయతో తామూ ఎలాగైనా విదేశాలకు వెళ్ళాలనుకునే ఓ ఫ్యామిలీ చేసే నిర్వాకమే ఈ సినిమా.  ఫారిన్ వెళ్ళాలనే తమ కోరికను నెరవేర్చుకోవడం కోసం మలేసియాలో ఉండే ప్రసాద్ ను హీరోయిన్ ఫ్యామిలీ ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తుంది. తీరా పెళ్ళి అయిన తర్వాత ప్రసాద్ మలేసియా నుండి శాశ్వతంగా ఇండియాకు వచ్చేశాడని తెలిసిన అతనికి చుక్కలు చూపిస్తుంది. అత్తగారి ఫ్యామిలీ నిజ స్వరూపాన్ని తెలుసుకున్న ప్రసాద్ ఎలా తిరిగి వారి ప్రేమను పొందాడనేది మిగతాకథ. ప్రేమించిన అమ్మాయిని ప్రసాద్ పెళ్ళాడటంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. అసలు కథ అక్కడ నుండే మొదలవుతుంది. ఈ మూవీ ప్రథమార్ధం టీవీ సీరియల్ ను తలపిస్తే... ద్వితీయార్థం అర్థం పర్థం లేని, ఆకట్టుకోని మలుపులతో సాగింది. ఇక క్లయిమాక్స్ లో హీరోయిన్ ఫ్యామిలీ చిటికెలో మారిపోవడం చూసి ప్రేక్షకులు ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. ఏదో బలమైన కారణాన్ని చూపించి దర్శకుడు అభిలాష్ రెడ్డి వారిలో మార్పు తీసుకొస్తాడనుకుంటే... 'ఇక చూసింది చాలు... లేవండి' అన్నట్టుగా ఠక్కున శుభం కార్డ్ వేసేశారు. అప్పటి వరకూ తాము చూస్తోంది... ముప్పై, నలభై యేళ్ళ క్రితం తీసిన జంధ్యాల, ఇవీవీ మార్క్ సినిమా అనుకుంటున్న ప్రేక్షకులు ఒక్కసారి ఉలిక్కిపడి... ఈ లోకానికి వచ్చిపడతారు.

నటీనటుల విషయానికి వస్తే... సప్తగిరికి ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. అలానే అవలీలగా చేసేశాడు. హీరోయిన్ ప్రియాంక శర్మ కొన్ని చోట్ల ఓకే బాగానే ఉంది. కొన్ని సీన్స్ లో చూడటానికి ఎబ్బెట్టుగా అనిపించింది. హీరో తండ్రిగా మురళీధర్ గౌడ్ బాగా చేశాడు. కాకపోతే 'కట్నంవారి శాసనాల గ్రంధం' కాన్సెప్టే బోరింగ్ గా ఉంది. ఈ సినిమాలో విపరీతంగా,  కష్టపడి నటించిన వాళ్ళు ఎవరంటే హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్! హీరోయిన్ తండ్రి వడ్లమాని శ్రీనివాస్, తల్లి ప్రమోదిని, మామ్మ అన్నపూర్ణమ్మ, పనోడు బాషా!! వాళ్ళతో ఒళ్ళుహూనం అయ్యేలా డైరెక్టర్ యాక్ట్ చేయించాడు. అంతేకాదు... పిచ్చి స్టెప్పులతో వీళ్ళందరి మీద ఓ సాంగ్ కూడా తీశాడు. వీరి ఓవర్ యాక్షన్ ను తెర మీద చూడటమే కష్టంగా ఉందంటే... సెట్స్ లో టేకులు, రీటేకులతో పరిస్థితి ఎలా ఉండిందో ఊహించుకోవచ్చు. ఇతర పాత్రలను మీసాల లక్ష్మణ్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్, జెన్ని, నాగ మహేశ్‌ తదితరులు పోషించారు. ఏ మాటకామాట మాటలు అక్కడక్కడా పేలాయి. ఆర్టిస్టుల ఓవర్ యాక్షన్ లానే శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం చాలా ఓవర్ గా ఉంది. ప్రతి సన్నివేశాన్ని బాగా పైకి లేపడానికి రకరకాల గిమ్మిక్స్ చేశాడు. మారిషస్ పాట ఎడిటింగ్ వరెస్ట్. ఇలా పాత కాలం కథ, కథనాలతో ఈ తరం ప్రేక్షకులను మెప్పించగలమని భావించిన దర్శక నిర్మాతల ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఒకటి సప్తగిరితో చెప్పించారు... ''సరిసర్లే ఎన్నెన్నో అనుకుంటాం... అన్ని జరుగుతాయా ఏంటీ?'' అని. బహుశా రిజల్డ్ ముందే ఊహించి ఈ డైలాగ్ సప్తగిరితో చెప్పించారేమో!

ట్యాగ్ లైన్: అసలు కథ పెళ్ళయ్యాకే

Updated Date - Mar 21 , 2025 | 01:41 PM