Mazaka Review: సందీప్‌ కిషన్‌ 30వ సినిమా ఎలా ఉందంటే..

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:03 AM

కొంతకాలంగా సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan) సీరియస్‌ చిత్రాలు చేస్తున్నాడు. ఏదీ కూడా సరైన విజయం అందించలేదు. తాజాగా ఆయన నటించిన 30వ చిత్రం మజాకా. ‘ధమాకా’ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించి చిత్రమిది.  


సినిమా రివ్యూ: 'మజాకా' (Mazaka movie review)
విడుదల తేది: 26–2–2025
నటీనటులు: సందీప్‌ కిషన్‌, రావు రమేష్‌ (Rao Ramesh), రీతూవర్మ, అన్షు (Anshu), మురళీశర్మ, శ్రీనివాస్‌ రెడ్డి, రఘుబాబు, హైపర్‌ ఆది తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ, సాయికృష్ణ
సంగీతం: లియోన్‌ జేమ్స్‌
సినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫీ
నిర్మాణం: రాజేశ్‌ దండ
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన

కొంతకాలంగా సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan) సీరియస్‌ చిత్రాలు చేస్తున్నాడు. ఏదీ కూడా సరైన విజయం అందించలేదు. తాజాగా ఆయన నటించిన 30వ చిత్రం మజాకా. ‘ధమాకా’ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించి చిత్రమిది.  రావు రమేష్‌ కీలక పాత్ర పోషిండం, మన్మథుడు ఫేం అన్షు రీ ఎంట్రీ ఇవ్వడంతో సినిమాకు హైప్‌ వచ్చింది. శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది సినిమా. మరీ చిత్రం ఎలా ఉంది? సందీప్‌కు హిట్‌ ఇచ్చిందా.. ప్రేక్షకులకు మజా పంచిందా? అన్నది చూద్దాం.

కథ:
వెంకటరమణ (రావు రమేష్‌), కృష్ణ (సందీప్‌ కిషన్‌) తండ్రీ కొడుకులు. కృష్ణ పుట్టుకతోనే తల్లి మరణిస్తుంది. దాంతో ఇంట్లో ఆడదిక్కు లేకుండా పోతుంది. ఇద్దరూ బ్యాచిలర్స్‌గా జీవితం సాగిస్తుంటారు. ఎలాగైనా తన కొడుక్కి పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫొటోని చూసుకోవాలనేది వెంకటరమణ ఆశ. కానీ, ఎవ్వరూ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారు. వెంకటరమణ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరుతాయనే సలహా ఇస్తారు సన్నిహితులు. దాంతో ఆయన పెళ్లి ప్లాన్‌ చేస్తుండగా యశోద (అన్షు) తారసపడుతుంది. లేటు వయసులో ఆమె ప్రేమలో మునిగి తేలుతుంటాడు రమణ. తనయుడు కృష్ణ కూడా మీరా (Rithu varma -రీతూవర్మ) ప్రేమలో పడతాడు. అలా తండ్రీ కొడుకులు ఇద్దరూ ప్రేమలేఖలు అంటూ ఆ ఇద్దరి చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. ఒకరి ప్రేమ గురించి మరొకరికి ఎప్పుడు తెలిసింది?ఈ రెండు జంటల ప్రేమకథల్లో ఎలాంటి ట్విస్ట్‌లున్నాయి? అంతా ఓకే అయ్యాక పెళ్లికి ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. పగతో రగిలిపోయే భార్గవ్‌ వర్మ (మురళీశర్మ)కీ, ఈ తండ్రీ కొడుకులకీ మధ్య సంబంధం ఏమిటి? అన్నది కథ.


Sandeep.jpg

విశ్లేషణ: (Mazaka movie review)
తమకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలని, గ్రూప్‌ ఫోటో గోడ మీద ఉండాలని తపన పడే తండ్రి కొడుకుల కథ ఇది.   రమణ, కృష్ణ.. ఎస్‌ అజయ్‌కు తమ స్టోరీ చెప్పడంతో కథ మొదలవుతుంది. అక్కడే అసలు విషయంలోకి తీసుకెళ్లాడు. ఒక్కొక్కరు ప్రేమకథలు మొదలుపెట్టాక అక్కడున్న కంటెంట్‌ను బట్టి హ్యూమర్‌ పండాలి కానీ.. అది జరగలేదు. తండ్రీ కొడుకుల ప్రేమకథల్ని ప్యారలల్‌గా తీసుకెళ్తూ ఫస్టాఫ్‌ నడిపించాడు దర్శకుడు. ఒకరి ప్రేమకథ మరొకరికి తెలిసిపోవడం, ఆ తర్వాత వచ్చే ప్రేమలేఖల ఎపిసోడ్‌, భార్గవ్‌ వర్మ పగ, ప్రతీకారం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో సినిమా సరదాగా సాగిపోతుంది. రాత్రిళ్లు కూర్చుని తండ్రీ కొడుకులు పోటీపడి ప్రేమలేఖలు రాసుకోవడం, ఇద్దరూ తాము మనసిచ్చిన వాళ్ల కోసం గోడలు దూకడం, బస్సుల్లో ఫాలో కావడం.. వంటి సన్నివేశాలు తెరపై ఎంత సరదాగా ఉంటాయో.., డోస్‌ ఎక్కువైతే అంతే ఓవర్‌గానూ ఉంటుంది. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య కొన్ని సన్నివేశాలు అలాగే సాగాయి. అక్కడ లాజిక్‌ గురించి ఆలోచించకపోతే సరదాగా నవ్వుకోవచ్చు. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ఇంట్రెస్ట్‌ కలిగిస్తాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కారణంగా తండ్రి కొడుకుల కథ కాస్త మేనత్త మేనకోడలు వార్‌ ట్రాక్‌ గా మారిపోతుంది. అప్పటివరకూ ఓ ఎమోషన్‌తో కంటిన్యూ అయిన ప్రేక్షకుడి ఏదో వెలితిగా అనిపిస్తుంది. అక్కడ కాన్‌ఫ్లిక్ట్‌ కూడా చాలా అర్టిఫీషియల్‌గా ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య వార్‌కి రీజన్‌ బలంగా ఉండదు. దాంతో ఫస్టాఫ్‌లో ఉన్న ఫన్‌ సెకెండాఫ్‌లో మిస్‌ అయింది. ఇక క్లైమాక్స్‌ అంతా ఎమోషన్‌ మీదే నడిపించారు. రావు రమేష్‌, రీతూ వర్మ మధ్య వచ్చే గజ్జెలు శబ్దం సీన్‌ వర్క్‌ అవుట్‌ అయ్యింది. దాన్ని బాగా తీర్చిదిద్దారు.. అప్పటి వరకూ నవ్వించిన రావు రమేష్‌, అక్కడికి వచ్చే సరికి ఎమోషన్‌ పండించారు. అక్కడ రావు రమేశ్‌ అనుభవం ఎంతో ఉపయోగపడింది. ముఖ్యంగా రావు రమేష్‌, అన్షు ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ తేలిపోతుంది. అనకాపల్లి పెళ్లి, విజయనగరం డెత్‌ సీన్‌ సినిమాకు సాగదీతగా నిలిచింది.  బలవంతంగా ఆ సన్నివేశాలు ఇరికించినట్లు అనిపిస్తుంది. రావు రమేష్‌, అన్షు లేచిపోయే సీన్‌ వర్కవుట్‌ కాలేదు. ఈ ఎపిసోడ్స్‌ పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ చేసుంటే సెకెండాఫ్‌ కూడా బావుండేది. భావోద్వేగం, వినోదం రెండు కలగలిపిన లైన్‌ ఇది. దీనిని ఫుల్‌ లెంగ్త్‌ స్టోరీగా తీర్చిదిద్దడంలో రచయిత, దర్శకుడు తడబడ్డారు. అయితే సినిమాలో ఎక్కడ అసభ్యత లేదు.


నటీనటుల పనితీరు.. సందీప్‌ కిషన్‌ చాలా ఎనర్జీగా కనిపించాడు.  కృష్ణ  పాత్రను అలవోకగా చేసుకునిపోయాడు. నిజానికి ఇలాంటి కథ ఒప్పుకున్నందుకు నటడిగా తనని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇందులో సందీప్‌ కిషన్‌ కంటే రావు రమేష్‌ స్ర్కీన్‌ టైం ఎక్కువ. రావు రమేష్‌ది ఇందులో లీడ్‌ రోల్‌ అనుకోవచ్చు. అయితే పాత్రకు న్యాయం చేశారు కానీ ఆయన మార్క్‌ అక్కడక్కడా మిస్‌ అయింది. యంగ్‌ లుక్‌ తీసుకురావడంలో ఆయన కాస్త ఇబ్బంది పడ్డారేమో అని ఫీలింగ్‌ కలుగుతుంది.  గజ్జెల సీన్‌ మాత్రం బాగా చేశారు. రీతు వర్మ సెటిల్ట్‌గా యాక్ట్‌ చేసింది. అయితే కాలేజ్‌ ఎపిసోడ్స్‌ అంతగా రిజిస్టర్‌ కాలేదు. అలాగే మేనత్తతో సంఘర్షణ కూడా సెట్‌ కాలేదు. అన్షుది చాలా కీలకమైన పాత్ర. అయితే ఆ క్యారెక్టర్‌లో సహజత్వం మిస్‌ అయింది. రావు రమేశ్‌ పెయిర్‌గా ఆమె అంతగా నప్పలేదు. మురళీశర్మ క్యారెక్టరైజేషన్‌ బావుంది. అదొక టైపు సైకో పగ అతనిది. బాగా చేశారు. హైపర్‌ ఆది అక్కడక్కడ నవ్వించాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. లియోన్‌ జేమ్స్‌ సంగీతం సినిమాకు అంతగా సెట్‌ కాలేదు. పాటలు అన్ని మిస్‌ ప్లేసింగ్‌లో ఉన్నాయి. బీజీఎం కొంతవరకూ ఓకే. కెమెరా పనితీరు బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. తెరకెక్కించడంలో ఎనర్జీ చూపించే త్రినాధరావు ఈ సినిమా విషయంలో అది మిస్‌ చేశాడు.  రైటర్‌ ప్రసన్న చాలా సన్నివేశాలు కాంప్రమైజ్‌ అయి రాసినట్టుంది. రావు రమేష్‌ అన్షు ట్రాక్‌ని కలిపిన విధానం ఆర్గానిక్‌గా అనిపించలేదు. టూ మచ్‌ సినిమాటిక్‌ లిబర్జీ తీసుకున్నాడు. సందీప్‌, రీతుల ట్రాక్‌ రొటీన్‌గా ఉంది. అయితే టీమ్‌ అంతా ఇంటిల్లిపాది చూేస ఓ సినిమా చేయాలని తపన పడ్డారు. ఎలాంటి అసభ్యత లేకుండా తీశారు. అయితే టైటిల్‌ ఉన్న మజా సినిమాలో కొంతవరకూ కొరవడింది. ఫస్టాఫ్‌ను ఎంగేజింగ్‌గా తీసుకెళ్లిన దర్శకుడు సెకండాఫ్‌లోనూ దానిని కొనసాగించి ఉంటే రిజల్ట్‌ బావుండేది.  (Mazaka movie review)

ట్యాగ్‌లైన్‌: మజా ఇంకాస్త ఉంటే..

Updated Date - Feb 26 , 2025 | 04:54 PM