Oka Pathakam Prakaaram Review: 'ఒక పథకం ప్రకారం' పూరీ తమ్ముడికి హిట్ ఇచ్చిందా..
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:03 PM
కెరీర్ బిగినింగ్‌లో మంచి విజయాలు అందుకున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్. నాలుగైదు విజయాలు తర్వాత సరైన సక్సెస్ రాలేదు. కొంతగ్యాప్ తర్వాత 'ఒక పథకం ప్రకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
సినిమా రివ్యూ: 'ఒక పథకం ప్రకారం’ (Oka Pathakam Prakaaram Review)
విడుదల తేది: 7–2–2025
నటీనటులు: సాయిరామ్ శంకర్, శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని, రూప, కల్పలత, పల్లవి గౌడ తదితరులు
కెమెరా: రాజీవ్ రాయ్
సంగీతం: రాహుల్ రాజ్
నేపథ్య సంగీతంఐ గోపీసుందర్
ఎడిటింగ్: కార్తీక్ జోగేష్
నిర్మాతలు: గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్
దర్శకుడు: వినోద్ కుమార్ విజయన్ (Vijay Kumar Vijayan)
కెరీర్ బిగినింగ్‌లో మంచి విజయాలు అందుకున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ (Sai Ram Shankar). నాలుగైదు విజయాలు తర్వాత సరైన సక్సెస్ రాలేదు. కొంతగ్యాప్ తర్వాత 'ఒక పథకం ప్రకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మలయాళ దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాటలు, ట్రైలర్లు ఆకట్టుకోవడం, ఈ సినిమాలో విలన్ ఎవరో చెప్పిన వారికి పదివేలు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సాయిరామ్ శంకర్‌కు కమ్ బ్యాక్ అయిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
కథ: (Oka Pathakam Prakaaram Review)
సిద్దార్థ్ నీలకంఠ (సాయిరామ్ శంకర్) ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్. సీత (ఆషిమా నర్వాల్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్న సమయంలో సీత మిస్ అవుతుంది. ఆ బాధతో సిద్దార్థ్ డ్రగ్స్‌కు బానిసవుతాడు. సిద్దార్థ్‌కు పరిచయం ఉన్న దివ్య (బిగ్ బాస్ భాను) క్రూరంగా హత్యకు గురవుతుంది. దీంతో ఏసీపీ రఘు రామ్ (సముద్రఖని) సిద్దార్థ్‌ను నిందితుడు అని చెప్పి కోర్టులో ప్రవేశ పెడతాడు. లాయర్‌గా తనకు పోటీగా ఉన్నాడని సిద్ధార్థ్‌ను ఇరకాటంలో పెట్టాలని లాయర్ చినబాబు (కళాభవన్ మణి) ప్రయత్నం చేస్తాడు. దీంతో ఆ కేసులో తాను నిర్దోషిని అని వాదించుకుని బయటకు వస్తాడు. ఆ కేసు ఏసీపీ రఘు రామ్ నుంచి బదిలీ చేసి ఏసీపీ కవిత (శృతి సోది)కి ఇస్తారు. తర్వాత వరుసగా మరో ముగ్గురు మహిళలు అతి క్రూరంగా హత్యకు గురవుతారు. ఆ కేసులోనూ సిద్దార్థ్‌ను నిందితుడిగా దొరికిన ఆధారాలతో ఏసీపీ కవిత (శృతి)అనుమానిస్తుంది. ఈ వరుస హత్యలకు కారకులు ఎవరు? ఎందుకు చేస్తున్నారు? సిద్దార్థ్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు? చివరికి తన భార్య సీత దక్కిందా లేదా అన్నది కథ.
విశ్లేషణ: (Oka Pathakam Prakaaram Review)
మర్డర్ మిస్టరీ, సస్పెన్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ తరహా చిత్రాలు తెరకెక్కించడంలో మలయాళ దర్శకులు దిట్ట. ఎక్కడా గ్రిప్పింగ్ మిస్ కాకుండా ఒక ఫ్లోలో తీసుకెళ్తారు. అలా మలయాళ దర్శకుడు తెలుగులో తీసిన సినిమా ఇది. నిజాయతీగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేసే ఓ సాధారణ యువకుడి కథ ఇది. ఓ కేసు వాదించి నిందితుడికి శిక్ష పడేలా చేయడంతో అతనిపై పగ పెంచుకుని కక్ష తీర్చుకోవాలనుకోవడంలో భాగంగా హీరోని కష్టాలపాలు చేస్తారు. ఎవరు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు అనేది తెలియకుండా కథను తీసుకెళ్లిన విధానం బావుంది. కథ ప్రారంభం, అది అసలు ట్రాక్‌లోకి వెళ్లడానికి చాలా టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్ ప్రేక్షకుడికి కనెక్ట్ కావడానికి కాస్త సమయం పడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ప్రేక్షకుడు ఈజీగా కనెక్ట్ అవుతాడు. సినిమా ఇంటర్వెల్‌లోనే విలన్ ఎవరో కనిపెట్టండి.. పది వేలు పట్టుకోండి అంటూ ఆఫర్ పెట్టారీ చిత్ర బృందం. అంటే అది ఊహించడం కష్టమని దర్శకుడు చాలా నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది. నిజంగానే వరుస హత్యలు జరుగుతున్న తరుణంలో అసలు హత్యలు చేసేది ఎవరనేది కొంచెం కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు దర్శకుడు. స్ర్కీన్ ప్లే కూడా అంత పకడ్భందీగా రాసుకున్నాడు. వరుస మర్డర్లు, హత్య జరిగిన ప్రతి చోట నిందితుడు ఇచ్చిన క్లూస్, దానిపై హీరో, శ్రుతీ సోడి చేసే ఇన్వెస్టిగేషన్ చకచకా నడిచిపోతుంది. ప్రీ క్లైమాక్స్ వరకూ కూడా విలన్ ఎవరై ఉంటారనే ఆలోచన మదిలో మెదులుతూనే ఉంటుంది. ఫైనల్‌గా హీరోనే ఆ హత్యలకు కారకుడు ఎవరనేది తెలుసుకుంటాడు. అదంతా కూడా చాలా గ్రిపింగ్‌గా సాగుతుంది. సస్పెన్స్ మెయింటెన్ చేయడంలోనే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కథ మాత్రం ఒకే దగ్గర నడుస్తున్న భావన కలుగుతుంది. పలు సన్నివేశాల్లో లాజిక్‌లను గాలికి వదిలేశారు.
నటీనటులు విషయానికొస్తే 'డేంజర్’ సినిమా తర్వాత అల్లరి కుర్రాడిగా, లవర్‌బాయ్‌గా సినిమాలు చేసిన సాయికి ఇది కొత్త జానర్ సినిమా. తన వరకూ నిజాయతీగా సినిమా చేశారు. హిట్ కొట్టాలనే తపన ఈ సినిమాలో కనిపించింది. యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్నింట్లో తనదైన మార్క్ చూపించాడు. హీరోయిన్లు శ్రుతి సోది, ఆషిమా నర్వాల్ పాత్రలు ఫర్వాలేదనపించాయి. సముద్రఖని పాత్ర నవ్విస్తుంది. కానీ ఆ పాత్రకు ఉత్తరాంధ్ర స్లాంగ్ సెట్ కాలేదు. డబ్బింగ్ సూట్ కాలేదు. కళాభవన్ మణి, పిచ్చ కొట్టుడు సుధాకర్ పాత్రలు చూస్తే ఇది చాలా కాలం క్రితం తీసిన సినిమాలా అనిపిస్తుంది. అయితే వాళ్లు తెరపై కనిపించినప్పుడు మాత్రమే అలా అనిపిస్తుంది. మిగతా పాత్రధారులు పరిధి మేరకు చేశారు. కెమెరా పనితనం బావుంది. ఫస్టాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే సినిమా ఇంకాస్త గ్రిపింగ్‌గా ఉండేది. రాహుల్ రాజ్ పాటలు, గోపీసుందర్ ఆర్‌ఆర్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ చిత్రాలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి ఈ సినిమా కొత్తగా, అంత ఆకట్టుకునేలా ఉండదు. అప్పుడప్పుడు థ్రిల్లర్ జానర్ చిత్రాలను చూసే వారికి మాత్రం పక్కాగా నచ్చుతుంది. మరీ రొటీన్ సినిమా చూశాం అనే భావన కలిగించకుండా కథను నడపడం టీం సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఇందులో అసలు విలన్ ఎవరో చెప్పేస్తే కిక్ ఉండదు. అది తెరపై చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేయగలరు. సాయిరామ్ శంకర్ కొంతలో కొంత కమ్‌బ్యాక్ సినిమా అనుకోవచ్చు. (Oka Pathakam Prakaaram Review)
ట్యాగ్‌లైన్: పథకం ప్రకారమే థ్రిల్ చేశారు...