Rekhachitram Ott Review: రేఖా చిత్రం

ABN , Publish Date - Mar 07 , 2025 | 09:25 PM

2021లో మమ్ముట్టి (Mammootty) తో 'ది ప్రీస్ట్' (The Priest) చిత్రాన్ని తెరకెక్కించిన జోఫిన్ టి చాకో (Jofin T Chacho) తెరకెక్కించిన తాజా చిత్రం 'రేఖాచిత్రం' (Rekhachitram). అసీఫ్ అలీ (Asif Ali) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా జనవరి 9న మలయాళంలో విడుదలై యాభై కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది.

ఓటీటీ  రివ్యూ: రేఖా చిత్రం (Rekhachithram Review)

విడుదల తేదీ: 7-3-2025

నటీనటులు: అసీఫ్ అలీ, అనస్వర రాజన్, మనోజ్ కె. జయన్, సిద్ధిక్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్, ఇంద్రాన్స్, సలీమా, మమ్ముట్టి (అతిథి పాత్రలో), జగదీశ్‌ (అతిథి పాత్రలో)

సాంకేతిక నిపుణులు

కథ: రాము సునీల్

స్క్రీన్ ప్లే: జాన్ మంత్రికాల్, రాము సునీల్

సినిమాటోగ్రఫీ: అప్పు ప్రభాకర్

సంగీతం: ముజీబ్ మజీద్

ఎడిటింగ్: షమీర్ ముహమ్మద్

నిర్మాత: వేణు కున్నప్పిళ్ళై

దర్శకత్వం: జోఫిన్ టి చాకో

2021లో మమ్ముట్టి (Mammootty) తో 'ది ప్రీస్ట్' (The Priest) చిత్రాన్ని తెరకెక్కించిన జోఫిన్ టి చాకో (Jofin T Chacho) తెరకెక్కించిన తాజా చిత్రం 'రేఖాచిత్రం' (Rekhachitram). అసీఫ్ అలీ (Asif Ali) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా జనవరి 9న మలయాళంలో విడుదలై యాభై కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. తాజాగా మార్చి 7 నుండి సోనీ లివ్ ఓటీటీలో వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Story:

ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన కారణంగా వివేక్ గోపీనాథ్‌ (అసీఫ్ అలీ) సస్పెండ్ అవుతాడు. అయితే అతనిలోని నిజాయితీని గుర్తించి, తిరిగి డ్యూటీలోకి తీసుకుంటారు. చిత్రం ఏమంటే... అతను డ్యూటీలో చేరిన రోజునే ఓ కేసు అతని ముందుకు వస్తుంది. రాజేంద్రన్ (సిద్ధిక్) అనే వ్యక్తి ఓ అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్ బుక్ లైవ్ చేస్తాడు. తాను చనిపోయిన చోటే... ఓ యువతి శవం ఉందని, ఆమె మరణం తమని వెంటాడుతోందని చెబుతాడు. అంతేకాదు... ఆ రోజున ఆ యువతి శవాన్ని పూడ్చిపెట్టడంలో తనకు సహకరించిన వ్యక్తుల పేర్లు కూడా తెలియచేస్తాడు. ఈ కేసు వివేక్ చేతిలోకి రావడంతో అతను ఆ ప్రదేశంలో త్రవ్వకాలు మొదలు పెడతాడు. రాజేంద్రన్ చెప్పినట్టుగానే అక్కడో అస్తిపంజరం లభిస్తుంది. అది అమ్మాయిదని తెలుస్తోంది. రాజేంద్రన్ చెప్పిన దానిలో నిజం ఉండటంతో... ఆ అస్తిపంజరం ఎవరిది, ఆమెను అక్కడ ఎందుకు పాతిపెట్టారు? మమ్ముటి అభిమాని అయిన రేఖ అనే ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం అసలు ఎవరికి, ఎందుకు కలిగిందనేదే ఈ చిత్ర కథ.


విశ్లేషణ: (Rekhachithram Review)

నిజానికి ఇదో మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. దాదాపు నలభై యేళ్ళ క్రితం చనిపోయిన ఓ అమ్మాయికి సంబంధించిన ఆచూకీని వెలికితీసి, దానికి కారకులను పట్టుకునే కథ. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ మూవీస్ వివిధ భాషల్లో బోలెడన్ని వచ్చాయి. అయితే కథ రచయిత రాము సునీల్ ఈ పాయింట్ ను ఒక సినిమా షూటింగ్ తో ముడిపెట్టడంతో ఆద్యంతం ఆసక్తికరంగా మారిపోయింది. ఆ సినిమా 1985లో వచ్చిన మమ్ముట్టి నటించిన 'కాతోడు కాతోరం'. భరతన్ దీనిని డైరెక్ట్ చేశారు. సినిమా నటి కావాలని కన్యాకుమారి నుండి వచ్చిన రేఖ అనే అమ్మాయి షూటింగ్ లో ఓ రోజు పాల్గొని ఆ తర్వాత కనిపించకుండా పోతుంది. దాంతో ఆమె వివరాల కోసం అప్పటి సినిమా వాళ్ళను వరుసగా వివేక్ ఆరాలు తీసి... ఒక్కో విషయాన్ని రాబట్టడం మొదలు పెడతాడు. ఈ సన్నివేశాలన్నీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

నిజానికి ఆ సినిమాను డైరెక్ట్ చేసిన భరతన్ ఇప్పుడు మన మధ్య లేరు. దాంతో ఆయన అసిస్టెంట్ గా వర్క్ చేసిన కమాల్ ను, ఆ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చిన జాన్ పాల్ ను, అప్పటి నటుడైన జగదీశ్ ను వివేక్ కలిసినట్టుగా చూపించారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అప్పటి జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ను, అప్పటి ఫిల్మ్ జర్నలిస్ట్ ను వివేక్ కలిసి కీలక అంశాలు రాబట్టినట్టు ఇందులో చూపించారు. బట్... ఆ సినిమాలో హీరోగా నటించిన మమ్ముట్టినీ వివేక్ ఒక్కసారి ఈ కేసు విషయంలో కలిసినట్టు చూపించకపోవడం ప్రధానమైన లోపం. విశేషం ఏమంటే... కథలో భాగంగానే మమ్ముట్టిని ఏ.ఐ. సాయంతో ఓ చోట, అతిథి పాత్రలో మరో చోట ఈ సినిమాలో చూపించారు. కానీ ప్రస్తుతం జరగుతున్న ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఆయనను చూపించలేదు. ఎప్పుడో నలభై యేళ్ళ క్రితం వచ్చిన మమ్ముట్టి సినిమాను నేపథ్యంగా తీసుకుని ఓ మర్డర్ మిస్టరీని మలచడం అనేది అందరికీ కొత్తగా అనిపిస్తుంది. పైగా అప్పటి సినిమా వాళ్లు ఇవాళ ఈ సినిమాలో తెర మీద కనిపిస్తే ఆనందమూ కలుగుతుంది. అందుకే మలయాళీలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారనుకోవచ్చు. అయితే ఇతర భాషల వాళ్ళు దీనిని ఏ తీరున రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం ఉండి కావచ్చు... డబ్ చేసి థియేట్రికల్ రిలీజ్ కు పోకుండా ఓటీటీ కే పరిమితం అయ్యారు. మర్డర్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడే వారికి 'రేఖాచిత్రం' ఖచ్చితంగా నచ్చుతుంది. అసీఫ్ అలీ తన పాత్రను చాలా సమర్థవంతంగా పోషించాడు. అలానే రేఖ పాత్రకు అనస్వర రాజన్ న్యాయం చేసింది. 'సరిగమలు'తో తెలుగువారికి పరిచయమైన మలయాళీ నటుడు మనోజ్ కె జయన్ ఇందులో విన్సెంట్ గా కీలక పాత్రను పోషించాడు. పుష్పంగా జరీన్ షిహాబ్ బాగా చేసింది. నటీనటులు తెలుగువారికి అంతగా సుపరిచితులు కాకపోయినా... కథాగమనం చకచకా సాగిపోవడంతో ఆ లోటు కనిపించదు. సాంకేతిక నిపుణుల పనితనం కూడా చెప్పుకోదగ్గది. 'రేఖాచిత్రం' చూసిన తర్వాత జోఫిన్ టి చాకో నుండి మరో చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం ఖాయం.

Tagline: అద్భుత 'రేఖాచిత్రం'

Updated Date - Mar 07 , 2025 | 09:35 PM