Ramayana Review: జపనీస్‌ యానిమేషన్‌ 'రామాయణం' ఎలా ఉందంటే...

ABN , Publish Date - Jan 24 , 2025 | 06:18 PM

జపనీస్‌ వాళ్లు మన భారతీయులతో కలిసి వాల్మీకి రామాయణం ఆధారంగా రామాయణ్‌: ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామా’ పేరుతో ఓ యానిమేషన్‌ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లోనే ఈ సినిమా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. ఇన్నేళ తర్వాత ఇంగ్లిష్‌తోపాటు భారతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళ,భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

సినిమా రివ్యూ: రామాయణ: ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామా
ఆధారం: వాల్మీకి రామాయణం (జపనీస్‌ యానిమేషన్‌ సినిమా)
విడుదల తేది: 24–01–2025
స్ర్కీన్‌ప్లే: నరేంద్ర శర్మ
సంగీతం: వన్‌రాజ్‌ భట్ల
నిర్మాతలు: కోయిచి ససాకీ, కేంజీ యోషిల్‌, యుగో సాకో
దర్శకత్వం: కోయిచి ససాకీ, రామ్మోహన్‌, యుగో సాకో (Ramayana: The Legend of Prince Rama)


రామాయణం ఇతిహాసం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భారతీయ వెండితెర, బుల్లితెరపై ఇప్పటికే సినిమాలు, సీరియళ్ల రూపంలో అలరించింది రామాయణం. అయితే అన్నింటికీ మూలం వాల్మీకి, వేదవ్యాసుడు, తులసీదాస్‌ కంబ రామాయణం ఆధారంగానే తెరకెక్కినవి. ఏడు కాండాలు ఉన్న రామాయణాన్ని మేకర్స్‌ నిడివి కొద్దీ కట్టే.. కొట్టే తెచ్చే అన్నట్లు చూపించారు. బాలకాండ నుంచి యుద్ద కాండ, ఉత్తరకాండ వరకూ ఎవరు తెరపై చూపించాలనుకున్నా అదే రీతిన తెరకెక్కించాల్సిందే. 1993లో ఏళ్ల క్రితం  జపనీస్‌ వాళ్లు మన భారతీయులతో కలిసి వాల్మీకి రామాయణం ఆధారంగా రామాయణ్‌: ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామా’ పేరుతో ఓ యానిమేషన్‌ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లోనే ఈ సినిమా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. ఇన్నేళ తర్వాత ఇంగ్లిష్‌తోపాటు భారతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళ,భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మరీ యానిమేషన్‌ రామాయణం ఎలా ఉందో చూద్దాం.


కథ: (Ramayana: The Legend of Prince Rama Review)
కోసల రాజ్యానికి రాజైన దశరథ మహారాజు పిల్లలు జన్మించడం నుంచి విద్యాభ్యాసం, సీతాపరిణయం. అరణ్యావాసం, సీతాదేవిని రావణుడు అపహరించడం, యుద్ధకాండం సీతారాములు అయోధ్యకు తిరిగి రావడం మొదలగు అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో టీవీలు, వెండితెరపై చూసిన మాదిరిగానే ఏడు కాండలను రెండు గంటల నిడివిలో యానిమేషన్‌లో రెండు గంటల్లో చెప్పే ప్రయత్నం చేశారు.

Ramayana-2.jpg


విశ్లేషణ
రాముఢి జననం, బాల్యం గురించి  వాయిస్‌ ఓవర్‌లో చెప్పి, ఆయనకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కథను ప్రారంభించారు. రామాయణం గురించి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. ఈ యానిమేషన్‌ సినిమాలో ఏం చెప్పారు .. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే టెక్నాలజీని ఉపయోగించి కార్టూన్‌ వర్క్‌ పరంగా ఈ సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దారు. క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గకుండా.. చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. అయితే రెండు గంటలే నిడివి కావడంతో రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాలను తొలగించి కట్టే.. కొట్టే.. తెచ్చే అన్నట్లు రూపొందించారు. అయితే తెలుగు డబ్బింగ్‌, డైలాగ్స్‌ విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే.. నిజంగానే కార్టూన్‌ వెర్షన్‌లో మాస్టర్‌ పీస్‌ అయి ఉండేదనిపించింది. రాముడి ఎంట్రీతోపాటు హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్‌, ఆయన సాహసాలను యానిమేషన్‌లో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది యానియేషన్‌ సినిమానే అయినా మామూలు సినిమా చూసిన భావన కలిగేలా తెరకెక్కించారు. టెక్నికల్‌గా సినిమా హైలో ఉంది. మోషన్‌ పిక్చర్‌ క్యాప్చర్‌ వర్క్‌ బాగుంది. యుద్ద సన్నివేశాల్లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోరు ఎసెట్‌గా మారింది. ఈ సినిమా కోసం సుమారుగా 450 మంది ఆర్టిస్టులు పనిచేయగా.. లక్షకుపైగా హ్యాండ్‌ డ్రాయింగ్స్‌ను చిత్రించారు. 1993లో తీసినా ఈ సినిమాను ఇప్పుడు 4కె రిజల్యూషన్‌లో డిజిటలైజ్‌ చేసి విడుదల చేశారు.  (Ramayana: The Legend of Prince Rama)


అయితే ఈ తరానికి రామాయణం అంటే ఏంటో తెలుసా అంటే తెల్లమొహాలేసి చూస్తారు. నూటికి ఓ పది మంది తమ పిల్లలకు రామాయణ, మహాభారతంలాంటి ఇతిహాసాలు గురించి చెబుతుంటారు. మిగిలిన వారంతా ఇలాంటి చరిత్రను తెలుసుకోవడంలో శూన్యమనే చెప్పాలి. కనీసం ఇలాంటి యానిమేషన్‌ చిత్రాల ద్వారా అయిన మన కావ్యాలను, ఇతిహాసాలు, పురాణాలను చెప్పడం ద్వారా మన సంస్కృతిని ముందు తరాల వారికి అందించిన వారమవుతాము. నిరంతరం ఫోన్‌లు, ట్యాబ్‌లతో గడిపే ఈ తరం పిల్లల్లు ఇలాంటి యానిమేషన్‌ సినిమాలు చూడటం వల్ల అయినా రామాయణం లాంటి కథలు తెలుస్తాయి. చరిత్ర, ఇతిహాసాలపై కాస్త అయినా అవగాహన కలుగుతుంది. జపనీస్‌ టీమ్‌ చేసిన ఈ ప్రయత్నం ఈతరం పిల్లలు తప్పకుండా నచ్చుతుంది.

ట్యాగ్‌లైన్‌: ఈ జనరేషన్‌కు అవసరం..

Updated Date - Jan 25 , 2025 | 04:39 PM