Court Review: ప్రియదర్శి కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉందంటే..
ABN , Publish Date - Mar 13 , 2025 | 07:05 AM
నూతన దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కోర్టు :స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి పెయిడ్ ప్రీమియర్లు వేశారు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది ? లాయర్‌గా ప్రియదర్శి క్యారెక్టర్ ఎలా ఉంది.
సినిమా రివ్యూ: కోర్ట్ (Court movie review)
విడుదల తేదీ: 14-3-2025 (12-3-2025-పెయిడ్ ప్రీమియర్)
నటీనటులు: శివాజీ, ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్లా, వడ్లమాని సాయి శ్రీనివాస్,, శుభలేఖ సుధాకర్, రోహిణి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ :దినేష్ పురుషోత్తమన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
సమర్పణ: హీరో నాని
దర్శకుడు: రామ్ జగదీష్ (Ram Jagadeesh)
"ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ సినిమా తప్పకుండా చూడండి’ అని ఎవర్నీ అడిగింది లేదు.. మొదటిసారి అడుగుతున్నా కోర్ట్ సినిమా చూడమని. ఎందుకంటే ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు మిస్ కాకూడదని. ఒకవేళ సినిమా చూసి నచ్చకపోతే.. రెండు నెలల్లో రాబోతున్న నా 'హిట్–3’ సినిమా ఎవరూ చూడొద్దు’ ఇటీవల జరిగిన కోర్ట్ సినిమా ప్రీ రిలీజ్ వేదికగా నేచురల్ స్టార్ నాని విసిరిన సవాల్ ఇది. నాని ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడేంటని చాలామంది ఆలోచనలో పడ్డారు. నిర్మాతగా తన ప్రాడక్ట్‌పై ఉన్న నమ్మకం అని కొందరు అనుకున్నారు. నూతన దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కోర్టు :స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి పెయిడ్ ప్రీమియర్లు వేశారు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది ? లాయర్‌గా ప్రియదర్శి క్యారెక్టర్ ఎలా ఉంది. నాని సినిమాపై పెట్టుకున్న నమ్మకం నిజమైందా? అన్నది రివ్యూలో చూద్దాం. (Priya darshi)
కథ: (court movie review)
మెట్టు చంద్రశేఖర్ అలియాస్ చందు (హార్ష్ రోషన్) ఇంటర్ ఫెయిల్ అయిన 19 ఏళ్ల కుర్రాడు. అతని తండ్రి వాచ్‌మేన్. సాధారణ కుటుంబానికి చెందిన చందు ఖాళీగా ఉండటం ఇష్టం లేక డబ్బుల కోసం సెల్ ఫోన్ సెల్లింగ్, బార్‌లో బాయ్‌గా ఇలా ఏదో ఒక పనితో బిజీ ఉంటూ తన డబ్బు తాను సంపాదించుకుంటాడు. అతని మాటలు, చలాకీతనాన్ని గమనించిన ఇంటర్ చదివే మైనర్ అమ్మాయి జాబిలి (శ్రీదేవి)తో అతని ఫోన్ నంబర్ తీసుకుని మాటలు మొదలుపెడుతుంది. క్రమేణా అది ప్రేమగా మారుతుంది. ఈ విషయం తెలిసి కులం, పరువు, ప్రతిష్ట అంటూ ఇదే ఆలోచనలతో ఉండే మంగాపతి (శివాజీ) తమ ఇంటి పరువుగా భావించే అమ్మాయిని జాబిలిని బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేశాడని చందూపై పోక్సో కేసు పెట్టిస్తాడు. జాబిలిని చందూ అలియాస్ చంద్రశేఖర్ నిజంగా రేప్ చేశాడా? బెయిల్ కూడా రాకుండా అతని మీద పోక్సో పెట్టించిన లాయర్ దాము (హర్షవర్థన్) కోర్టులో ఎలా వాదించారు? ఈ కేస్‌ను టేకప్ చేయడానికి ఏ లాయరు ముందుకురాని తరుణంలో మోహన్‌రావు (సాయికుమార్)దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న సూర్యతేజ (ప్రియదర్శి) ఈ కేస్ టేకప్ చేసి ఎలా ముందుకెళ్లాడు. కోర్ట్‌లో జరిగిన వార్ ఏంటి? ఫైనల్‌గా చందుకి న్యాయం జరిగిందా? లేదా అన్నది కథ. (Cinema Review)
విశ్లేషణ:
పోక్సో చట్టం.. ఏడాది కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోన్న మాట. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా పోక్సో చట్టం గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసింది. అయితే ఆ చట్టం గురించి పూర్తి అవగాహన కొందదరి మాత్రమే ఉంది. ఆ చట్టం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. పోక్సో చట్టం నేపథ్యంలో కేసు నమోదు అయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి. ఆ కేసు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? లేదా అన్న నేపథ్యంలో సాగే చిత్రమిది. కులం, పరపతి, పరువు కోసం పాకులాడే కొందరు కింది స్థాయివారితో ఎలా ప్రవర్తిస్తారు? తమ ఇగో కోసం ఇరవై ఏళ్లు నిండని ఒక కుర్రాడి భవిష్యత్తును ఓ వ్యక్తి నాశనం చేయాలనుకుంటే ఆ కుర్రాడి భవిష్యత్తును ఓ యువ న్యాయవాది ఎలా కాపాడాడు అనేది సినిమా ఇతివృత్తం. ప్రథమార్థం అంతా టీనేజ్ లవ్‌స్టోరీతో సోసోగా సాగింది. అంతకు మించి టీనేజ్ లవ్‌ను చెప్పలేం అన్నట్లు ఉంది. చందుపై పెట్టిన కేసు, న్యాయం కోసం తిరిగే స్నేహితులు... అదంతా కాస్త కాలయాపన ఉన్నా.. సూర్య తేజ (ప్రియదర్శి) కేస్ టేకప్ చేసిన దగ్గరి నుంచి సినిమాపై ఆసక్తి పెరిగింది. కోర్ట్ రూమ్ డ్రామా అంతా ఆసక్తిగా సాగింది. వాదన జరుగుతున్నంత సేపు లా, లాజిక్ ఇలాంటివి ఏమీ గుర్తు రావు. కేవలం కథలో మాత్రమే లీనమయ్యేలా ఉంది. దర్శకుడు రామ్ జగదీష్ ఎంచుకున్న పాయింట్ మంచిది. తెరకెక్కించిన తీరు బాగానే ఉంది. కానీ స్టార్టింగ్ నుంచి చివరి వరకూ ముందు ఏం జరగబోతుంది అన్నది ఊహించేలా ఉంది. స్ర్కీన్‌ప్లే సోసోగా ఉండటం వల్ల వచ్చిన సమస్య అది. శివాజీ పాత్ర ఎంటర్ అయిన తర్వాత అతని నటన చూశాక.. అప్పటిదాకా జరిగిన పొరపాట్లు కనిపించవు. అప్పటిదాకా ముందు సన్నివేశం ఏంటో ఊహించేలా ఉన్నా.. కోర్టులో ఒక వీడియో ప్రవేశ పెట్టడం నుంచి కథ మలుపు తిరిగింది. అది ఊహించనిది. కోర్టు రూమ్‌లో జరిగే వార్, అక్కడి పాత్రలు, డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఆసక్తికరంగా సాగాయి. ప్రతి ప్రేక్షకుడికి భావోద్వేగాలు కలిగించాడు దర్శకుడు. శివాజీ తెరపై కనిపించిన ప్రతిసారీ ఆ పాత్రపై కోపం కలుగుతుంది. ఆయన కారణంగా, ఓ వ్యక్తి పరువు, ఇగో కోసం జైల్ పాలైన కుర్రాడు శిక్ష నుంచి బయటకు రావాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటాడు. అక్కడ ప్రేక్షకుల మనసు గెలిచేశాడు దర్శకుడు. పాత్రలతో బాండింగ్ కుదిరేలా చేశాడు. క్లైమాక్స్‌లో పోక్సో చట్టం గురించి ప్రియదర్శి చెప్పే మాటలు సైతం ఆలోచన కలిగిస్తాయి. చట్టం మీద అవగాహన కలిగించడమే కాకుండా.. చక్కని కోర్టు రూమ్ డ్రామా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. టీనేజ్‌లో ప్రేమికులకు ఎదురయ్యే కష్టాలు, పేదలకు న్యాయం జరగడం లేదనే కోణం, న్యాయవ్యవస్థలో లూప్ హోల్స్‌ను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక నటీనటులు విషయానికొస్తే. ప్రియదర్శి మరోసారి చక్కని నటన కనబర్చారు. క్యారెక్టర్ పరిధి దాటి.. అంటే పాత్రను మరింత మెరుగుపరిచేలా యాక్ట్ చేశాడు. అల్లరిగా, కామెడీగా అలరించే ప్రియదర్శికి కొత్త పాత్ర ఇది. మంచి మార్కులే కొట్టేశాడు, హర్ష్ రోషన్, శ్రీదేవి జంట బావుంది. చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ మంచి నటన కనబరిచారు. వాళ్ల క్యాస్టూమ్స్ సహజంగా ఉన్నాయి. పాత్రలూ అంతే. పెద్దగా మాటలు లేని పాత్రను రోహిణి ఎందుకు చేశారనే భావన కలుగుతున్న తరుణంలో వాటిని కొట్టిపడేసేలా క్లైమాక్స్‌లో ఆమె పాత్ర ఉంటుంది. అయితే ఆమెకు తగిన పాత్ర కాదిది. కానీ ఆ పాత్ర ఆమె చేయడం వల్ల హుందాతనం వచ్చింది. లాయర్‌గా హర్షవర్థన్ పాత్ర బావుంది. వడ్లమాని శ్రీనివాస్, సురభి ప్రభావతి పాత్రలకు న్యాయం చేశారు. నెగటివ్ షేడున్న పాత్రలో శివాజీ చక్కగా నటించారు. అక్కడక్కడా అతిగా అనిపించినా క్లైమాక్స్‌లో బ్యాలెన్స్ చేశారు. ‘90స్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ తర్వాత ఆయన ఫామ్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాలో విలనీ కూడా బాగా చేశాడు. పాత్ర మీద కోపం వచ్చేలా చేశాడంటే ఆ పాత్రకు ప్రాణం పోసినట్టే. సాయి కుమార్ పాత్ర హుందాగా ఉంది
ఇక టెక్నికల్ విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్. కెమెరా వర్క్ బావుంది. కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ కలిగించింది. చందూ పాత్రకు బెయిల్ రిజెక్షన్ వంటి సన్నివేశాలు కాస్త సాగదీతగా ఉన్నాయి. ఎడిటర్ కాస్త కత్తెర వేసుంటే క్రిస్ప్‌గా ఉండేది. చిత్ర సమర్పకులు నాని, నిర్మాత ప్రశాంతి తిపిర్నేని నిర్మాణ విలువలు కథకు తగ్గస్థాయిలో ఉన్నాయి. వినోదం పంచడం కోసం, కమర్షియల్ యాంగిల్‌లో కొన్ని సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ తరహా కథలు రేర్‌గా వస్తుంటాయి. సమాజంపై బాధ్యత ఉన్న మేకర్స్ మాత్రమే ఈ తరహా సినిమాలు తీయగలరు. పోక్సో చట్టం అంటే ఏంటి? అన్నది చెప్పడంతోపాటు దానిపై ఎంతో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కోర్ట్ రూమ్ డ్రామా మనసుల్ని కదిలించింది. చదువుతో పాటు చట్టం కూడా తెలిసి ఉండాలి అనే చక్కని సందేశం ఇచ్చారు. 18 ఏళ్లు నిండటానికి ఒక ఘడియ ముందు, ఘడియా తర్వాల చట్టంలో ఎంత మార్పు ఉంది అనేది క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారు, సినిమా అంటే భారీ అంచనాలు పెట్టుకునే వారికి ఈ సినిమా ఎక్కకపోవచ్చు. కానీ.. సోసైటీలో ఓ మనిషి, అతనికి వచ్చిన కష్టం, న్యాయం జరగాలి, సమస్యకు పరిష్కారం దొరకాలి అని ఆలోచించే మనసున్న అందరికీ తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది. చదువుతోపాటు చట్టం కూడా తెలియాలి అనే పాయింట్ సగటు ప్రేక్షకుడిని ఆలోచించేలా చేసింది. సినిమాపై నాని నమ్మకం నిజం అయింది. రెండు నెలల్లో విడుదలయ్యే హిట్ -3 సినిమాను అందరు చూసేయొచ్చు.
ట్యాగ్‌లైన్: పర్పస్‌ఫుల్ కోర్ట్ డ్రామా