Pravinkoodu Shappu : ప్రవింకూడు షప్పు రివ్యూ (ఓటీటీ: సోనీ లివ్)
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:54 PM
బాసిల్ జోసెఫ్ నటించిన సినిమాలంటే తెలుగువారికీ క్రేజ్. అందుకే మలయాళ చిత్రాలైనా ఓటీటీలో వస్తే చాలు అతనివి చూసేస్తున్నారు. మరి అలా సోనీ లివ్ లో వచ్చిన ‘ప్రవింకూడు షప్పు’ ఎలా ఉందో తెలుసుకుందాం.
మలయాళ చిత్ర సీమలో ఓటీటీ (Ott) మూవీస్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో బాసిల్ జోసెఫ్ (Basil Joseph) తను నటించిన సినిమా అంటే ఎలాంటి సందేహం లేకుండా చూసేస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. అది తెలుగులో ఉన్నా, మలయాళంలో ఉన్నా వదలటం లేదు. అలా వచ్చిన తాజా చిత్రమే ‘ప్రవింకూడు షప్పు’ (Pravinkoodu Shappu). జనవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. అది ఇప్పుడు ఓటీటీలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బాసిల్ జోసెఫ్ తో పాటు ‘మంజుమ్మేల్ బాయ్స్’ తో పాపులరైన సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కూడా కీలక పాత్ర పోషించాడు. ఇతర పాత్రలలో చెంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్, శివాజిత్, శబరీష్ వర్మ, నియాస్ అబూబెకర్, జోసెఫ్ తదితరులు నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…
కథ విషయానికి వస్తే…
ఓ గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడ ఓ కల్లు దుకాణం ఉంటుంది. దాని యజమాని కొంబన్ బాబు (శివజిత్). అక్కడ కొంత మంది కొబ్బరిచెట్లనుంచి తీసిన కల్లు తాగుతూ, పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఓ రాత్రి పదకొండు మంది అక్కడ తాగుతూ, పేక ఆడుతూ గొడవపడి కొట్టుకుంటారు. ఆ తర్వాత చూస్తే దుకాణ యజమాని కొంబన్ దుకాణంలో వేలాడుతూ కనిపిస్తాడు. దాంతో పోలీసుల ఎంక్వయిరీ మొదలవుతుంది. ఎస్.ఐ. సంతోష్ (బాసిల్ జోసెఫ్) చేసిన దర్యాప్తులో కొన్ని చీకటి కోణాలు బయటపడతాయి. ఆ ఆత్మహత్యకు మెజిషియన్ కన్నన్ (సౌబిన్ షాహిర్), ఆయన భార్య మెరిండా (చాందినీ శ్రీధరన్), రిటైర్డ్ మిలట్రీ మేన్ సుని (చెంబన్ వినోద్ జోస్) కు ఉన్న సంబంధం ఏమిటి? ఎస్.ఐ. సంతోష్ ఎలా ఆ ఆత్మహత్యను మర్డర్ గా నిరూపిస్తాడు? నిజంగా అది ఆత్మహత్యా? లేక హత్యా? అనేదే ఈ సినిమా.
విశ్లేషణ…
ఈ సినిమాకు శ్రీరాజ్ శ్రీనివాసన్ తొలిసారి దర్శకత్వం వహించాడు. ఎక్కువ భాగం రాత్రి పూట జరిగే కథ. చిన్నపాయింట్ తీసుకుని మర్డర్ మిస్టరీగా దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ తీసినా దానిని ఆసక్తిగా మలచలేకపోయాడు. కథనాన్ని పదే పదే రివర్స్ స్క్రీన్ ప్లే తో నడిపాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో బ్లాక్ కామెడీ కూడా మిళితమై ఉంటుంది. ఓ అనుమానాస్పద మరణం, కొంతమంది అనుమానితులు, వారందరి బ్యాక్ గ్రౌండ్ ను విశ్లేషించుకుంటూ ఎస్.ఐ. చేసే ఇన్వెస్టిగేషన్ ఇది. దీంతో రెండున్నర గంటల పాటు ఎంగేజ్ చేయటం మాటలు కాదు. ఆ విషయంలో కొంత వరకూ మాత్రమే సఫలం అయ్యాడు దర్శకుడు శ్రీరాజ్ శీనివాసన్. బాసిల్ జోసెఫ్ పాత్రకు పెట్టిన ప్లాష్ బ్యాక్ ను సరిగ్గా ఎష్టాబ్లిష్ చేయలేక పోవడం ఇందులో పెద్ద మైనస్. ఏది ఏమైనా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ‘ప్రవింకూడు షప్పు’ను ఓసారి చూడవచ్చు.
ట్యాగ్ లైన్: ఆకట్టుకోని ఇన్వెస్టిగేషన్
రేటింగ్ 2.25/5
Also Read: Charu Asopa: నటనకు స్వస్తి పలకలేదట...
Also Read: Sriwass: రవితేజ ప్రాజెక్ట్ సందీప్ కిషన్ కిట్ లోకి...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి