Perusu Review: పెరుసు మూవీ రివ్యూ (ఓటీటీ స్ట్రీమింగ్)
ABN , Publish Date - Apr 11 , 2025 | 07:04 PM
ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి ఇద్దరు కుమారులు సునీల్, వైభవ్ నటించిన తమిళ చిత్రం 'పెరుసు'. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం...
ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి (A. Kodandarami Reddy) కుమారుడు వైభవ్ (Vaibhav) ‘గొడవ’తో హీరోగా పరిచయమై ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి పేరు తెచ్చుకున్నాడు. అయితే తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా మూవీస్ చేస్తూ కోలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. విశేషం ఏమంటే వైభవ్ అన్న సునీల్ రెడ్డి (Sunil Reddy) కూడా నటుడే. పలు సినిమాలలో కీలక పాత్రల్లో మెరిసిన సునీల్ కి 'జైలర్' (Jailer) సినిమాలో పాత్ర ఎంతగానో పేరు తెచ్చింది. తాజాగా వీరిద్దరూ కలసి ఓ తమిళ చిత్రంలో నటించారు. అదే 'పెరుసు' (Perusu). మార్చి 15న తమిళనాట థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘పెరుసు’ ఎలా ఎంటర్ టైన్ చేస్తుందో చూద్దాం….
సామి (సునీల్ రెడ్డి) ఓ ఎలిమెంటిరీ స్కూల్ టీచర్. అతని తమ్ముడు దురై (వైభవ్). ఓ రోజు హఠాత్తుగా వారి తండ్రి మరణిస్తాడు. అయితే చనిపోయిన తండ్రి అంగం స్థంభించి ఉండటం చూసి వారిద్దరితో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ పడ్డ అగచాట్లే ఈ 'పెరుసు' సినిమా కథాంశం.
లైన్ వినగానూ, కొంచెం అశ్లీలంగానూ ఉంటుందేమో అనిపిస్తుంది కానీ సినిమా మాత్రం అలా ఉండదు. ఆ పెద్దాయన పరువు గంగలో కలసి పోకుండా ఉండటానికి ఆ అన్నదమ్ములిద్దరితో పాటు వారి స్నేహితులు, సన్నిహితులు ఎలా ప్రయత్నించారనేది వినోదాత్మకంగా చూపించారు. ఆటోశంకర్ గా నటించిన రెడిన్ కింగ్స్ లే, డాక్టర్ గా నటించిన విటి గణేశ్, సామి, దురై మేనమామ పాత్రలో కనిపించిన మునీశ్ కాంత్, ఫ్రీజ్ బాక్స్ ఓనర్ గా నటించిన కరుణాకరన్ పండించిన కామెడీకి కడుపుబ్బ నవ్వకుండా ఉండలేం. ఇళంగో రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 2023లో వచ్చిన శ్రీలంకన్ మూవీ 'టెంటిగో' ఆధారం. ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ నిర్మాత కావటం విశేషం. దీనిని తెలుగులో ‘పెద్ద’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయటానికి రెడీ అవుతున్నారు. సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన ఈ సినిమాకు తమిళనాట క్రిటికల్ గా ప్రశంసలు దక్కినా కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు.
నటీనటులు విషయానికి వస్తే సునీల్ రెడ్డి, వైభవ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సహజంగా మన ఇళ్ళ చుట్టుపక్కలతో పాటు బంధువులలో వివిధ మనస్థత్వాలతో ఉండే మనుషులు, వారి క్యూరియాసిటీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. పాయింట్ కొత్తదైనప్పటికీ కొంచెం ఇబ్బంది కలిగించేది కావటంతో జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి. దానిని దర్శకుడు ఇళంగో రామ్ శ్రుతి మించకుండానే తీయగలిగాడు. అరుణ్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. వన్ టైమ్ వాచబుల్ మూవీ.
ట్యాగ్ లైన్: వన్ టైమ్ వాచబుల్
రేటింగ్ : 2.5/5