Web Series Review: 'పాతాళ్ లోక్-2’ రివ్యూ
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:10 PM
ఇండియన్ డిజిటల్ స్పేస్ టాప్ 5 సిరీస్‌లో ‘పాతాళ్ లోక్’ పక్కగా ఉంటుంది. ఇప్పుడు ఆ సిరీస్‌కు కొనసాగింపుగా సెకండ్ సీజన్ 'పాతాళ్ లోక్-2 వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఎలా ఉంది?
వెబ్‌సిరీస్ రివ్యూ: 'పాతాళ్ లోక్-2’
స్ట్రీమింగ్ డేట్: 17-01-2025
ఓటీటీ: అమేజాన్ ప్రైమ్ వీడియో
నటీనటులు: జైదీప్ అహ్లావత్, ఇష్వాక్ సింగ్, నగేష్ కుకునూర్, తిలోత్తమా షోమే, ఆనందిత బోస్, నిహారిక దత్, కాగిరంగ్ తదితరులు
కథ: సుదీప్ శర్మ
సంగీతం: బెనెడిక్ట్ టైలర్, నరేన్ చందవర్కర్, వినీత్ డిసౌజా
నిర్మాతలు: కర్ణేష్ శర్మ, బబిత్ అశివాల్
సినిమాటోగ్రఫీ-దర్శకత్వం: అవిన్ష్ అరుణ్ ధవారే
'పాతాళ్ లోక్' సీజన్-1 ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందో. 'ఎన్‌హెచ్10', 'ఉడ్తా పంజాబ్' వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన సుధీప్ శర్మ ఈ సిరీస్ సృష్టికర్త. కరోనా, లాక్‌డౌన్, ఓటీటీకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్న సమయంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ ఇది. 2020లో ఓ సెన్సేషన్. సిల్లీ కాన్ ఫ్లిక్ట్ పాయింట్‌తో.. సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లింగ్ డ్రామాను క్లోజ్ చేయవచ్చని నిరూపించిందీ సిరీస్. ఇండియన్ డిజిటల్ స్పేస్ టాప్ 5 సిరీస్‌లో ‘పాతాళ్ లోక్’ పక్కగా ఉంటుంది. ఇప్పుడు ఆ సిరీస్‌కు కొనసాగింపుగా సెకండ్ సీజన్ 'పాతాళ్ లోక్-2 వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఎలా ఉంది? ఇందులో హాతిరాం చౌదరి చేసిన సాహసం ఏమిటి? ఎలాంటి సవాళ్లు అనేది చూద్దాం..
కథ: (Paatal lok 2 Story)
ఢిల్లీని వణికించిన సీనియర్ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా కేస్ డీల్ చేసిన హాతిరాం చౌదరి (ప్రదీప్ అల్హావత్) మళ్లీ తన స్టేషన్ లో ఎప్పట్లానే చిన్న చిన్న కేసులను పరిష్కారం చేస్తుండగా తర భర్త కనిపించడం లేదు అంటూ పోలీస్ స్టేషన్‌కి వచ్చిన వివాహిత మరియు ఆమె కొడుకుని చూసి కదిలిపోయిన హాతిరాం, తప్పిపోయిన రఘు పాశ్వాన్ (శైలేష్ కుమార్) కోసం వెతకడం మొదలెడతాడు. ఊహించని విధంగా నాగాల్యాండ్‌కు చెందిన ఓ డెలిగేట్ అత్యంత దారుణంగా హతమార్చబడతాడు. ఆ కేస్‌ను ఐపీఎస్ అన్సారి (ఇశ్వాక్ సింగ్) డీల్ చేస్తుంటాడు. హాతిరాం - అన్సారీ కలిసి నాగాల్యాంగ్ వెళతారు. అక్కడ కేస్‌ను డీల్ చేస్తుండగా, అనుకోని అడ్డంకులు తలెత్తుతాయి. నాగాల్యాండ్ డెలిగేట్‌ను చంపింది ఎవరు? ఆ హత్యతో రఘుకి సంబంధం ఏమిటి? ఈ కేసును హతీరాం చౌదరి ఎలా డీల్ చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సిరీస్.
విశ్లేషణ: Paatal lok 2 web series Review)
ఏ సిరీస్ సక్సెస్ అయినా ఆపకుండా చూసేలా చేయడంలోనే ఉంటుంది. ఒక ఎపిసోడ్ పూర్తయిన వెంటనే నెక్ట్స్ ఎపిసోడ్ చూడాలి అనిపించేలా చేయడంలో క్రియేటర్ ప్రతిభ తెలుస్తుంది. పాతాళ్ లోక్’ మొదటి సీజన్ విషయంలో ఇదే జరిగింది. ఎపిసోడ్ పూర్తికాగానే మరో ఎపిసోడ్.. ఇలా ఎంతో ఆసక్తిగా సాగింది. మరి రెండో సీజన్ విజయానికొస్తే ఆ కథకు కొనసాగింపుగా వచ్చినా అంతగా ఎంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక్కడంతా డ్రామా, ఎమోషన్ మీద నడిచింది. ఇన్వెస్టిగేషన్ డీటెయిలింగ్ మిస్ అయింది. మొదటి సీజన్‌లో హతోడా త్యాగి పాత్ర చాలా కీలకం. బలమైన విలన్ పాత్ర అది. ఇందులో ఆ పాత్ర తరహా పాత్ర పడకపోవడం సోసోగా అనిపిస్తుంది. సీజన్ 1 విపరీతంగా నచ్చినట్టు అయితే సీజన్ 2 ఆ రేంజ్ లో ట్రీట్ ఇవ్వకపోవచ్చు. పైగా ఎనిమిది ఎపిసోడ్స్ ఒక్కొకటి నలభైకు పైగా నిమిషాలు ఉండటం, ఆసక్తికర సన్నివేశాలు లేకపోవడంతో స్లోగా అనిపిస్తుంది. మొదటి సీజన్‌లో ప్రతి సీన్స్‌ను, పాత్రను నేచురల్‌గా చూపించారు. ఇక్కడ అది మిస్ అయింది. అయితే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్‌లు, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ముందు ఏం జరగబోతుందనే ఆసక్తిని కలిగిస్తాయి. వీటితో పాటుగా అన్సారీ, హతీరాం పాత్రల నడుమ నడిచే సన్నివేశాలన్నీ ఆ పాత్రలు ఇష్టపడే వారికి నచ్చుతాయి. సీజన్ 1 లో ఉన్న అందరూ నటీనటులు ఇందులో కావాలి అనుకున్నవారు తప్పకుండా నిరాశపడతారు. అయితే మొదటి సీజన్‌కు, ఈ సీజన్‌కు చాలా తేడా ఉంది. అందులో కనిపించే సాలిడ్ వైలెన్స్, అడల్ట్ సీన్స్ ఇందులో లేవు. మొదటి నాలుగు ఎపిసోడ్లు క్లైమాక్స్ వరకూ అంత ఎగ్జైటింగ్‌గా అనిపించవు. యాక్షన్, ఎమోషన్స్ ఇంకా బలంగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. (Paatal lok 2 Review)
నటీనటుల పనితీరు: ఆర్టిస్ట్‌గా జయదీప్ అలావత్ సత్తా ఏంటనేది తొలి సీజన్‌లో చూశాం. ఇందులో కూడా ఏమాత్రం తగ్గకుండా నటన కనబరిచాడు. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రను క్యారీ చేయడంలో జయదీప్ చూపించే పరిణితి అద్భుతంగా ఆకట్టుకుంటుంది. హాతిరాం చౌదరి పాత్ర కొన్నాళ్లు గుర్తుండి పోతుంది. మొదటి సీజన్‌లో సాధారణ పోలీస్ అధికారి ఇమ్రాన్ అన్సారీగా కనిపించిన ఇశ్వాక్ సింగ్.. సెకండ్ సీజన్ లో ఐపీఎస్ ఆఫీసర్ గా అలరించాడు. అతడి పాత్రలో నిజాయితీతో పాటు అమాయకత్వం కనిపిస్తుంది. మరో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా తిలోత్తమ చాలా సహజంగా నటించింది. నగేష్ కుకునూర్ ఓ బిజినెస్ మ్యాన్‌గా కనిపించాడు. అనురాగ్ అరోరా, గుల్ పనాగ్ తదితరులు పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయానికొస్తే.. సుదీప్ శర్మ రైటింగ్ ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్. మొదటి సీజన్లో ఎండింగ్‌తో ఈ సిరీస్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. హతోడా త్యాగి ఎందుకని సంజీవ్ మెహ్రాను హత్య చేయకుండా వదిలేశాడు అనే కీలకమైన పాయింట్‌కు సుదీప్ ఇచ్చిన రీజన్ ఆసక్తికరంగా ఉంది. అలాంటి సుదీప్.. సెకండ్ సీజన్‌ను చాలా పకడ్బందీగా రాసుకున్నాడు. ముఖ్యంగా నాగా ల్యాండ్ ఎపిసోడ్స్ - కీ ట్విస్ట్‌ను రివీల్ చేసిన విధానం బాగుంది. ఒక రచయితగా క్యారెక్టర్ ఆర్క్స్ ఎలివేట్ చేసిన తీరు అభినందనీయం. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అవిన్ష్ అరుణ్ ధావరే చిన్న చిన్న లోపాలు మినహా తెరకెక్కించే విధానంలో పెద్దగా పొరపాట్లు చేయలేదు. కథలో ఏముందో అదే తెరకెక్కించాడు. అతడే సినిమాటోగ్రాఫర్ కూడా కావడంతో కథకు తగ్గట్లు ఫ్రేమింగ్స్ చేసుకున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్‌ను చూపించిన విధానం బావుంది. మొదటి సీజన్ చాలా రియలిస్టిక్‌గా ఉండగా, సెకండ్ సీజన్‌లో అది మిస్ అయింది. ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ వర్క్ బాగున్నాయి. యాక్షన్ బ్లాక్స్‌ను రియలిస్టిక్, లాజికల్‌గా డీల్ చేసారు. ఒక సిరీస్ సక్సెస్ అయితే దానికి కొనసాగింపుగా వచ్చే దానిపై కూడా అంచనాలు భారీగా ఉంటాయి. సెకండ్ సీజన్ కూడా మొదటి సీజన్ స్థాయిలో ఆకట్టుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అయితే పాతాళ్ లోక్ -2 ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ మొదటి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్ చూస్తే.. అంతగా సంతృప్తి చెందకపోవచ్చు.
టాగ్ లైన్: మొదటి సీజన్ తో పోలిస్తే.. కాస్త స్లోనే