Thandel Review: నాగ చైతన్య తండేల్ మూవీ రివ్యూ 

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:59 AM

నాగచైతన్య, సాయిపల్లవిలది హిట్‌ కాంబో. వీరిద్దరూ ఇప్పటికే లవ్‌స్టోరీ సినిమా చేశారు. ఈ ఇద్దరూ హీరోహీరోయిన్లుగా గీతా ఆర్ట్స్‌ సంస్థ 'తండేల్‌' చిత్రాన్ని ప్రకటించడం, వాస్తవ కథతో ఈ చిత్రం రాబోతుందనే విషయం బయటకు రావడంతో సినిమాకు మంచి బజ్‌ ఏర్పడింది.

సినిమా రివ్యూ: తండేల్‌ (Thandel Review)
విడుదల తేది: 7–2–2025
థియేటర్‌: ప్రసాద్స్‌ ఐమాక్స్‌
నటీనటులు: నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi), పృథ్వీరాజ్‌, దివ్యాపిళ్లై, ప్రకాశ్‌ బెలవాడీ, కల్పలత, మహేశ్‌ ఆచంట, శివ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కెమెరా: శ్యామ్‌దత్‌
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్‌
నిర్మాత: అల్లు అరవింద్‌, బన్నీ వాసు
దర్శకత్వం: చందూ మొండేటి (Chandoo Mondeti)

నాగచైతన్య, సాయిపల్లవిలది హిట్‌ కాంబో. వీరిద్దరూ ఇప్పటికే లవ్‌స్టోరీ సినిమా చేశారు. ఈ ఇద్దరూ హీరోహీరోయిన్లుగా గీతా ఆర్ట్స్‌ సంస్థ 'తండేల్‌' చిత్రాన్ని ప్రకటించడం, వాస్తవ కథతో ఈ చిత్రం రాబోతుందనే విషయం బయటకు రావడంతో సినిమాకు మంచి బజ్‌ ఏర్పడింది. పైగా దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు అందరినీ మెప్పించడం, అల్లు అరవింద్‌ పబ్లిసిటీ స్ట్రాటజీతో సినిమాకు మరింత హైప్‌ వచ్చింది. నాగచైతన్య కూడా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న తరుణమిది. ఈ సినిమాపై ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. షూటింగ్‌ పూర్తయినప్పటి నుంచే ుథియేటర్‌లో దుల్లగొట్టేదాం్ద.. ఇక రాజులమ్మ జాతరే’ అంటూ ప్రమోషన్‌ చేసిన ఈ సినిమా అంచనాలను చేరుకుందా? నాగచైతన్యకు హిట్‌ పడిందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే... (Thandel Review)

కథ: Thandel Story)

రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) మత్య్సకారులు కుటుంబానికి చెందిన వారు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణం. సముద్రంలో చేపలు పట్టడం రాజు జీవనాధారం. తొమ్మిది నెలలు సముద్రంలో ఉంటే, మూడు నెలలు ఊర్లో ఉంటాడు. ఆ తొమ్మిది నెలలు రాజు, సత్య ఒకరికోసం ఒకరు విరహవేదనతో రగిలిపోతుంటారు. ఫోన్‌లో మాట్లాడే ఒక్క రోజు కోసం నెలంతా ఎదురు చూస్తుంటారు. ఈ దూరం భరించలేని సత్య, వేటకు వెళ్తే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అనే భయంతో ఇక ముందు వేటకు వెళ్లవద్దని, ఊళ్లోనే ఉండి ఏదైనా పని చూసుకోమని చెబుతుంది. అలాగే అని మాటిచ్చిన రాజు, మళ్లీ సముద్రంలోకి వేటకు వెళ్లిపోతాడు. దాంతో రాజుపై అలకతో అతనికి దూరమవుతుంది. ఇద్దరి మధ్య మాట మంచి ఏమీ ఉండదు. సముద్రంలో వేటకు వెళ్లిన రాజు.. అతని బృందం22 మంది ప్రయాణించే బోటు తుఫాను తాకిడికి పొరపాటున పాకిస్థాన్‌ బోర్డర్‌లోకి ప్రవేశిస్తుంది. దాంతో అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. పాకిస్థానీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో సత్య, రాజుల మధ్య దూరం మరింత పెరుగుతుంది. మళ్లీ వారిద్దరూ ఎలా కలిశారు? పాకిస్థాన్‌ చెర నుంచి ఎలా భయపడ్డారు అనేది కథ.


Thandel.jpgవిశ్లేషణ: (Naga Chaitanya, Sai Pallavi Starrer Thandel Review)
ఉత్తరాంధ్ర మత్య్సకారుల జీవితంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. నిజ జీవితంలో ఈ కథ అందరికీ తెలిసిందే. వాస్తవిక కథను సినిమాగా తెరకెక్కించాలంటే కొంత సినిమాటిక్‌ లిబర్టీ, కమర్షియల్‌ అంశాలు జోడించక తప్పదు. దర్శకుడు చందూ మొండేటి అదే చేశాడు.  తనకు ఇష్టం లేకుండా సముద్రం మీదకు వేటకు వెళ్లిన రాజుపై అలిగిన సత్యని చూపిసూ కథకు పునాది వేశాడు దర్శకుడు. ఇద్దరి మధ్య ప్రేమతో మొదలైన కథ దూరం, విరహంతోనే సాగుతుంది. నాయకుడి లక్షణాల కోసం రాజు పాత్రకు కొన్ని సీన్లు రాసుకున్నాడు. అవన్నీ కూడా బాగా వర్కవుట్‌ అయ్యాయి.   ఇసుక తవ్వకాలు, యాస, భాష గురించి చెప్పిన సన్నివేశం ఇరికించిన భావన కలుగుతుంది. ఇలాంటి మట్టి కథల్లో కొన్ని సన్నివేశాలు నిజయతీగా, రియలిస్టిక్‌గా చూపించడమే ప్లస్‌ అవుతుంది. ఇక్కడ అది జరగలేదు. సినిమాటిక్‌ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు. తెలిసిన కథని కొత్తగా తీర్చిదిద్దడం అంత ఈజీ కాదు. అందరినీ మెప్పించాలి... కొత్తగా ప్రజంట్‌ చేసేలా ప్రయత్నం చేయాలి. ఈ కథ విషయంలో దర్శకుడు చందూ ఎక్కువగా భావోద్వేగాన్ని ఎలివేట్‌ చేయడం మీదే దృష్టి పెట్టారు. దానినే కొత్తగా చూపించే ప్రయత్నం చేయలేదు. దాంతో ఫస్టాఫ్‌ నత్తనడకన సాగుతుంది.  

దేవిశ్రీ ప్రసాద్‌ (DeviSri Prasad Music) సంగీతం, హైలెస్సో, శివయ్య పాట కాస్త రిలీఫ్‌ ఇస్తాయి. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌కి ముందు సముద్రంలో తుఫాను,   అక్కడ చిక్కుకున్న బోటు విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. రాజు బృందం పాకిస్థాన్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించడం, నేవీ డిపార్ట్‌మెంట్‌ అరెస్ట్‌ చేసే సన్నివేశాలను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బావుండేది. ఇక దేశభక్తి సంబంధించిన సీన్లు సెకెండాఫ్‌లో కనిపిస్తాయి. కొన్ని చోట్ల.. పాత్రలను ఫీలయ్యే ఎమోషన్‌ ప్రేక్షకుల్లో కలుగుతుంది. పాకిస్థానీ ప్రిజన్‌లో పలు సన్నివేశాలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయి. సత్య పాత్ర గుజరాత్‌ వెళ్లి తమకు రావాల్సిన డబ్బుని సాధించిన సీన్‌ మరీ పేలవంగా ఉంది. పొరుగు దేశం లో ఇరుక్కుపోయిన తన వారిని రక్షించుకోవడానికి ఢిల్లీలో కథానాయిక చేసిన ప్రయత్నం మనసుకు హత్తుకునేలా లేదు. క్లైమాక్స్‌లో మాత్రం 22మందిలో ఓ మనిషి ఆగిపోయాడని, ప్రేమను, పెళ్లిని కాదనుకుని రాజు మళ్లీ పాకిస్థాన్‌ బోర్డర్‌లోకి వెళ్లి కూర్చున్న సన్నివేశం హై మోమెంట్‌ ఇస్తుంది. ఆ సీన్‌ మాత్రం నిజయతీగా అనిపిస్తుంది. అయితే దర్శకుడు చందు ప్రేమకథ, దేశభక్తి ఈ రెండింటి విషయంలో సంఘర్షణకు గురైనట్లు అనిపిస్తుంది.



Thandel-2.jpgనటీనటులు పనితీరు..

నాగచైతన్య, సాయిపల్లవి జంటను లవ్‌స్టోరీలో చూశాం. తెరపై వీరిద్దరి మంచి పెయిర్‌. నటన పరంగా ఇద్దరికీ పేరు పెట్టలేం. సినిమాకు మెయిన్‌ పిల్లర్స్‌గా నిలిచారు. తండేల్‌ రాజుగా నాగచైతన్య, చిట్టితల్లిగా సాయిపల్లవి పాత్రల్లో ఇమిడిపోయారు. వాళ్లిద్దరి ఽమధ్య కెమిస్ట్రీ కెరటాల ఎగసిపడింది. కొన్ని సాధారణ సన్నివేశాలు కూడా తెరపై పండాయంటే ఈ జంటే కారణం. దుస్తుల నుంచి మాట తీరు యాస వరకూ దర్శకుడు చక్కగా ప్లాన్‌ చేశారు. శ్రీకాకుళం యాసను మాగ్జిమమ్‌ మ్యాచ్‌ చేయడానికి ప్రయత్నం చేశారు. హైలెస్సో, శివయ్య పాటలో హీరోహీరోయిన్‌ తాండవం ఆడేశారు. అయితే తెరపై ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ కనిపించే సాయిపల్లవి ఈ సినిమాలో ఎక్కువ శాతం ఏడుస్తూనే కనిపిస్తుంది. అది ఆమె అభిమానులకు నచ్చకపోవచ్చు. అయినా తనదైన నటనతో బోర్‌ కొట్టకుండా చేసింది. ఆడుకాలం నరేన్‌, ప్రకాష్‌ బెలవాడీ.. ఫర్వాలేదనిపించారు. పెళ్లి కొడుకు పాత్రలో తెలుగు నటుణ్ణి తీసుకుంటే బావుండేది. కల్పలతా, పృధ్వీ, కరుణాకరన్‌, మహేశ్‌ తదితరులు పాత్రల మేరకు బాగానే చేశారు. (Thandel Review)
సాంకేతిక విషయాలకొస్తే. శ్యామ్‌దత్‌ కెమెరా పనితీరు సినిమాకు ఎసెట్‌. సినిమాల్లో డ్రాబ్యాక్స్‌ ఉన్నా.. దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు, నేపథ్య సంగీతం ఆ భావన కలగకుండా ముందుకు తీసుకెళ్లింది. ఈ సినిమాకు తెరవెనుకున్న హీరో దేవిశ్రీ ప్రసాద్‌ అనే చెప్పాలి. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో దేవి ఇచ్చిన స్కోర్‌కి కంటతడి రాక మానవు. దర్శకుడు రాసిన మాటల్లో పెద్దగా మెరుపులు లేవు. తెలిసిన కథ కాబట్టి స్ర్కీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవలసింది. మేకింగ్‌లో నిర్మాణ సంస్థ ఎక్కడా తగ్గలేదు. విజువల్‌గా సినిమా గ్రాండియర్‌గా ఉంది. (Geetha Arts)

ప్రేమ, దేశభక్తి కథలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌. వీటికి ఎక్స్‌పైరీ ఉండదు. ఎన్ని సార్లు ఎన్ని కోణాల్లో చూసిన బోర్‌ కొట్టదు. ఈ రెండింటినీ కలిపి తీసిన సినిమా ఇది. అక్కడక్కడా మైనస్‌లు ఉన్నా హీరోహీరోయిన్ల నటన, సంగీతం, విజువల్స్‌ పర్ఫెక్ట్‌గా ఉండటంతో ఈ సినిమా మెప్పిస్తుంది. అక్కినేని ఫ్యాన్స్‌ హిట్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వారి హిట్‌ ఆకలిని పూర్తిగా తీర్చేలా లేకపోయినా అసంతృప్తి కలిగించకుండా తండేల్‌ ఉంటుంది.

ట్యాగ్‌లైన్‌: తండేల్‌ రాజు – రాణి.. ఎమోషనల్‌ జర్నీ

Updated Date - Feb 07 , 2025 | 02:02 PM