JNAK Review: ధనుష్ దర్శకుడు.. మేనల్లుడు హీరో .. సినిమా ఎలా ఉందంటే
ABN , Publish Date - Feb 21 , 2025 | 12:01 PM
తమిళ నటుడు ధనుష్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. నటుడిగానే కాకుండా, గాయకుడిగా, దర్శకుడిగా నిరూపించుకున్నారు. గత ఏడాది రాయన్ చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్‌హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. ఆయన మేనల్లుడు పవిష్ నారాయణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా రివ్యూ: ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama Movie review)
విడుదల తేది: 21-2-2024
నటీనటులు: పవీష్ నారాయణ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాధ్యూ థోమస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖాటూన్, రమ్యా రంగనాథన్, ఆడుకాలమ్ నరేన్, శరణ్య, ఆర్ శరత్‌కుమార్, ప్రియాంక మోహన్ తదితరులు.
సాంకేతిక నిపుణులు
కెమెరా: లియోన్ బ్రిటో
సంగీతం:జీవీ ప్రకాశ్‌కుమార్
ఎడిటింగ్: ప్రసన్న జీకే
నిర్మాతలు: ధనుష్; కస్తూరి రాజా, విజయలక్ష్మీ కస్తూరి
దర్శకత్వం: ధనుష్(Dhanush)
తమిళ నటుడు ధనుష్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. నటుడిగానే కాకుండా, గాయకుడిగా, దర్శకుడిగా నిరూపించుకున్నారు. గత ఏడాది రాయన్ చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్‌హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. ఆయన మేనల్లుడు పవిష్ నారాయణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు నెట్టింట హల్‌చల్ చేశాయి. ట్రైలర్‌లో ుజాలీగా రండి.. జాలీగా వెళ్లండి’ అని ధనుష్ చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అన్నది చూద్దాం.
కథ: (Jabilamma Neeku Antha Kopama Movie Review)
ప్రభు (పవిష్) ఒక చెఫ్. ఇంట్లో అతనికి పెళ్లి సంబంధాలు చూస్తారు. అప్పటికే నీలా (అనికా సురేంద్రన్)తో అతనికి బ్రేకప్ అవుతుంది. తదుపరి పెళ్లి చూపుల్లో అమ్మాయి (ప్రియా ప్రకాష్ వారియర్)ని చూసి ప్రభు షాక్ అవుతాడు. ఇద్దరూ చిన్నప్పుడు క్లాస్‌మేట్స్. వారం రోజులు జర్నీ చేశాక పెళ్లి మీద నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. అయితే నీలా పెళ్లి పత్రిక చూసి ప్రభు డీలా పడతాడు. తన ఫ్రెండ్ అడగగా నీలా కథతో ప్రేమకథ, బ్రేకప్ గురించి చెబుతాడు. నీలా తండ్రితో ప్రభుకి మధ్య సమస్య ఏంటి? ఇద్దరూ బ్రేకప్ చెప్పుకోవడానికి కారణమేంటి? డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పరిచయమైన అంజలి (రమ్య రంగనాథన్) ఏం చేసింది? నీలా పెళ్లి ఎవరితో జరిగింది అన్నది సింపుల్‌గా కథ.
విశ్లేషణ: (Jabilamma Neeku Antha Kopama Movie review)
దర్శకుడిగా ధనుష్ (Dhanush) తీసిన మూడో చిత్రమిది. యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ సినిమా. బ్రేకప్ సాంగ్‌తో సినిమా మొదలవుతుంది. ఓ మధ్య తరగతి కుర్రాడు, అత్యంత ధనిక కుటుంబంలో పుట్టిన అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథ ఇది. కొంత జర్నీ తర్వాత బ్రేకప్. మాజీ ప్రియురాలి పెళ్లికి అతిథిగా వెళ్లడం వంటివి చాలా సినిమాల్లో చూశాం. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఆసక్తికరం. ఇక్కడ కూడా అదే స్పెషల్. కథ మొదలై అప్పుడే ఇంటర్వెల్ అయిందా అనిపించేంత క్యూట్‌గా ప్రేమ కథ చూపించి, కొంత సేపు నవ్వులు పూయించి రొటీన్ లవ్ స్టోరీనే అయినా ఇంకాస్త ఉంటే బాగుండు అనిపించేలా చేశాడు దర్శకుడు. న్యూ ఏజ్, యూత్ పల్స్ పట్టుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యారు. ఈ జనరేషన్, టీనేజ్ యూత్ ఎలా ఉన్నారనేది చూపించాడు. అయితే ఇది కష్టమైన కథ కాదు.. కష్టంగానూ తీయలేదు. చెప్పాలనుకున్నది స్ట్రెయిట్ అండ్ సింపుల్ వేలో చెప్పారు. థియేటర్‌లో చప్పట్లు మోగి, ఈలలు కొట్టే కొన్ని సన్నివేశాలను ధనుష్ బాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ జనరేషన్ లవర్స్‌లో చాలామంది బుజ్జి, బుజ్జమ్మ.. కన్నా’ అంటూ ముద్దులు పెట్టుకోవడం చూస్తుంటాం. అటువంటి జంటను చూసి ‘ఏంట్రా ఇది?’ అంటే ‘క్రింజ్’ అని చెప్పడంతో థియేటర్లలో విజిల్స్ మోగాయి. ‘వీడేంట్రా ఇంత మంచోడు’ అనే సీన్ కూడా పేలింది. ప్రేమ, భావోద్వేగాలు, డీప్, డెప్త్ వంటి భారీ మాటలు ఎక్కడా ఇరికించలేదు. ధనిక అమ్మాయి పేదవాడి ప్రేమలో పడటం కొత్తేమీ కాదు. కానీ ఆ లైన్‌కు ధనుష్ చేసిన ట్రీట్‌మెంట్ బావుంది. క్యారెక్టర్స్ మీద ఎక్కువ భారం వేయకుండా సందర్భానుసారంగా ఫన్ ఇవ్వడానికి ఎక్కువ ట్రై చేశాడు. అయితే అది అక్కడక్కడా డల్ అయింది. సెకెండాఫ్ కాస్త వేగం పెరిగింది.
నటీనటుల విషయానికొస్తే.. ప్రభు పాత్రలో పవిష్ ఒదిగిపోయాడు. తొలి సినిమా అనే భావన ఎక్కడా కలిగించలేదు. నటనలో మేనమామ ధనుష్ తాలుక రిఫరెన్స్ కనిపించింది. పాత్రకు తగ్గట్లు చేసుకుంటూ వెళ్లిపోయాడు. అయితే పవిష్‌ను హీరోగా నిలబెట్టడానికి మంచి స్టోరీ ఎంచుకున్నాడు ధనుష్. భావోద్వేగాలు పండించడంలో ఇంకా పరిణితి చెందాలి. అనిఖా సురేంద్రన్ క్యూట్‌గా కనిపించింది. కొన్ని సీన్స్‌లో ఆమె ఏడుస్తుంటే నవ్వుతుందేమో అనే అనుమానం కలుగుతుంది. ఎక్స్‌ప్రెషన్స్ ఇంఫ్రూవ్ చేసుకోవాలి. అందంతో పాటు అభినయంతో రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ఆకట్టుకున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ నిడివి తక్కువ. ఉన్నంతలో బాగా కనిపించారు. ‘గోల్డెన్ స్పారో’ సాంగ్‌లో ప్రియాంకా అరుల్ మోహన్ మెరిశారు. హీరో ఫ్రెండ్ రాజేష్ రోల్ చేసిన మ్యాథ్యూ థామస్ (ప్రేమలు ఫేం)సినిమాకు మెయిన్ హైలెట్. అతను తెరపై కనిపించిన ప్రతిసారీ నవ్వులు పూయించాడు. నటన, టైమింగ్, డైలాగ్ డెలివరీ బావున్నాయి. శరణ్య పొన్‌వణ్ణన్, ఆర్.శరత్ కుమార్, ‘ఆడుకాలం’ నరేన్ పాత్రలు సోసోగా ఉన్నాయి. సాంకేతిక నిపుణులు పనితీరుకొస్తే లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ ప్లజెంట్‌గా ఉంది. జీవీ ప్రకాష్ పాటల్లో కొత్తదనం లేదు. ఆర్‌ఆర్ అక్కడక్కడా బాగానే అనిపించింది. పాటల్లో తెలుగు సాహిత్యం అర్థమయ్యేలా ఉండే బాగుండేది. డబ్బింగ్, లిప్‌సింక్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి. సీక్వెల్ అనౌన్స్‌మెంట్‌తో ఎండ్ కార్డు వేశాడు. ‘‘ఇదొక సాధారణ ప్రేమకథ’ అనే ట్యాగ్‌లైన్‌తో ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని దర్శకుడు ధనుష్ ముందే చెప్పాడు. ‘రాయన్’ లాంటి రస్టిక్ యాక్షన్ క్రైమ్ డ్రామా తీసిన ధనుష్ వెంటనే ఇలాంటి ఓ క్యూట్ లవ్ స్టోరీతో మేజిక్ చేశాడు. రోజూ చూస్తే జాబిలమ్మ అయినా, ఒక్కోరోజు చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే రొటీన్ లవ్ స్టోరీస్‌ని కాస్త ఎంగేజింగ్‌గా, ఎంటర్ టైనింగ్‌గా చెప్పగలిగితే ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’లాగా క్యూట్‌గా అనిపిస్తుంది. ఏ అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్తే హాయిగా నవ్వించే సినిమా ఇది.
ట్యాగ్‌లైన్: జాలీగా రండి.. జాలీగా వెళ్లండి!!