Back in Action Review: హెవీ యాక్షన్‌కు ఫ్యామిలీ టచ్
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:46 PM
కామెరాన్ డియాజ్ కామెడీ టైమింగ్‌కు తొలి నుంచి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. పదేళ్ల విరామం అనంతరం కామెరాన్ డియాజ్ నటించిన చిత్రం కావడంతో ‘బ్యాక్ ఇన్ యాక్షన్’పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా పేరులో యాక్షన్ ఉన్నా.. ఫ్యామిలీ టచ్‌తో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..
మూవీ పేరు: ‘బ్యాక్ ఇన్ యాక్షన్’
నటీనటులు: కామెరాన్ డియాజ్, జామీ ఫాక్స్, టామ్ బ్రిట్నీ, లీలా ఓవెన్ తదితరులు
దర్శకత్వం: సేథ్ గోర్డాన్
స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్
యాక్షన్ కామెడీ జోనర్ సినిమాలను ఇష్టపడే వ్యూవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న చిత్రం ‘బ్యాక్ ఇన్ యాక్షన్’. పదేళ్ల విరామం అనంతరం కామెరాన్ డియాజ్ నటించిన చిత్రమిది. జామీ ఫాక్స్ మరో లీడ్ రోల్‌లో నటించగా.. సేథ్ గోర్డాన్ దర్శకత్వం వహించాడు. సేథ్ గోర్డాన్, పీటర్ చెర్నిన్, జెన్నో టాపింగ్, షార్లా సమ్టర్, బ్యూ బామన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందంటే..
Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!
కథ: (Back in Action Story)
ఎమిలీ (కామెరాన్ డియాజ్) మరియు మాట్ (జామీ ఫాక్స్) అమెరికా శివార్లలో తమ ఇద్దరి పిల్లలతో నివసిస్తుంటారు. కుటుంబం కోసం వృత్తిని విడిచిపెట్టిన మాజీ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్‌గా పిల్లలకు తమ గతం తెలియకుండా కాలం గడుపుతుంటారు. మాట వినని టీనేజ్ కుమార్తెతో పాటు, విపరీతంగా వీడియో గేమ్స్ ఆడే కొడుకును క్రమశిక్షణలో పెట్టేందుకు భార్యభర్తలు తెగ కష్టపడుతుంటారు. అయితే వారి వద్ద ఉన్న ఓ చిప్ కోసం ఓ మాజీ పోలీస్ అధికారి వారిని సంప్రదించటంతో, కథ మొత్తం మారిపోతుంది. టెర్రరిస్ట్‌లకు వారు టార్గెట్‌గా మారడంతో.. కుటుంబాన్ని సేవ్ చేసుకునేందుకు అమెరికా నుంచి యుకెకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ ఏజెంట్స్‌గా వారికున్న పరిజ్ఞానంతో టెర్రరిస్ట్‌ల నుంచి అనేక అడ్వెంచర్స్ చేసి తప్పించుకుంటారు. కానీ వారి పిల్లలు కిడ్నాప్‌కు గురవటంతో ఎమిలీ, మాట్ కలిసి అసలైన యాక్షన్‌లోకి దిగుతారు. వారికి తోడుగా ఎంఐ16 మాజీ ఏజెంట్ అయిన ఎమిలి తల్లి గిన్నీ, ఆమె కుర్ర బాయ్ ఫ్రెండ్ లియో కూడా సాయపడతారు. చివరికి అటు చిప్‌ను, ఇటు పిల్లలను కాపాడుకోవటానికి వీరంతా ఎలాంటి సాహసాలు చేశారన్నదే ‘బ్యాక్ ఇన్ యాక్షన్’ సినిమా.
Also Read- Wife Off Movie Review: బావని చిన్నప్పుడే భర్తగా ఊహించుకున్న మరదలు వేశ్యగా ఎందుకు మారింది?
విశ్లేషణ:
కామెరాన్ డియాజ్ కామెడీ టైమింగ్‌కు తొలి నుంచి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రంలో కూడా ఆమె కుటుంబం కోసం కెరీర్‌ను వదిలేసిన తల్లిగా, తన పిల్లల పనులకు ఫ్రస్టేట్ అయ్యే పాత్రలో నటించి మెప్పించింది. జామి ఫాక్స్‌కు కామెరూన్ డియాజ్‌తో కెమిస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. మిగిలిన పాత్రల్లో గ్లెన్ క్లోజ్, కైల్ చాండ్లర్, మెక్‌కెన్నా రాబర్ట్స్, రైలాన్ జాక్సన్‌లు వారి పాత్రల పరిధిమేర నటించారు. యాక్షన్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ ‘బ్యాక్ ఇన్ యాక్షన్’ చిత్రాన్ని తెరకెక్కించినా.. ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం తీసిన సినిమా కావటంతో హెవీ యాక్షన్‌కు ఫ్యామిలీ టచ్ కూడా ఇచ్చాడు దర్శకుడు. కథా కథనాలు అక్కడక్కడా రొటీన్‌గా ఉన్నా, రేసీ స్క్రీన్‌ప్లే ఉండటంతో మూవీ బోర్ కొట్టదు. తెలుగులోనూ ఈ సినిమా అనువాదరూపంలో చూసేందుకు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఓటీటీ ప్రియులకు, అందునా యాక్షన్ ప్రియులకు టైమ్ పాస్ సినిమా ఇది. (Back in Action Movie Review)