Kingston Review: జీవీ ప్రకాశ్‌ 25వ సినిమా ఎలా ఉందంటే..

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:42 PM

జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (Gv Prakash) మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. సంగీత దర్శకుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన నటుడిగానూ అడుగులు వేశారు. ఆయన నటించిన 25వ చిత్రం 'కింగ్‌స్టన్‌’. ఈ సినిమాతో నిర్మాతగానూ మారారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా?

సినిమా రివ్యూ: కింగ్‌స్టన్‌ (Kingston Movie Review)
విడుదల తేది: 7-3-2025
నటీనటులు: జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (Gv Prakash), దివ్య భారతి, చేతన్‌, ఆళగన్‌ పెరుమాళ్‌ తదితరులు,
సాంకేతిక నిపుణులు:
కెమెరా: గోకుల్‌ బినోయ్‌
సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
నిర్మాత: జీవీ ప్రకాశ్‌ కుమార్‌, ఉమేష్‌ బన్సల్‌
రచన, దర్శకత్వం: కమల్‌ ప్రకాశ్‌.
 

జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (Gv Prakash) మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. సంగీత దర్శకుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన నటుడిగానూ అడుగులు వేశారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగానూ ఎదిగారు. హీరోగా ఇప్పటికి 25 సినిమాలు పూర్తి చేశారు. ఆయన నటించిన 25వ చిత్రం 'కింగ్‌స్టన్‌’. ఈ సినిమాతో నిర్మాతగానూ మారారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా?  

కథ: (
Kingston Movie Review)


తమిళనాడు సముద్ర తీరంలోని ఓ గ్రామంలో జరిగే కథ ఇది. 1982లో చోటుచేసుకున్న ఓ సంఘటన ఆ ఊరి స్థితిగతుల్నే మార్చేస్తుంది. మత్స్యకారులైన ఊరి ప్రజలు సముద్రంలోకి వెళితే చాలు.. శవాలై తిరిగొస్తుంటారు. స్టీఫెన్‌ బోస్‌ (అళగన్‌ పెరుమాళ్‌) అనే ఒక్కడి అత్యాస వల్లే ఈ మరణాలు అని.. ఊరి ప్రజలు భావించి అతన్ని కొట్టి చంపేస్తారు. ఆ కోపంతో అతని ఆత్మ ఆ ఊరిని పట్టి పీడిస్తోందని వాళ్ల భయం. పెరుమాళ్‌ సమాధి ఊరిలో ఉంటే, ఆ ఊరు బాగుపడదని సముద్రంలోనే సమాధి చేస్తారు. అప్పటి నుంచి ఆ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతుంటారు ఆ ప్రాంతవాసులు. దాని వల్ల 43 ఏళ్లు ఊరి ప్రజలు చేపల వేటకు వెళ్లరు. వాళ్లంతా సాల్మాన్‌ (చేతన్‌) దగ్గరే పని చేస్తుంటారు. మార్టిన్‌ ఊరి ప్రజలకు పెద్ద దిక్కు. అతని దగ్గర నమ్మకస్తుడు కింగ్‌ (జీవీ ప్రకాష్‌ కుమార్‌). కింగ్‌కి డబ్బంటే పిచ్చి. అందుకోసం ఏమైనా చేస్తాడు. దాన్ని ఆసరాగా తీసుకొని సాల్మాన్‌ చేపల వేట పేరుతో స్మగ్లింగ్‌ చేయిస్తుంటాడు. ఆ కారణంలోనే కింగ్‌ని నమ్ముకొచ్చిన ఓ కుర్రాడు అకారణంగా చనిపోవాల్సివస్తుంది. దాంతో సాల్మాన్‌తో గొడవ పెట్టుకొంటాడు కింగ్‌. సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదన్నది అబద్ధమని, సముద్రంలోకి వెళ్లి చేపల్ని వేటాడి పట్టుకొస్తానని శపథం చేస్తాడు. వేటకు వెళ్లిన సమయంలతో అక్కడ ఏం జరిగింది. అసలు  సముద్రంలో ఏముంది? ఆ ఊరి ప్రజల నమ్మకాలు నిజమేనా? ఇంతకీ సముద్రంలో ఉన్న ఆత్మ కథేమిటి? అన్నది తెరపైనే చూడాలి.


kings.jpg
విశ్లేషణ:
ఈ కథలో చాలా లేయర్లు ఉన్నారు. సముద్రపు వేట, అక్కడ జరిగే స్మగ్లింగ్‌ ఒకటైతే.. ఆత్మలు, అక్కడి మర్మ రహస్యాలు, సముద్రపు నిధి.. ఇలా చాలానే ఉన్నాయి. వీటి వేటలో సాగే కథలో ఓ లవ్‌స్టోరీ, రివేంజ్‌ డ్రామా. ఇన్ని అంశాలను కథగా అల్లి తెరపై చూపించాలనుకోవడం సాహసమే. 80వ దశకం నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ కథ మొదలు పెట్టాడు దర్శకుడు. కింగ్‌ చేేస పనులు, సాల్మాన్‌కి సపోర్ట్‌గా వ్యవహరించడం, శవం పక్కన పెట్టుకొని డబ్బుల కోసం ఆశ పడడం.. ఇలాంటి సీన్లు పెద్దగా ఆసక్తి కలిగించవు. మరో కోణంలో ఆత్మల గురించి ఊరి జనాల్లో ఉన్న భయాలు, థామస్‌ చేేస అక్రమ వ్యవహారాలు, కింగ్‌ బృందం ఎదురుతిరగడం తదితర సన్నివేశాలు కీలకంగా ఉంటాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు కింగ్‌ ప్రేయసి రోజీ (దివ్యభారతి) నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్‌ అలరిస్తుంది. అక్కడినుంచి ఆసక్తికరంగా మొదలయ్యే ద్వితీయార్థంలోనే అసలు కథ ఉంటుంది. ‘డబ్బు కోసం ఏదైనా చేస్తా’ అనే హీరో, ఒక్కసారిగా మంచివాడిగా మారిపోతాడు. అది ప్రేక్షకుడికి మింగుడు పడని అంశం. అక్కడ బలమైన కారణం చెప్పుండాల్సింది. విలనిజం కూడా అంతగా పండలేదు. సాల్మన్‌ పాత్ర తూతూ మంత్రంగానే ఉంది. సముద్రంలో సాగే సాహసయాత్ర ఈ సినిమా. హారర్‌, థ్రిల్లింగ్‌ అంశాలు, నేపథ్య సంగీతం సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. మాస్‌ ఆడియన్స్‌కి కావాలసని ముడి సరుకు అంతా ఈ సినిమాలో ఉంది. కానీ తెరపై చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. కథను అటు ఇటు తిప్పి.. అతను కన్‌ఫ్యూజ్‌ అయి.. జనాల్ని కన్‌ఫ్యూజ్‌ చేశాడు. ద్వితీయార్థం కాస్త కన్వెస్‌ చేసేలా చూపించాడు. హారర్‌ అంశాలతో భయపెట్టడంలో సెకండాఫ్‌ సక్సెస్‌ అయింది. స్ర్కీన్‌ప్లే విషయంలో కొన్ని లోపాలున్నాయి. ఇది డబ్బింగ్‌ సినిమా అనే అణువణువున తెలిసేలా ఉంది. అనువాదం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బావుండేది.  

 
ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే.. జీవీ ప్రకాష్‌కుమార్‌ మత్స్యకార కుటుంబానికి చెందిన కుర్రాడిగా ఒదిగిపోయాడు. చక్కని నటన కనబర్చాడు. కింగ్‌గా అతని నటన సహజంగా ఉంది. పల్లెటూరి యువతిగా డీ గ్లామర్‌ పాత్రలో దివ్యభారతి మెప్పించింది. నటనకు ఆస్కారమున్న పాత్ర ఇది. బోసయ్య పాత్రలో అళగన్‌ పెరుమాళ్‌, థామస్‌ పాత్రలో సబూమాన్‌ ఫర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సినిమా క్వాలిటీగా ఉంది. విజువల్స్‌ సినిమాకి ప్రధాన బలం.  కెమెరా వర్క్‌ చాలా ప్రభావితం చేసింది. జీవీ నేపథ్య సంగీతం  సినిమాకి మరో హైలైట్‌. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు బావున్నాయి. కొత్త నేపథ్యాన్ని చూపించి దర్శకుడు థ్రిల్‌ చేశాడు. కానీ కథ చెప్పడంలో తడబాటు పడటం సినిమాకు మైనస్‌ అయింది. ప్రేమ, రివేంజ్‌ ఉన్నా.. అందులో భావోద్వేగాలను ఇమడ్చలేకపోయాడు. సినిమా నేపథ్యం దేవర సినిమాను గుర్తు చేస్తుంది. అయితే అక్కడ ఆత్మలు లేవు అంతే. కథలో ట్విస్ట్‌లు థ్రిల్‌ పంచలేకపోయాయి.  ఇందులో సముద్ర గర్భంలో బంగారం ఎలా దొరికింది? ఆ నిధి ఎవరిది? అనేది  మధ్యలోనే వదిలేశారు. జానర్‌ పరంగా కొత్త సినిమా ఇది. సముద్రపు వేట, స్మగ్లింగ్‌, ఆత్మలు, అక్కడి మర్మ రహస్యాలు, సముద్రపు నిధి, వీటి వేట మఽధ్యలో ఓ లవ్‌స్టోరీ, రివేంజ్‌ డ్రామా.. ఇలా అన్ని అంశాలను కలిపి ప్రేక్షకులకు కనెక్ట్‌ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

ట్యాగ్‌లైన్‌: సముద్రంలో సాహసాలు..  ప్చ్‌... 

Updated Date - Mar 07 , 2025 | 04:46 PM